ఏడేళ్ల ప్రయాణం.. అడుగడుగునా ప్రభంజనం


– ఢిల్లీ అహంకారాన్ని సవాల్‌ చేసి తొలి విజయం
– ఏడేళ్లుగా ప్రజల పక్షాన అలుపెరుగుని పోరాటం
– వెన్నుచూపని తత్వం... మాట తప్పని నైజం ఆయన బలం
– పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మనసు గెల్చుకున్న జననేత 

ఆవిర్భావమే ఒక సంచలనం.. ఆత్మగౌరవాన్ని అవహేళనగా చూడటంతోనే ఆలోచన పుట్టింది. పార్టీ ఏర్పాటు వెనుక ఒక లక్ష్యం ఉంది. ఒక మహనీయుడి హఠాన్మరణంతో గుండెలవిసేలా రోధిస్తున్న వేల కుటుంబాలను ఓదార్చాలన్న లక్ష్యానికి అడ్డు చెప్పడంతో ఢిల్లీ అహంకారాన్ని సవాల్‌ చేస్తూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా తమకు అండగా నిలిచిన ప్రజలకు తోడుగా ఉండాలనే ఆశయంతోనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైంది. తండ్రికి తగ్గ తనయుడిగా మడమ తిప్పని సంకల్పంతో మార్చి 12, 2011 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసి విజయవంతంగా ఎనిమిదో వసంతంలోకి నడిపిస్తున్నారు. ఈ ఏడేళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు.. అడుగడుగునా పోరాటాలు. ఒక జాతీయ పార్టీ, దాదాపు రెండు దశాబ్దాలు అధికారం అనుభవించిన మరో ప్రాంతీయ పార్టీ కలిసి అనుక్షణం వేధిస్తున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పార్టీ అధినేతగా వైయస్‌ జగన్‌ వందకు వంద మార్కులు సాధించారు. ప్రజా నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా అటు ప్రజాక్షేత్రంలో.. ఇటు అసెంబ్లీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పోరాట యోధుడు వైయస్‌ జగన్‌. ఎంచుకున్న మార్గం కోసం మడమ తిప్పని.. ఇచ్చిన మాట కోసం కట్టుబడే మాట తప్పని నాయకుడిగా విజయాలను సాధించారు.. అపజయాలను అంతే సంతోషంగా స్వీకరించారు. 
ఆవిర్భావంతోనే విజయ పరంపర...
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావంతోనే సంచలన విజయాలు నమోదు చేసింది. రెండు ప్రధాన పార్టీలను ఢీకొని సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఎంపీగా 5 లక్షల పైచిలుకు మెజారిటీతో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పులివెందుల స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా ఇద్దరితో మొదలైన పార్టీ ప్రయాణం ఈ ఏడేళ్లలో ప్రతిపక్ష హోదాకి ఎదిగింది. అధికారానికి అతి కొద్ది ఓట్ల దూరంలోనే ఆగిపోయినా ప్రజా సమస్యల మీద పోరాడటంలో మాత్రం జాతీయ పార్టీలను కూడా తలదన్నే రీతిలో వైయస్‌ఆర్‌సీపీని నడిపిస్తున్నారు వైయస్‌ జగన్‌. పార్టీ ఏర్పాటైన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే 18 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 67 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార పార్టీతో పోల్చుకుంటే కేవలం 2 శాతం కంటే తక్కువ ఓట్లతో వెనుకబడి ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైనా ప్రజా క్షేత్రంలోనే ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తోంది. 
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్రలు
మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేయడం విశేషం. భారత దేశ చరిత్రలో ఇలా ఎక్కడా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేసిన దాఖలాలు లేనేలేవు. కాంగ్రెస్‌ను ఎదిరించినందుకు పార్టీ అధినేతను అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించినా.. ఆయన స్థానంలో వైయస్‌ షర్మిల కఠోర పాదయాత్ర చేసి పార్టీని ప్రజల గుండెల్లో నిలపారు. జగనన్న వదిలిన బాణంగా ప్రజల్లోకి దూసుకెళ్లారు. జగన్‌ గొంతుకను ప్రజల్లో వినిపించి 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించారు. గతంలో 2014కు ముందు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహించగా.. వైయస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేసిన తర్వాత మహానేత ముద్దుల తనయ వైయస్‌ షర్మిల మరో మహా ప్రస్థానం పేరుతో పార్టీని ముందుకు తీసుకెళితే.. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. 
సంక్షేమ పథకాలు నిర్వీర్యం కాకూడదనే..
మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేస్తుండటంపై వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉన్నారు. పేదలకు అండగా ఉండేందుకు మహానేత ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఆయన హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వాలు పథకం ప్రకారం నీరుగార్చాయి. పేదింట్లో చదువుల పంట పండించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి మంగళం పాడేందుకు.. ఫీజులు అమాంతం రెండింతలు పెంచేశారు. విడతల వారీగా ఆరోగ్యశ్రీ కింద వచ్చే వ్యాధులను తొలగిస్తూ వచ్చారు. చివరికి ఆంధ్రాలో తప్ప ఎక్కడా ఆరోగ్యశ్రీ అమలు కాని పరిస్థితి కల్పించారు. పథకం నిర్వీర్యం కావడంతో ఎంతో మంది డబ్బులు చెల్లించి కార్పొరేట్‌ వైద్యం చేయించుకోలేక ప్రాణాలు వదిలారు. ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఇదే వైయస్‌ జగన్‌ను తీవ్రంగా కలచి వేసింది. ప్రభుత్వంపై యుద్ధానికి పూనుకునేలా చేసింది. ఇదేకాక రైతుల పక్షాన కరువొచ్చినప్పుడు, వరదొచ్చినప్పుడు.., డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని, రైతులకు రుణమాఫీ జరగలేదని.., అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. జనం కష్టంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ వారిని పలకరించే తొలి పిలుపు వైయస్‌ జగనే అయ్యారు. 

Back to Top