వైయస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీ 
పార్టీ శ్రేణుల్లో ఊపును పెంచిన సమావేశాలు
ప్రభుత్వ అరాచక పాలనను ఎండగట్టిన నేతలు

అమరావతి :వైయస్సార్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో ఉత్సాహం ఉప్పొంగింది. సాధారణ ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండేళ్ల ముందుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమావేశాలు పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తిని నింపాయి. ప్లీనరీలు వేదికగా చేసుకుని పార్టీ కార్యకర్తలు, నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్రజాస్వామిక పాలనపై సమరశంఖాన్ని పూరించారు. టీడీపీ దుర్మార్గపు పాలనను తూర్పారబట్టారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తరువాత వాటిని తుంగలో తొక్కిన వైనాన్ని ప్రశ్నించారు. రైతుల, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ మొదలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీల్లోని మోసాన్ని ఎండగట్టారు. ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అనే నినాదంలోని డొల్లతనాన్ని చాటి చెప్పారు. చంద్రబాబు మూడేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో జరిగిన ఈ ప్లీనరీ సమావేశాలకు సాధారణ ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలే కాదు, సామాన్యులు కూడా భాగస్వాములై తమ గోడును వెళ్ల బోసుకున్నారు. మాట తప్పిన టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్లీనరీలకు వెల్లువెత్తిన జనం వైయస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఊపు, ఉత్సాహం నింపితే టీడీపీ నేతలకు మాత్రం బెంబేలెత్తించే పరిస్థితులు కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీలకు జనం వెల్లువలా తరలివచ్చి తమ మద్దతును ప్రకటించారు.

కింది స్థాయి నుంచి తొలి సారిగా....
జననేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్లీనరీలు కావడంతో శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో భారీ ఎత్తున పాల్గొన్నారు. 2014 ఎన్నికలకు ముందు కింది స్థాయి నుంచీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి అప్పట్లో లేక పోయింది. ఎన్నికల ముందు  రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు భారీఎత్తున ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరిగాయి. తొలి ప్రయత్నంలోనే శాసనసభ ఎన్నికల్లో పటిష్టమైన ఏకైక ప్రతిపక్షంగా అవతరించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఈ మూడేళ్లుగా పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించింది. కింది స్థాయి నుంచి కమిటీలను, అనుబంధ సంఘాలనూ నిర్మించుకుంటూ వచ్చి తొలి అంచెగా అసెంబ్లీ ప్లీనరీలకు శ్రీకారం చుట్టింది. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మే చివరి వారంలో క్రమంగా ప్రారంభమైన ప్లీనరీ సమావేశాలు జూన్‌ పదో తేదీ నాటికి చాలా వరకూ పూర్తయ్యాయి. మొత్తం 13 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సోమవారం నాటికి అందిన సమాచారం ప్రకారం 158 చోట్ల ఉత్సాహపూరిత వాతావరణంలో ప్లీనరీ సమావేశాలు జరిగాయి. స్థానికమైన, అనివార్యమైన కారణాల వల్ల 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే వాయిదా పడ్డాయి.

ఫిరాయింపుదార్ల ఇలాకాలో....
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 2014 ఎన్నికల్లో 67 అసెంబ్లీ స్థానాలు దక్కినప్పటికీ చచచచంద్రబాబు ఓటుకు నోటు రాజకీయాలు...స్వార్థపూరితమైన ప్రయోజనాలు, ప్రలోభాలు వంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 21 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారందరికీ పసుపు కండువాలు కప్పి ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలని చూశారు. అయితే ఈ 21 మంది ఫిరాయింపుదార్లు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ప్లీనరీ సమావేశాలు అంచనాలకు మించి విజయవంతం కావడం అధికారపక్షం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.  ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వారి నియోజకవర్గాల్లోనే ప్లీనరీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడమే కాకుండా పార్టీలు మారిన వారికి ఈ దఫా గట్టిగా బుద్ధి చెబుతామని ప్రతిన పూనడం విశేషం. ఏ గుర్తుపై అయితే గెలుపొందారో ఆ పార్టీపైనే కయ్యానికి కాలు దువ్వుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో ప్రజలు మరింత ధృఢ నిశ్చయంతో ముందుకు కదిలారు. కృష్ణా, విజయనగరం, విశాఖపట్టణం, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారినా కార్యకర్తలు , కింది స్థాయి నేతలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడలేదనే సంకేతాలను బలంగా ఇచ్చారు. ఫిరాయింపు దారుల నియోజకవర్గాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల ప్రజలకున్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని ప్లీనరీలు జరిగిన తీరు నిరూపించాయి. 

తొలి అంచె సమావేశాలు పూర్తి చేసిన ఉత్సాహంతో ఇక జిల్లా ప్లీనరీలను విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులు కదులుతున్నాయి. జిల్లాల వారీగా అసెంబ్లీ ప్లీనరీలు ఇలా జరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం ,విశాఖపట్టణం, కృష్ణా, వైయస్సార్‌ కడప జిల్లాల్లో అన్ని చోట్లా ప్లీనరీలు విజయవంతంగా జరిగాయి. తూర్పుగోదావరిలో  18 నియోజకవర్గాల్లో ప్లీనరీలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 13 చోట్ల భారీగా తరలివచ్చిన జనం మధ్య ప్లీనరీలు జరిగాయి. నెల్లూరులో  4 చోట్ల, ప్రకాశంలో  11, గుంటూరులో  15, చిత్తూరులో 12, అనంతపురంలో  12, కర్నూలులో13 చోట్ల ప్లీనరీలు జరిగినట్లు సమాచారం అందింది. ఇంకా మిగిలిపోయిన నియోజకవర్గాల్లోనూ ప్లీనరీ ఏర్పాట్లు సాగుతున్నాయి

24 లోపు అన్నీ పూర్తవుతాయి - సజ్జల
మిగిలి ఉన్న 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నెల 24లోపు పూర్తవుతాయని వైయస్ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ పిలుపు మేరకు క్రమశిక్షణతో శ్రేణులన్నీ ప్రతిష్టగా తీసుకుని ప్లీనరీల నిర్వహించడం ఎన్నికల ముందు ఒక శుభపరిణామమని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అందుబాటులో లేనందువల్ల ఆరు నియోజకవర్గాల్లో వాయిదా పడ్డాయని వాటిని కూడా గడువులోపు పూర్తి చేస్తామని జిల్లా నాయకత్వం తెలియ జేసిందన్నారు. కర్నూలులో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కారణంగా ప్రత్తిపాడులో మాత్రం వాయిదా పడిందన్నారు. 20 తేదీ నాటికే దాదాపుగా అన్నీ పూర్తవుతాయని అతి కొద్ది నియోజకవర్గాల్లో మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో 24 లోపు పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం అనుమతి నిచ్చిందని రామకృష్ణారెడ్డి వివరించారు.
Back to Top