జ్వరాలతో తల్లడిల్లుతున్న పల్లెలుప్రభుత్వాసుపత్రులంటే హడల్లోపిస్తున్న జవాబుదారీ తనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యం పడకేస్తోంది. ప్రజలు రోగాలతో బాధ పడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవటం లేదు. దీంతో జనం హడలిపోతున్నారు.
కొత్త మాజేరు గ్రామమే ఉదాహరణకృష్ణా జిల్లా కొత్త మాజేరు గ్రామంలో విష జ్వరాల బారిన పడి 19 మంది దాకా కొన్ని నెలల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్క డ పర్యటించి చర్యలు తీసుకోవాలని కోరినా యంత్రాంగంలో స్పందన శూన్యం. సురక్షిత తాగునీరు అందక జనం ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీన్ని కూడా రాజకీయాల కోణంలోనే చూశారు. చివరకు బాధితులతో కలిసి జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టారు. అయినా సరే చర్యలు చేపట్టకుండా నాన్చుతోంది.
గుంటూరు ఆసుపత్రి అధ్వానంగుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూలో ఉన్న ఒక శిశువుపై ఎలుకలు దాడి చేశాయి. ఆసుపత్రి నిండా ఎలుకలు సంచరిస్తున్నాయని మొత్తుకొంటున్నా సిబ్బంది పట్టించుకోలేదు. మూడు రోజుల క్రితం ఒకసారి కొరికేస్తే ఫిర్యాదు ఇచ్చారు. అయినా సరే పట్టించుకోలేదు. రెండోసారి ఎలుకలు దాడి చేస్తే బాలింత తల్లి ఆర్తనాదాలు చేసినా సిబ్బందిలో చలనం లేదు. ఇంతటి అధ్వాన పాలన నడుస్తున్నప్పటికీ ప్రభుత్వ వైద్య శాఖ లో నిర్లిప్తత అలాగే కొనసాగుతోంది.
లోపిస్తున్న జవాబుదారీ తనంవైద్య ఆరోగ్య శాఖ వంటి వాటిల్లో జవాబుదారీ తనం పెంచేందుకు చర్యలు కరవు అయ్యాయి. ఘటనలు జరిగినప్పుడు పొడి పొడి చర్యలు తప్ప సమగ్రంగా దిద్దుబాటు చర్యలు ఉండటం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు తప్పితే, సంబంధిత శాఖ లో సమగ్రమైన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శ ఉంది.