ప్రకాశ వదనం

– ప్రకాశం జిల్లాను వేధిస్తున్న ఫ్లోరోసిస్‌ మహమ్మారి
– రూ. 2లకు 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఊసే మరిచిన బాబు
– ఫ్లోరైడ్‌ నీరు తాగి పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు 
– డయాలసిస్‌ సెంటర్ల నిర్వహణ ఊసే లేదు
– 20న కిడ్నీ వ్యాధి బాధితులను పరామర్శించనున్న వైయస్‌ జగన్‌ 

రాష్ట్రాన్ని ఫ్లోరైడ్‌ భూతం వేధిస్తుంది. తాగునీటిలో మితిమీరిన ఫ్లోరైడ్‌ చేరి ఆ నీటిని తాగిన జనం పిట్టల్లా రాలిపోతున్నారు. యాభై ఏళ్లు కూడా నిండకుండానే కాళ్లూ చేతులూ పనిచేయక సత్తువ లోపించి నాలుగడుగులు కూడా ముందుకు వేయలేక ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల్లోని ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. వ్యాధి సోకిన బాధితులకు అండగా ఉండి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్‌ చేయించాల్సిన ప్రభుత్వం తూతూ మంత్రంగా సేవలందిస్తూ కాలం వెళ్లదీస్తోంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలపై నియంత్రణ కొరవడటంతోపాటు ప్రభుత్వ పెద్దలే స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఫలితం నానాటికీ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. విచ్చలవిడిగా బోర్లు వాడకం కూడా ఫ్లోరోసిస్‌కు మరో ప్రధాన కారణం. చంద్రబాబు ప్రకటించిన రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీటి పథకం ఊసే లేదు. రుణమాఫీ పథకంతోపాటే దాన్నీ మాఫీ చేసేశాడు. ఫ్లోరైడ్‌ బాధితులకు శ్రేష్ఠమైన పాలు తాగడం కంటే ప్రత్యామ్నాయం లేదు. అయితే హెరిటేజ్‌ దెబ్బకు పాడి పరిశ్రమ ఎంతగా కుదేలైందో చెప్పాల్సిన పనిలేదు. దాంతోపాటు కరువు కారణంగా పశుపోషణ కూడా భారమై పాల ధర ఆకాశన్నంటింది. ప్యాకెట్‌ పాలు అందుబాటు ధరలో ఉన్నా అవి శ్రేష్టమైనవని చెప్పలేం. 

ఫ్లోరోసిస్‌కు ప్రధాన కారణాలు
ఫ్లోరైడ్‌ అనేది మన శరీరంలో కూడా ఉంటుంది. తినే ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, తాగే నీటి ద్వారా మనకు అందుతుంది. అయితే తాగే నీటిలో మోతాదుకు మించిన ఫ్లోరైడ్‌ కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా ఫ్లోరైడ్‌ ఎముకల్లో చేరి బండబారేలా చేస్తుంది. ఇసుకను విచ్చలవిడిగా తవ్వడం వలన భూగర్భ జలాలు నానాటికీ తరిగిపోతున్నాయి. వేల అడుగుల లోతుకు వెళ్తే తప్ప బోరు నీరు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అయితే లోతుకు వెళ్లే కొద్దీ నీటిలో ఫ్లోరైడ్‌ శాతం పెరుగుతుంటుంది. పైగా ఈ నీటిని పంట పొలాలకు వాడటంతో ఆ నీటితో పండించిన పండ్లు.. కూరగాయలు తిన్నా మనకు ఫ్లోరైడ్‌ శరీరానికి చేరే ప్రమాదం ఉంది. చెరువులు, నదుల ద్వారా వచ్చే నీటితో పండించే పంటలను.. బోరు నీటితో పండించే పంటలను పరిశీలించి చూస్తే చాలా తేడా ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

ప్రకాశంలో రెండేళ్లలో 424 మంది మృతి 
ప్రకాశం జిల్లాలోని కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. గడిచిన రెండేళ్ల కాలంలో ఇప్పటికే 424 మంది కిడ్నీలు ఫెయిలై మరణించారు. కాగా వ్యాధి గురించి తెలియకుండానే మరణించిన వారు వేల సంఖ్యలో ఉంటారు. ఫ్లోరైడ్‌ నీటిని తాగడం వలనే జనం మృత్యువాత పడుతున్నారని వైద్యాధికారులు కూడా నిర్ధారిస్తున్నారు.


ఫ్లోరోసిస్‌తో ఆరోగ్య సమస్యలు
భూమిలో, నీళ్లల్లో ఫ్లోరైడ్‌ ఎక్కువ ఉండటం వల్ల మన శరీరానికి  అవసరమైన దాని కన్నా ఎక్కువ మోతాదులో శరీరంలో చేరుతూ ఉంటుంది. ఇలా మన శరీరంలో అధికంగా చేరిన ఫ్లోరైడ్‌ ఎముకల్లో చేరి ఎముకలు బండబారేలా చేస్తుంది. ఈ ఫ్లోరైడ్‌ ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల వచ్చే వ్యాధుల్ని ఫ్లోరోసిస్‌ వ్యాధులు అంటాం. ఈ ఫ్లోరోసిస్‌ వ్యాధులు త్వరగా నయం కావు. మచ్చలుపడ్డ పళ్లు, వంకరపోయిన కాళ్లు, చేతులు మళ్లీ మామూలు స్థితికి రావడం చాలా కష్టం. కాబట్టి ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి పెరగకుండా ఆపాలి. ఫ్లోరోసిస్‌ వ్యాధి ఒకసారి వస్తే దాని వల్ల జరిగిన నష్టాన్ని మందులతో నయం చేసుకోలేం. 

ఫ్లోరోసిస్‌ వల్ల కలిగే చెడు ప్రభావాలు 
బాల్యంలో ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో ఉన్న వాళ్లల్లో మాత్రమే పళ్లమీద మచ్చలు, గార కనిపిస్తాయి. పెద్దయ్యాక ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో నివసించినా, పెద్దవాళ్లయ్యాక ఫ్లోరైడ్‌ ఎక్కువగా తీసుకున్నా పళ్లమీద మచ్చలు రాకపోవచ్చు. అలాగని ఫ్లోరోసిస్‌ ప్రభావానికి లోనుకాలేదు అనుకోలేం. ఫ్లోరోసిస్‌ వల్ల ఎముకలు, వెన్నెముక దెబ్బతింటాయి.  పంటిమీద మచ్చలు ఏర్పడటం, కాళ్లు, చేతులు వంకర్లు పోవడం వంటివే కాదు... మన శరీరంలో ఫ్లోరైడ్‌ శాతం పెరిగే కొద్దీ నరాల బలహీనత, కండరాల క్షీణత, కీళ్లనొప్పులు, రక్త ప్రసరణలో లోపాలు, జీర్ణకోశవ్యాధులు, గుండె జబ్బులు, మధుమేహం, మూత్రపిండాలు దెబ్బతినడం మొదలైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొద్ది రోజులు ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నీళ్లు తాగినా ఏం కాదు. నెలల తరబడి తాగినప్పుడు మాత్రమే ఫ్లోరోసిస్‌ వ్యాధి వస్తుంది. 


1.4 పీపీఎం మించితే ప్రమాదం
తాగేనీటిలో ఫ్లోరైడ్‌ శాతం 1.4 పీపీఎం మించితే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇది 1.5 పీపీఎం నుంచి 14 పీపీఎం  వరకు ఉంది. ప్రకాశం జిల్లాలోని 62 మండలాల్లో ఫ్లోరైడ్‌ తీవ్రస్థాయికి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 5 పిపిఎం ఉన్న నీటిని తాగినా స్కెలిటల్‌ ఫ్లోరోసిస్‌ (ఎముకలు బిగుసుకుపోవడం, వెన్నెముక వంకరపోవడం) రాకూడదు. కానీ మన రాష్ట్రంలో 3 పిపిఎం ఉన్న నీళ్లను తాగినా స్కెలిటల్‌ ఫ్లోరోసిస్‌ వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంతాల్లో పండిన ఆహారధాన్యాల్ని వినియోగించడమే. ఫ్లోరోసిస్‌ ప్రభావిత ప్రాంతాల్లో మేలైన పోషకాహారం తీసుకోవడం వలన కూడా ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు. Back to Top