భూ సమీకరణకు వ్యతిరేకంగా రణభేరి

  • రాజధాని నిర్మాణం పేరుతో బరితెగించిన సర్కార్‌
  • ఇప్పటికే 33 వేల ఎకరాలు సమీకరణ
  • మిగిలిన భూములను కూడా లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నం
  • ‘సింగపూర్‌’కు భూములు కట్టబెట్టడమే ఏకైక లక్ష్యం
  • ‘రియల్‌’ వ్యాపారంతో రూ.లక్ష కోట్లు దోచుకునేందుకు బాబు వ్యూహం
  • బాధితులకు అండగా నిలిచిన ఏపీ ప్రతిపక్ష నేత
  • 19న ‘సీఆర్‌డీఏ’ గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పర్యటన
  రాజధాని నిర్మాణం పేరుతో భారీ కుంభకోణానికి సర్కార్‌ వ్యూహం రచించింది. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేసేందుకు శ్రీకారం చుట్టింది. రాజధాని నిర్మాణ విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను బుట్టదాఖలు చేసింది. ఏపీఐడీఏ–2001 చట్టాన్ని తుంగలో తొక్కింది. విజయ్‌ కేల్కర్‌ కమిటీ నివేదికను బేఖాతరు చేసింది. సింగపూర్‌ ప్రైవేటు సంస్థలతో కలిసి రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టేందుకు ‘స్విస్‌ చాలెంజ్‌’ పేరుతో చంద్రబాబు సర్కారు భారీ కుంభకోణానికి తెరతీసింది. రాజధాని ఏర్పాటు ప్రకటన అధికారికంగా వెలువడకముందే వంది మాగధులకు లీకులు ఇచ్చి ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’కు పాల్పడి నిరుపేద రైతుల కడుపుకొట్టి భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్‌ కో... రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహా దోపిడికి బరితెగించింది. భూసమీకరణ ముసుగులో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ సంస్థల కన్సార్టియంకు ధారాదత్తం చేసి.. రియల్‌ ఎస్టేట్‌ దందా చేసి రూ.లక్ష కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్‌ ప్లాన్‌’ వేశారు.

హామీలను నెరవేర్చని ప్రభుత్వం
రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే భూములను త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు. రాజధాని ప్రాంతంలోనే ఇళ్లు ఇస్తామని, పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని గాలికొదిలారు. ఇది చాలదన్నట్లు మళ్లీ భూ సమీకరణకు తెర లేపారు. 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ వెలువడిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌ ఆధారంగా బలవంతపు భూసేకరణకు అధికారులు ఆగస్టు, 2015లో నోటిఫికేషన్‌ జారీచేశారు. రాష్ట్రప్రభుత్వ అంచనాల ప్రకారం తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో మొత్తం 3,892 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అయితే మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని రైతులు భూములు ఇచ్చేందుకు మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రకటించిన నాటి నుంచి ఆయా గ్రామాల రైతుల్లో ఆందోళన నెలకొంది. తొలుత భూసమీకరణ చట్టం ద్వారా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటిఫికేషన్‌ను జారీచేసింది. అయితే మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు మండలాల పరిధిలోని కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు. మూడు మండలాల పరిధిలో సుమారు 3,892 ఎకరాల భూమిని ఎలాగైనా సరే రైతుల నుంచి తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలివిడతగా ఐదు గ్రామాల్లో భూసేకరణ చట్టం ప్రయోగించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొదట తుళ్ళూరు–2, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, పిచుకలపాలెం, అనంతవరంలలో భూమిని సేకరిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ఐదు గ్రామాల పరిధిలో 11.14 ఎకరాలు సేకరించారు. అయితే గ్రామకంఠాల నిర్ణయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని తుళ్లూరులో రైతులు ఆందోళనకు దిగారు. తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజధాని సలహా కమిటీ, సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. భూసమీకరణ, అసైన్డ్, గ్రామకంఠాల వివాదాలపై వారితో చర్చించి మిగిలిన భూములు కూడా లాక్కోవాలని సూచించించడంతో అధికారులు బలవంతపు భూ సమీకరణకు రంగం సిద్ధం చేశారు.  రాజధాని నిర్మాణం పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కోవడం సిగ్గుచేటనీ, ఈ చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని వైయస్‌ఆర్‌‡సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే హెచ్చరించారు.

రహస్య ఒప్పందం బట్టబయలు
రాజధాని నిర్మాణం కోసం టీడీపీ సర్కార్‌ స్విస్‌ చాలెంజ్‌ విధానం నిబంధనలనూ అడ్డగోలుగా ఉల్లంఘించి, ‘అధికారిక రహస్యాల ప్రమాణా’న్ని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేసింది. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో పారదర్శకత వీసమెత్తు కూడా లేదని సుప్రీం కోర్టు స్పష్టీకరించినా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ప్రోత్సహించవద్దంటూ కేల్కర్‌ కమిటీ తెగేసి చెప్పినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌లు వారించినా వెనక్కు తగ్గలేదు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్‌ కేపిటల్‌)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును చేపట్టేందుకు స్విస్‌ చాలెంజ్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేశారు. హైకోర్టు ధర్మాసనం రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనలను తేటతెల్లం చేసింది. దీంతో చంద్రబాబు అండ్‌ కో, సింగపూర్‌ సంస్థల కన్సార్టియం మధ్య కుదిరిన రహస్య ఒప్పందం గుట్టు రట్టయింది.

దోపిడీకి మాస్టర్‌ ప్లాన్‌
రాజధాని ముసుగులో చంద్రబాబు అండ్‌ కో భారీ దోపిడీకి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సింగపూర్‌ సర్కార్‌తో తనకు ఉన్న సంబంధాల వల్ల.. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను ఉచితంగా తయారుచేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని ప్రకటించారు. ఆ తర్వాత 2014లో నవంబర్‌ 12 నుంచి 14 వరకూ సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించారు. అప్పుడు కుదిరిన ఒప్పందం మేరకు రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ను రూపొందించడానికి సింగపూర్‌ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఈ (ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజస్‌)తో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) డిసెంబర్‌ 8, 2014న ఎంవోయూ కుదిరింది. ఆ మేరకు రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్‌కు మధ్య ఒప్పందం కుదిరిందని డిసెంబర్‌ 5, 2014న కేంద్రానికి నివేదిక పంపారు. సింగపూర్‌ ప్రభుత్వం సూచించిన సంస్థలనే రాజధాని మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందనే అంశాన్ని దాచిపెట్టారు. ఈ ఒప్పందం కుదిరిన రెండు రోజులకే రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలకు సింగపూర్‌ సర్కార్‌ కట్టబెట్టినా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడం కోసం సింగపూర్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగినట్లు కేంద్రానికి నివేదిక పంపారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఒప్పందం సమయంలోనే సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి టోకరా కొట్టినట్లు వెల్లడవుతోంది.  మార్చి 30, 2015న రాజధాని ప్రాంత(కేపిటల్‌ రీజియన్‌) మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ సంస్థలు అందించిన సమయంలోనే మాస్టర్‌ డెవలపర్‌ను స్విస్‌ చాలెంజ్‌ విధానంలో ఎంపిక చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ స్పందిస్తూ.. మాస్టర్‌ డెవలపర్‌ కోసం సింగపూర్‌ సంస్థలు పోటీ పడతాయని చెప్పారు. ముందస్తుగా కుదిరిన ఒప్పందం మేరకు సింగపూర్‌ ప్రైవేటు సంస్థలు అసెండాస్, సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్‌ సంస్థలు విలీనమై కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును సింగపూర్‌ సంస్థల కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు దోచుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్‌ కేపిటల్‌లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది.మన భూమి ఇచ్చి, మన డబ్బుతో మౌలిక సదుపాయాలు సమకూర్చి... సింగపూర్‌ కంపెనీలకు అత్యధికంగా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా సింగపూర్‌ కంపెనీల కోసం, స్వప్రయోజనాలకోసం చంద్రబాబునాయుడు సర్కారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బాధిత రైతులకు అండగా నిలిచేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ నెల 19న రాజధాని ప్రాంతంలో పర్యటించి బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.

‘భూ సమీకరణ’ బాధితులకు వైయస్‌ జగన్‌ అండ
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలోని బలవంతపు భూ సమీకరణ బాధితులకు అండగా నిలిచారు. సీఆర్‌డీఏ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో రైతులు 33 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌కు (సమీకరణకు) ఇచ్చారని ప్రభుత్వమే ప్రకటించింది. పూలింగ్‌కు ఇవ్వకుండా వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతుల వద్ద మిగిలి ఉన్న భూములను కూడా ఇప్పుడు భూసేకరణ పేరిట లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ పరిధిలో బలవంతపు భూసేకరణ వల్ల భూములను కోల్పోతున్న రైతులకు అండగా నిలవడానికి వైయస్‌ జగన్‌ అక్కడ పర్యటిస్తారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వివరించారు. ఈ నెల 19న రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని గ్రామాల్లో వైయస్‌ జగన్‌ పర్యటించి బాధిత రైతాంగంతో ముఖాముఖి మాట్లాడుతారు. 

 
Back to Top