మూడు రోజుల పాటు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. పులివెందుల, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మమేకం అయ్యారు. ఆత్మీయ అతిథితో అక్కడవారు కలిసిపోయారు.సోమవారం మధ్యాహ్నం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పులివెందులకు చేరుకొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. రాజుపాళెం మండలం కొర్రపాడులో ఇటీవల కన్నుమూసిన పార్టీ నాయకులు దొంతిరెడ్డి నారాయణ రెడ్డి సమాధిని దర్శించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అదే గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అక్కడ స్థానిక చర్చిలో ఆయన ప్రార్థనలు చేశారు. సాయంత్రం ప్రొద్దుటూరు వెళ్లి అక్కడ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు చేయించారు. దసరా సందర్బంగా వచ్చేందుకు వీలు కుదరక పోవటంతో ఇప్పుడు హాజరై పూజలు చేయించారు. మంగళ వారం స్థానిక నాయకులతో కలిసి పైడిపాలెం రిజర్వాయర్ ను దర్శించారు. 2005 లోనే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే దాదాపు 85-90 శాతం పనుల్ని పూర్తి చేయటం జరిగింది. 712 కోట్లకు పైగా ఖర్చు చేసి పనుల్ని పూర్తి చేశారు. చివరగా కాల్వ పనులు, గేట్ల పనులు, డిస్ట్రిబ్యూటరీ పనులు మాత్రం మిగిలి ఉన్నాయి. అయినా ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. 25 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తయి రైతులకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దయ తలచటం లేదు. దీనిపై వైఎస్ జగన్ ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీశారు. మూడో రోజు ఇ కొత్తపల్లి సమీపంలోని మోట్నూతల పల్లె లో రైతు రాజశేఖర్ కుటుంబాన్ని పలకరించారు. అరటి తోట వేసి నష్టపోయి అప్పుల బాధతో ఆయన ఆత్మహత్య చేసుకొన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా కల్పించారు. పబ్లిసిటీ వస్తుందనుకొంటే ఎంత ఖర్చు అయినా పెడతారని, పేద రైతు కుటుంబాల్ని మాత్రం పట్టించుకోవటం లేదని జగన్ వ్యాఖ్యానించారు. పులివెందుల లో వైఎస్ జగన్ ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి సమావేశం అయ్యారు. అక్కడ స్థానికుల్ని కలిసి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ప్రతిపక్ష నేత గా ఎంత బిజీగా ఉన్నా నియోజక వర్గం మీద శ్రద్ధ పెట్టడం జన నేతకు ఎప్పుడూ అలవాటు. <br/>