'మాటతప్పిన ప్రభుత్వానికి.. చరమగీతం పాడదాం'


అనంతపురం:  ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పలుకుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికారు. తాను అధికారంలోకి వస్తే బ్యాంకులే ఇంటికి వచ్చి అప్పులు తీరుస్తాయన్నారు. టీవీల్లో, పత్రికల్లో రుణమాఫీపై తెగ ప్రచారం చేశారు. నమ్మి ఆశపడ్డ రైతులు ఓటు వేసి గెలిపించారు. కానీ వారికి చంద్రబాబు మొండిచేయి చూపించారు. బ్యాంకులు అప్పులు మాఫీ చేయకపోగా, పాత బకాయిలకు వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. బ్యాంకులు రుణాలివ్వక, పంటను బతికించేందుకు రైతులు బయట అధికవడ్డీకి అప్పులు తీసుకున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, గతిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రుణమాఫీ పేరిట రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నానా కొర్రీలు పెడుతూ వారికి పథకం అమలు చేయడం లేదు. మాట తప్పి వారి ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ను  ప్రారంభించారు. యాత్రలో భాగంగా తొలుత లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కురుబ సిద్ధప్ప (65) అనే రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హిందూపురంలోని   అంబేద్కర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహింరగ సభలో భారీగా కదిలివచ్చిన ప్రజలు, అభిమానులను ఉద్దేశించిజగన్ మాట్లాడారు.

యాత్రతో ప్రభుత్వంలో ఆందోళన
అనంతపురం జిల్లాలో 46 మంది రైతులు ఎనిమిది మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈవిషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ రోజు వరకు రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ చంద్రబాబు తన పాలనలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని నిస్సిగ్గుగా కొట్టిపారేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నేనే వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పిస్తానని ప్రకటించా. అనంతపురంలో నా యాత్ర మొదలవుతుందని తెలిసి చంద్రబాబు గండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పటికప్పుడు 29 మంది చనిపోయారని చెక్కులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అదీ కూడా సక్రమంగా పంపిణీ చేయలేదు. సిద్దప్ప ఆత్మహత్యనూ పరిగణలోకి తీసుకోలేదని ధ్వజమెత్తారు.

ఒక్క హామీనైనా అమలు పరిచారా?
ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలపై హామీల వర్షం కురిపించారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, ఇంటికో ఉద్యోగం, రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది. ఒక్క హామీనైనా సక్రమంగా నెరవేర్చింది లేదు. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పిన రోజునాటికి రాష్ర్టంలో రూ.87వేల కోట్ల రుణాలు ఉన్నాయి. వాటికి రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు కలిపి రూ.లక్ష కోట్ల బకాయిలు ఉన్నాయి.  బాబును నమ్మిన ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే వారికి మొండిచేయి చూపించాడు. రుణ మాఫీ అమలు కాకపోగా ఇప్పుడు ఏకంగా రూ.12 వేల కోట్ల భారం మీద పడింది. వ్యవసాయ రుణాలు రూ.99 వేల కోట్లున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ కోసం విడుదల చేసింది రూ.4600 కోట్లు ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు. దీనికితోడు రాష్ట్రంలో కరువొచ్చింది. రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకులు పాత బకాయిలు మాఫీ చేయవు. కొత్త రుణాలివ్వడం లేదు. ఇప్పటికే 14 శాతం వడ్డీతో పాత బకాయిలు కట్టాలని షరతు విధించాయి. విధిలేక రైతులు రూ.2-5 వడ్డీకి బయట అప్పులు తీసుకుంటున్నారు. వడ్డీలు కట్టలేక అన్నదాతలు ఉరిపోసుకుని ఉసురు తీసుకుంటున్నారు. ఇక డ్వాక్రా రుణాలు రూ.14 వేల కోట్ల ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తానని స్పష్టం చేశారు.

హంద్రీ-నీవా, గాలేరు-నగరి వైఎస్ పుణ్యమే
చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో  హంద్రీ-నీవా ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది కేవలం రూ.13 కోట్లు, ఆ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ ఐదేళ్లలో రూ.5800కోట్లు ఖర్చు పెట్టారు. 85 శాతం పనులు పూర్తయ్యాయి. మరో రూ.1500 కోట్ల ఖర్చు చేస్తే పనులు పూర్తవుతాయి. ప్రజలకు  నీళ్లందుతాయి. కానీ, చంద్రబాబు తానే ప్రాజెక్టు కట్టినట్లు తప్పడు మాటలు చెబుతారు. నిధలు మాత్రం విడుదల చేయడు. హంద్రీనీవా ముమ్మాటికి వైఎస్ చొరవతోనే పూర్తయిందని జగన్ స్పష్టం చేశారు. గాలేరు- నగరి ప్రాజెక్టుకు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు కేవలం రూ.17 కోట్లు విడుదల చేశారు. కానీ వైఎస్ సీఎం అయ్యాక రూ.4,600 కోట్లు విడుదల చేశారు. మరో రూ.1700 కోట్లు విడదుల చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. గాలేరు నుంచి చిత్తూరు వరకు సీమ మొత్తానికి నీళ్లంది పచ్చగా కళకళలాడుతుంది. కానీ చంద్రబాబు దమ్మిడీ ఇవ్వడం లేదు అని జగన్ విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top