దమ్మిడి సాయం అందడం లేదు...!

రైతుల ఆత్మహత్యలు చంద్రబాబు పుణ్యమే..
కరువుపై జగన్ ఏకరువు..ప్రభుత్వం ధిక్కారం..!

నాలుగోరోజు అసెంబ్లీ కరువు అంశంపై దద్దరిల్లింది. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపై   ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ సభలో  ఎలుగెత్తారు. రాష్ట్రంలో  కరువు పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నా..ప్రభుత్వం రైతులకు దమ్మిడి సాయం చేయడం లేదని  జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.  ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించినందుకు  వైఎస్ జగన్ ప్రసంగానికి అధికారపార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. పలుమార్లు మైక్ కట్ అయ్యింది. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రప్రజలంతా గమనిస్తున్నారని జగన్ అన్నారు.

చనిపోయిన వారి ప్రతి ఇంటికి వెళ్తా..!
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సరిగా ఇవ్వనందునే రుణభారం పెరిగి, రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయని వాపోయారు. రాష్ట్రంలో 197 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని,ఒక్క అనంతపురంలోనే 101 మంది చనిపోయారన్నారు. మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి మంత్రులు వాస్తవాలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.  చనిపోయిన ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నానని..ఇకముందు వెళ్తానని జగన్ ఉద్విఘ్నంగా మాట్లాడారు. వాళ్ల గాథలు వినండి..మార్చగలిగితే మార్చండి అని పచ్చనేతలకు సూచించారు. 

కరువుపై దాగుడుమూతలెందుకు చంద్రబాబు..!
రాష్ట్రంలో 556 మండలాల్లో కరువు తీవ్రత ఉంటే 238 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కరువు తీవ్రత పెరిగితే సబ్సిడీ పెంచాల్సింది పోయి తగ్గించేస్తున్నారని  ప్రభుత్వంపై జగన్ నిప్పులు చెరిగారు. 2014-15కు సంబంధించి కలెక్టర్లు రూ.1500 కోట్లు అడిగితే రూ.290 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు.  కేంద్రం నుంచి వస్తున్న నిధులను వేరేవాటికి మళ్లిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు పుణ్యమాని దాదాపు 50 శాతం రైతులు ఇప్పటికే క్రాప్ హాలీడే ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఖరీఫ్ కు రూ.29,022కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.21,018 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. 
Back to Top