పోరాట పార్టీకి ఎనిమిది వసంతాలు

ఓ నమ్మకం నిజమై రూపు దిద్దుకున్న సందర్భం. ఓ వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సంకల్పించిన సందర్భం. తనపై తన వారికున్న నమ్మకాన్ని వమ్ము చేయకకూడదని నిర్ణయించుకున్న సందర్భం. వైయస్సార్ ఆశయాలే ఆచరణీయ మార్గాలని నమ్మి నడిచిన సందర్భం...అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగు నేల మీద పుట్టిన సందర్భం. ఏడేళ్ల క్రిందట అంటే మార్చి 12, 2011న ఊపిరిపోసుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన ఈ పార్టీ రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాలకు పట్టం కడుతోంది. ’’నా తండ్రి అడుగుజాడే నా పార్టీ ఎజండా ’’ అని ప్రకటించుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ పాలన సంక్షేమానికి నిలువుటద్దం కావడం, వైఎస్సార్ బాట ప్రజాక్షేత్రం కావడమే అందుకు కారణం.

రైతులు, శ్రామికులు, యువజనులు...వీరే దేశానికి వెన్నెముకలు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి పేరుతో, వారి తీరుతో ముందుకు సాగుతోంది. ఈ ఏడేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం అంతా పోరాటాల స్ఫూర్తినే నింపుకుని ఉంది. అసమర్థ పాలనను ఎండగడుతూ, అవినీతి పాలనకు అడ్డుపడుతూ, అధికార అహంకారాలను అదుపు చేస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను నిబద్ధతతో పోషిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతివృద్ధ టిడిపి పార్టీ, మరో కురువృద్ధ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగింది.  పుట్టి మూడేళ్లు కాని పసికూనలాంటి వైఎస్సార్ కాంగ్రెస్ ఏ పార్టీ అండ లేకుండా, ఎవ్వరితో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లో తలపడింది. నాటి ఎన్నికల్లో అలవి కాని హామీలతో ప్రజలను నమ్మించి టిడిపి విజయం సాధించి ఉండొచ్చు గాక. కానీ మహా మహా సీనియర్ పార్టీలను ఢీకొని అపూర్వమైన తెగువను చూపింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అతి స్వల్ప తేడాతో ప్రత్యర్థికి దీటైన సమాధానం ఇచ్చి, ప్రతిపక్ష స్థానంలో నిలిచింది. 44.4% ఓట్లు సాధించి, 67 శాశన సభా స్థానాలు కైవసం చేసుకుంది. 9 లోక్ సభ స్థానాలు గెలిచి దేశం మొత్తంలో అత్యధిక ఎమ్.పి సీట్లు గెలిచిన మొదటి  పది పార్టీల్లో ఒకటిగా నిలిచింది. 

రైతుల కోసం, శ్రామికుల కోసం, చేనేతల  కోసం సీమ నీటి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం, విభజన హామీల కోసం, ప్రత్యేక హోదా కోసం అడుగడుగునా ప్రజల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. జనం కోసం జనంతో కలిసి జనోద్ధరణకు కంకణబద్ధమౌతోంది. ఆ స్ఫూర్తికి మూలం వైఎస్సార్. ఆ స్ఫూర్తికి కొనసాగింపు వైఎస్ జగన్. ప్రజాక్షేత్రంలో నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేయడమే కాదు, అసెంబ్లీలోనూ ప్రజల తరఫున గొంతెత్తి నినదించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతగా ప్రతిపక్షాన్ని నోరు విప్పకుండా అణచాలని కుట్రలు చేసినా, వాటిని చేధించి, నిజాన్ని నిర్భయంగా ప్రకటించిన అభినవ శంఖారావం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కొందరు స్వార్థపూరితంగా ఆలోచించి, ప్రలోభాలకు తలొగ్గి, పార్టీకి, నమ్మి నిలబెట్టిన అధినేతకి వెన్నుపోటు పొడిచారు. అయినా సరే నిబ్బరంగా నిలదొక్కుకున్నది. నిస్వార్థంగా ప్రజాసేవకే అంకితమైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి అని నమ్మడమే కాదు, ఆచరించి చూపిన పార్టీ. గౌరవమైన శాసన సభలో ప్రజాస్వామ్యం అవహేళన అవుతుంటే, నైతిక విలువలు అధికార పార్టీ అవసరాలకు బలైపోతుంటే వాటిని ధిక్కరించి, అసెంబ్లీని విడిచి ప్రజల ముందుకొచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అందుకే ప్రజాసంకల్పం చేపట్టి ప్రభుత్వ అవినీతి, అక్రమాల చిట్టాలను నలుచెరగులా వినిపిస్తోంది. విభజన తో నష్టపోయిన రాష్ట్రాన్ని ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తోందో ఆధారాలతో వివరిస్తోంది. ప్రత్యేక హోదా పై ప్రజల్లో చైతన్యం నింపుతోంది.  హోదా పోరులో రాష్ట్రమంతటినీ ఏకం చేస్తోంది. రాష్ట్రానికి నష్టం జరిగితే సహించేది లేదని దేశరాజధానిలో గర్జిస్తోంది. అవిశ్వాసం, రాజీనామా అస్త్రాలతో కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. హోదా అంశంపై దేశం మొత్తం చర్చించేలా నిర్మాణాత్మక ప్రణాళికలు చేపడుతోంది. 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా, ప్రజా జీవితాలకు దగ్గరగా, ప్రజా నాయకుడి ఆశయాల రధ సారధిగా సాగుతోంది. ప్రజల గుండెల్లో వైఎస్సార్ జెండా ఎగురుతోంది. 
 
Back to Top