ప్రజా సమస్యలను ప్రస్తావించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ః అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, అదేవిధంగా అధికారపార్టీ మోసపూరిత విధానాలను కడిగిపారేశారు. 

జ్యోతుల నెహ్రూ( జగ్గంపేట ఎమ్మెల్యే)
ప్రబుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపిన ప్రతిపక్ష సభ్యులపై...అధికారపార్టీ నేతలు నోరుపారేసుకోవడంపై శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. వాస్తవాలు చెప్పమని కోరుతుంటే ..మూర్థులు అని మాట్లాడుతారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ సంస్కృతి అని తూర్పారబట్టారు. ఎవరు అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడినా బాద్యత గల సభాపతిగా దాన్ని ఖండించాలన్నారు. అప్పుడే సభ సజావుగా జరుగుతుందన్నారు. 

శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి ఎమ్మెల్యే)
రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెచ్చుమీరుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీలో ఎండగట్టారు. అధికారులు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోవడం వల్ల సామాన్యులకు సమస్యలు వస్తున్నాయన్నారు. ఏ భూమి ఎవరిది అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సామాన్యులకు ఇబ్బందులు రాకుండా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

సురేష్( సంతనూతల పాడు ఎమ్మెల్యే)
రాష్ట్రంలోని స్వర్ణకారులకు ప్రభుత్వం రుణసౌకర్యం కల్పించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వర్ణకారుల వృత్తివారు లక్షన్నర కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.  మెకనైజేషన్ వల్ల వృత్తిని కోల్పోతున్నారు కావున ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడు మాదిరి ఇక్కడ కూడా ట్రైనింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా రుణసౌకర్యం కల్పించే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 10 నుంచి రూ. 20 లక్షలకు పెంచాలన్నారు. 
 
జయరాం (ఆలూరు ఎమ్మెల్యే)
ఆలూరు నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే జయరాం సభలో ప్రస్తావించారు. పంచాయతీల్లో రోడ్లు లేని గ్రామాలు అనేకం ఉన్నాయని తెలిపారు. బీటీ రోడ్లు వేసేలా నిధులు కేటాయించాలన్నారు.  పంచాయతీ రాజ్ నుంచి ఆర్ అండ్ బీకి కూడా రికమెండ్ చేశామన్నారు.  

నారాయణ స్వామి( గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే)
రెవెన్యూ వ్యవస్థ దారుణంగా ఉందని, అందుకు సదరు మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడమే ఉదాహరణ అని ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. పాస్ బుక్ లలో గోల్ మాల్ జరుగుతుండడం వల్ల... పేద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎదురుగుప్ప హెడ్ క్వార్టర్స్ లో భూములను పూర్తిగా ఆక్రమించుకున్నారు. కలెక్టర్ కు , జాయింట్ కలెక్టర్ కు కూడా చెప్పాం. ఐనా ఎంక్వైరీ లేదు. దీనిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలన్న ఆలోచన విధానంతో మాట్లాడొద్దని అధికారపక్షానికి హితవు పలికారు. 

చింతల రామచంద్రారెడ్డి( పీలేరు ఎమ్మెల్యే) 
నూజివీడు నుంచి హైదరాబాద్ వస్తున్న మెడికో విద్యార్థులు రోడ్డు దుర్ఘటనలో చనిపోయిన విషయాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సభలో ప్రస్తావించారు.  హైదరాబాద్ నుంచి ప్రైవేటు బస్సులు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని, వేగాన్ని నియంత్రణ చేస్తారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెడితే బాగుంటుందని సూచించారు. ఐతే,  రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు మంత్రి ఏం చర్యలు
తీసుకుంటారో చెప్పాలన్నారు. 

కొరుముట్ల శ్రీనివాసులు(రైల్వే కోడూరు ఎమ్మెల్యే)
చెన్నై, హైదరాబాద్, కడప మీదుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకులు వేయడం వల్ల హైవే పర్పస్ వేస్ట్ అంటున్నారు. అంటే దాని అర్థం మనుషులను చంపడం కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మలుపుల దగ్గర స్టిక్కర్లు వేయడంతో పాటు... స్పీడ్ బ్రేకర్ లు వేయాలని ప్రభుత్వానికి సూచించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Back to Top