మేనిఫెస్టోని సగర్వంగా చూపిద్దాం

ప్రజా సంకల్ప యాత్ర తొలిరోజు విజయవంతంగా పూర్తయ్యింది. రెండో రోజు దిగ్విజయంగా  సాగింది. ఉదయం 9 గంటలకు వేంపల్లెలో శివార్లలో మొదలైన పాదయాత్ర రాత్రి 9 గంటలకు నేలతిమ్మాయపల్లిలో ముగిసింది. మొత్తంగా 12.8 కిలోమీటర్ల మేర ప్రతిపక్ష నేత పాదయాత్ర కొనసాగింది. ఒక్క వేంపల్లె దాటడానికే యువనేతకు ఆరు గంటల సమయం పట్టింది. అడుగడుగునా ప్రజల కష్టాలను సహనంగా విన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఆయన ప్రకటించిన విధంగానే మేనిఫెస్టోలో ఏమేం చేయాలో చెప్పమని ప్రజలనే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు, వారి అవసరాలను మేనిఫెస్టోలో భాగం చేస్తానన్న మాట అమలు పరుస్తూ పాదయాత్ర కొనసాగించారు. 

వృద్ధుల సమస్యలు విని జన నేత చలించిపోయారు. ఏ ఆదరణలేక, నిలువ నీడలేక బాధపడుతున్న పండుటాకులకు ఆసరాగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మండలానికో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఉద్యోగాలెప్పుడొస్తాయి అన్నా అంటూ నిరాశగా ప్రశ్నించిన యువతకు మన ప్రభుత్వం రాగానే ప్రభుత్వంలో ఉన్న 1.42లక్షల ఉద్యోగాలూ భర్తీ చేస్తానని చెప్పారు. అలాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీని మూడేళ్లలో పూర్తి చేసి 10వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించారు. పింఛనులను రెండు వేలు ఇస్తానని, వీలైతే 3వేలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు వైయస్ జగన్. విద్యార్థులు బాగా చదువుకోవాలని, వారికి రీయంబర్స్ మెంట్ తో పాటు భోజనం, వసతి కోసం 20వేలు ఇస్తానని ప్రకటించారు. వైయస్సార్ హయాంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలకు విద్యుత్ బిల్లులు లేవని, గత మూడేళ్లుగా కరెంటు బిల్లులు వస్తున్నాయన్నారు వైయస్ జగన్. ఎస్సీ ఎస్టీ కాలనీలకు పూర్తి ఉచితంగా కరెంటు అందిస్తానని మాటిచ్చారు. 

అశేషంగా వచ్చిన జనవాహినితో రచ్చబండలో ముచ్చటించారు వైయస్ జగన్. అచ్చం మీ నాయన్ను చూసినట్టే ఉందంటూ ప్రజలు అనడం చూస్తే వారికి వైయస్ కుటుంబం పై ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు వైయస్ జగన్. మన ప్రభుత్వం వస్తే మీరేం కోరుకుంటారో, మీకేం చేయాలో చెప్పండి అని రచ్చబండలో ప్రజలనే అడిగి తెలుసుకున్నారు వైయస్ జగన్. మీకు జరుగుతున్న అన్యాయాలేమిటో వివరంగా చెప్పండి…న్యాయం చేసేందుకు నా సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడో ఆఫీసుల్లో కూర్చుని అమలు చేయని హామీలను గుప్పించి పుస్తకంలా మేనిఫెస్టో ఉండదని చెప్పారు వైయస్ జగన్. అలాంటి పుస్తకం ఒకటి అచ్చేసిన టిడిపి ఇప్పుడా మేనిఫెస్టో బుక్ ను ఆన్ లైన్ నుంచి మాయం చేసిందన్నారు. కేవలం రెండే పేజీలతో వైయస్సార్ సిపి మేనెఫెస్టో ఉంటుంది. అందులోని హామీలన్నిటినీ అమలు చేద్దాం…సగర్వంగా ఆ మేనిఫెస్టోని అందరికీ చూపిద్దాం అన్నారు యువనేత. ప్రజలకు ఏం చేస్తే చిరకాలం వారి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతానో అలాంటి కార్యక్రమాలే చేపడతాను అన్నారు వైయస్ జగన్. తండ్రి వైయస్సార్ ఫొటోతోపాటు  తన ఫొటోను కూడా ఇంట్లో పెట్టుకునేలా పని చేస్తానని చెప్పారు. వేలాది మంది అభిమానులు వైయస్ జగన్ తోడుగా అడుగులు కడుపుతుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అలుపన్నది లేకుండా 12.8కి.మీలు పాదయాత్రను కొనసాగించారు. చీకటి పడిన తర్వాత కూడా రాత్రి తొమ్మిదిగంటల వరకూ సాగిన ప్రతిపక్ష నేత ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు ముగిసేసరికి నేలతిమ్మాయపల్లె వద్దకు చేరింది. 

Back to Top