ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా):

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని పార్టీ కడప ఎంపీ వైయస్ అవినా‌శ్‌రెడ్డి చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేతగా శ్రీ వైయస్ జగ‌న్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని అయన తెలిపారు. ఇడుపులపాయలో బుధవారం జరిగిన వైయస్ఆర్‌ సిల్పీ సమావేశం సందర్భంగా అవినాశ్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శ్రీ జగన్‌ను ప్రతిపక్ష నేతగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని చెప్పారు.

పార్టీ పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా స్వీకరిస్తామని అవినాశ్‌రెడ్డి తెలిపారు. నాలుగేళ్లు 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడా‌మని, ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు.. 8 మంది ఎంపీలతో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైయస్‌ఆర్‌సీపీ మరో ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వైయస్ జగ‌న్‌ను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలని అవినాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తా ధైర్యంగా జగనన్న నేతృత్వంలో పోరాడేందుకు సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. 2019లో శ్రీ వైయస్ జగ‌న్ సీఎం కావడం తథ్యం అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారినికి కృషి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి :
'నవ్యాంధ్రప్రదేశ్ తొలి ప్రతిపక్ష నేతగా‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారంలోకి రానందుకు చింతించకుండా పార్టీ చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటాం. ఐదేళ్లపాటు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాటం సాగిస్తాం. ప్రజలు త్వరలోనే ఎందుకు చంద్రబాబుకు ఓట్లు వేశామా అని బాధపడే రోజు వస్తుంది. ఎందుకంటే ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు గుప్పించార'ని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

తిరుపతిని అభివృద్ధి చేస్తా : ఎంపీ వరప్రసాద్ :
'ఐఏఎస్ చేశా..‌ శ్రీ జగన్ నాకు అవకాశం కల్పించడంతో వదిలిపెట్టుకొని వచ్చా. వెనుకబడిన ప్రాంతాలతో‌ పాటు తిరుపతి అభివృద్ధికి ఎల్లవేళలా కృషిచేస్తా. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల చేసిన కృషి మరువలేనిది. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి.. తిరుపతి ప్రాంతంలోని శ్రీకాళహస్తితో పాటు తిరుపతిలోని ఆలయాల అభివృద్ధికి కూడా కృషి చేస్తా. ప్రజా సమస్యలపై పోరాటానికి వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ ముందుంటుంది. నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా'నని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ తెలిపారు.

సమష్టి కృషితో ముందుకెళతాం: పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
'వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీని సమష్టి కృషితో ముందుకు తీసుకెళ్లడానికి అన్ని విధాలా కృషిచేస్తాం. ప్రజా సమస్యలపైన ప్రధానంగా స్పందిస్తాం. ప్రభుత్వం రాలేదని చింతపడకుండా మనో ధైర్యంతో కార్యకర్తలకు అండగా ఉంటాం. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందుంటాం. ఈ అయిదేళ్లు కష్టపడి రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తాం. అప్పటివరకు కార్యకర్తలు ధైర్యం కోల్పోకుండా శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంట నడవాల'ని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు.

కిరణ్,చంద్రబాబు కుమ్మక్కు : చింతల రామచంద్రారెడ్డి :
'మాజీ ముఖ్య మంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కుమ్మక్కు అయ్యారు. అయినా వైయస్‌ఆర్‌సీపీకే ప్రజలు పట్టం కట్టారు. అమలు కాని హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారు. అవి ఆచరణ సాధ్యం కావు. ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరు. పీలేరు నియోజకవర్గంలో కిరణ్, చంద్రబాబుల కుయుక్తులు బెడిసికొట్టాయి. ఇద్దరికీ చెంపపెట్టు తగిలినట్లు అయ్యింద'ని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.

హామీల అమలుపై చంద్రబాబును వెంటాడతాం : చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి :
'టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వైయస్ఆర్‌సీపీ తరఫున వెంటపడి అమలయ్యే విధంగా పోరాటం చేస్తాం. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆయన సొంత జిల్లా చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గంలోనే ప్రజలు నమ్మలేదు. చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్‌సీపీ 8 స్థానాలు గెలుచుకుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చెప్పారు. ఆ పథకం అమలును చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న 70 వేల కుటుంబాలకు ముందుగా చేస్తే మంచిది. పాకిస్తాన్ నుంచి ముషార‌ఫ్‌ పారిపోయినట్లుగా చంద్రబాబు కూడా హామీలు నెరవేర్చలేక రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయ'ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.

త్వరలో ప్రజా తిరుగుబాటు: నారాయణస్వామి :

'చంద్రబాబు నాయుడి ఆలోచనా విధానం చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు. అందుకే జిల్లాలో ఎక్కువ స్థానాలు వైయస్‌ఆర్‌సీపీకి అందించారు. అంతేకాదు, చెప్పిన మాట ఏదీ ఆచరించకపోవడం చంద్రబాబు నైజం. ఇలాంటి నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. త్వరలోనే ప్రజా తిరుగుబాటు వస్తుంద'ని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు.

ఉద్యమాలన్నీ జగన్‌వే : ఆర్‌కే రోజా :
'సంబరాలు జరుపుకునే సుదినం రాకపోవడం బాధాకరం.. ప్రజల కోసం ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా చంద్రబాబు లేరు. చేనేత, మత్స్యకారుల, విద్యార్థుల, రైతన్నల ధర్నాలలో ప్రతినిత్యం శ్రీ వైయస్‌ జగనే కనిపించారు. చంద్రబాబు అసలు కనిపించలేదు. జగనన్నతో రుణమాఫీ విషయమై ప్రస్తావించాం. అధికారం రాకపోయినా ఫర్వాలేదు... నెరవేర్చని హామీలను ఇవ్వడం సరికాదని చెప్పారు. మాట చెబితే కష్టాలు ఎన్ని వచ్చినా నిలబడాలని వివరించారు. మూడు నెలల తర్వాత చంద్రబాబు హామీలను ఎంత వరకు నెరవేరుస్తారనే విషయం తెలుస్తుంది. నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడతార'ని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు.

హామీలను బాబు నెరవేర్చలేరు: దేశాయ్‌ తిప్పారెడ్డి :
'చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు. అధికార దాహం కోసం బాబు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చే పథకాలు అందులో లేవు. ప్రజలను మోసం చేసే విధంగా మోసపూరిత వాగ్దానాలు చేశార'ని మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top