తీరప్రాంతాన్ని రక్షించలేరా?


చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్వజం
232 గ్రామాలు కనుమరుగవుతాయని ఆందోళన

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం సముద్ర తీర రక్షణలో విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లోని కురుసుర జలాంతర్గామి మ్యూజియం సమీప ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఇంత పెద్ద ఎత్తున తీరం కోతకు గురవుతుంటే టీడీపీ ప్రభుత్వం శాశ్వత చర్యలపై కనీసం దృష్టి సారించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్, మలేషియా,  జపాన్ తదితర సముద్రతీర దేశాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అవన్నీ తీరప్రాంతమున్న దేశాలే..! అక్కడ వారు తీరం కోతలకు గురికాకుండా ఏం చర్యలు చేపడుతున్నారో చంద్రబాబు చూడలేదా? ఆయనకు తెలియదా? ఇలాంటి విపత్తులు సంభవించినపుడు తాత్కాలిక చర్యలు చేపట్టడం మానుకోవాలని సూచించారు.
‘‘రాష్ట్రంలో 442 కిలోమీటర్ల తీరం కోతకు గురవుతోంది. ప్రస్తుత సముద్ర మట్టం మరో 0.6 మీటర్లు ఎత్తు  పెరిగితే 100 మీటర్ల మేర తీరంలోకి చొచ్చుకువస్తుంది. దీంతో తీరం వెంబడి ఉన్న 282 గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ గ్రామాల్లో నివసిస్తున్న 13 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యే ప్రమాదం పొంచి ఉంది’’ అన్నారు. అదే జరిగితే వారంతా ఉపాధి, ఆశ్రయం కోల్పోయి నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి పెనుప్రమాదం పొంచి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తీర్రప్రాంతాల్లో ఇష్టానుసారంగా డ్రెడ్జింగ్ నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన పాలకులే దానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు రావడం.. నాలుగు రాళ్లు వేసి చేతులు దులుపుకోవడం... సరికాదని సూచించారు. కోతకు గురైన ప్రాంతాన్ని పనికిరాని రాళ్లతో నింపడమేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతల జేబులు నింపేందుకే నామినేషన్ పద్ధతిన ఏకంగా రూ.మూడున్నర కోట్ల పనులు కట్టబెట్టారని అన్నారు. ‘‘ఇది శాశ్వత పరిష్కారం కాదు. తీరప్రాంతానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు  సమగ్ర అధ్యయనం జరగాలి.
కేంద్రాన్ని సంప్రదించి అవసరమైతే అంతర్జాతీయ స్థాయి నిపుణులను రప్పించి కోతల నివారణకు శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. కోత నివారణకు విదేశాల్లో అమలు చేస్తున్న హెడ్ గ్రోయిన్ బ్రేక్ వాటర్ విధానాన్ని మన తీరంలోనూ అమలు చేయాలి. ఈ సమస్యలపై ప్రతి పక్షంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. శాశ్వత పరిష్కారం దొరికే దాకా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. విశాఖపట్నంలోని మేథావులు, వివిధ రంగాల నిపుణులు ఈ సమస్యపై ఉద్యమించాలి అపుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని’’ సూచించారు.
Back to Top