విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర 11 జిల్లాలను పూర్తి చేసుకుంది. 12వ జిల్లా విజయనగరంలో అడుగుపెడుతున్న తొలిరోజే ఓ చారిత్రక ఘట్టానికి కూడా వేదికైంది. యువనేత ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలు రాయిని కూడా ఇదే రోజు చేరుకోవడం ఓ మరుపురాని సంఘటన. విజయనగరం జిల్లా ప్రతిపక్ష నేతకు ఘన స్వాగతం పలికింది. రాజన్న బిడ్డకు ఆప్యాయంగా ఆహ్వానాన్ని అందించింది. 
అభివృద్ధికి ఆమడదూరంలో విజయనగరం
చంద్రబాబు పాలనలో విపరీతమైన వివక్షకు గురైన జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటి. ఉత్తరాంధ్ర జిల్లాలను చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. నిజానికి ఉత్తరాంధ్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి కనీసం ఆగ్రామానికి కూడా ఎలాంటి న్యాయం చేయలేదు. ఇక ఉత్తరాంధ్రవాసులకు బాబు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడో అటకెక్కాయి.  అధికారంలోకి వచ్చాక, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాకు ఇచ్చిన హామీలు ఇవి
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం, జిల్లాలో పారిశ్రామిక నగరం,ఏడాదిలోపే తోటపల్లి రిజర్వాయిర్, ఫుడ్ పార్క్, గిరిజన యూనివర్సిటీ, విజయనగం స్మార్ట్ సిటీగా రూపొందించడం, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్క్, పోర్టు , సంగీతం మరియు లలిత కళల అకాడమీ మెడికల్ కాలేజీ. వీటిలో ఒక్క తోటపల్లి రిజర్వాయిర్ ను మాత్రమే పూర్తి చేసారు. అది కూడా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు తప్ప మరోటి కాదు. అయితే ఈ ప్రాజెక్టుకు పోరాటయోధుడు గౌతు లచ్చన్న పేరు పెట్టినా అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా ఆ పేరు ప్రస్తావించలేదు చంద్రబాబు. కేవలం తన పేరును ప్రచారం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చినందుకు ఆ ప్రాంత వాసులు మండిపడుతున్నారు. ఇది తెలుగుదేశం బాధ్యతారాహిత్యమని, ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక చంద్రబాబు ఇచ్చిన మిగతా హామీల సంగతి చెప్పుకోవడానికేమీ లేదు. ప్రతి జిల్లాకూ ఇచ్చినట్టే తాయిలంలా హామీలను గుప్పించిన బాబు తోటపల్లిని తప్ప మరొక్క హామీని కూడా నెరవేర్చలేదు. వెనుకబడ్డ జిల్లాలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో ఈ జిల్లా వాటాను కూడా సద్వినియోగం చేయలేదు. పైగా ఆ నిధులు వేరేవాటికి దారిమళ్లినట్టు కాగ్ నివేదికలో బైటపడింది. 

వెనుకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలకు చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలు వైఎస్ జగన్ కు విన్నవిస్తున్నారు. విశాఖ వాసుల ఆవేదనను విన్న వైఎస్ జగన్ నేటి నుండి విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్రను కొనసాగిస్తున్నారు.  వివిధ వర్గాల ప్రజలతో మమేకమౌతూ పాదయాత్ర సాగిస్తున్నారు. 
 
Back to Top