తూర్పు సింధూరం- తూర్పు గోదావ‌రి జిల్లాలో దిగ్విజ‌యంగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- జూన్ 12న తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌వేశం
 - దాదాపు 400 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌
- 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన‌సాగిన పాద‌యాత్ర‌
- రెండు నెల‌ల పాటు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌
తూర్పు గోదావ‌రి:తొలిపొద్దు తూర్పు సింధూరంలా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుదుట మెరిసింది ఆత్మీయ జ‌నాభిమానం. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటూ, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నవరత్నాలను వెంటపెట్టుకుని, వివక్ష, కక్ష పూరిత పాలకుల వైఖరిని ఎండగడుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు నీరాజనాలు పలికారు. గ‌తేడాది నవంబ‌ర్ 6వ తేదీ ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన జ‌న‌నేత పాద‌యాత్ర ప‌ది జిల్లాల్లో పూర్తి అయ్యింది. జూన్‌ 12వ తేదీన పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది మొద‌లు ఇవాల్టి దాకా జ‌న‌నేత వెంట‌ వేలాది మంది  అడుగులో అడుగులు వేశారు. రాజ‌మండ్రి బ్రిడ్జి జ‌న‌నేత రాక‌తో ఊగిపోయింది. పాదయాత్రికుడికి గ్రామ గ్రామానా ప్రజలు బ్రహ్మరథం పలికారు. ప్రతి గ్రామంలో అక్కచెల్లెమ్మలు హారతులు పట్టి విజయతిలకం దిద్దుతుండగా, గ్రామాలు దాటి వచ్చిన తమ మనవడికి దిష్టి తీయాలంటూ టెంకాయలు, గుమ్మడికాయలతో అవ్వాతాతలు ఎదురేగుతున్నారు. తమ మనుమడికి దిష్టి తీసి గ్రామం నుంచి సాదరంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఆపన్నులు తమ సమస్యలు జననేతకు చెప్పుకుని సేద తీరుతున్నారు. పథకాల్లో వివక్ష, కేసులు పెడుతూ స్థానిక నేతలు సాగిస్తున్న కక్షా రాజకీయాల గురించి తమ నాయకుడికి చెప్పుకుని ఊరట చెందుతున్నారు. ఆపన్నులు, కార్యకర్తలు, అభిమానుల కష్టాలు సావధానంగా వింటూ, తాను అండగా ఉంటానని భరోసా ఇస్తూ వైయ‌స్ జగన్‌ ముందుకు సాగారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో దాదాపు 400 కిలోమీట‌ర్ల మేర 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు రెండు నెల‌ల పాటు రాజ‌న్న బిడ్డ పాద‌యాత్ర ద్వారా ప‌ర్య‌టించి చంద్ర‌బాబు హామీల‌తో మోస‌పోయిన వారికి ధైర్యం చెప్పారు. 

క‌ష్టాలు తెలుసుకుంటూ..క‌న్నీళ్లు తుడుస్తూ..
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుంటూ, వారి క‌న్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. టీడీపీ పాలకులు సాగిస్తున్న వివిక్ష, కక్షపూరిత పనులు, తమపై బనాయించిన కేసులు, పథకాలు అందకుండా చేసిన పరిస్థితిపై పలువురు తమ ఆవేదనను జగన్‌కు చెప్పుకొనాన్నారు. తాండవ నదిలో ఇసుక అక్రమంగా తరలిస్తుండడంపై ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టారని, తమ పొలం పక్కనే ఇసుక తవ్వొద్దని అడ్డుకుంటే ఎద్దుల బండితో తొక్కిస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశారు.  ఎంబీఏ, బీటెన్‌ చదువుతున్న తనకు మొదటి ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని విద్యార్థులు వాపోయాడు. ఐదు నెలలుగా బిల్లులు రావడంలేదని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తమను ఎస్సీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారని ఏపీ రజక హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2007 నుంచి జాతీయ ఉపాధిహామీ పథకంలో క్షేత్ర సహాయకులుగా పనిచేస్తున్న తమను టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని పలువురు వైయ‌స్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలప్పుడు డప్పు కళాకారులకు రూ.1500 పింఛన్‌ ఇస్తానన్న సీఎం చంద్రబాబు ఆ తర్వాత ఇప్పటి వరకూ పట్టించుకోలేదని  డప్పు కళాకారులు వాపోయారు. కబ్జాకు గురువుతున్న మాదిగ మాన్యాలను రక్షించాలని విన్నవించారు. అందరి సమస్యలు వింటూ, పరిష్కారంపై స్పష్టమైన భరోసా ఇస్తూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగారు.

14న విశాఖ జిల్లాలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది జిల్లాల్లో పాద‌యాత్ర చేప‌ట్టిన వైయ‌స్ జ‌గ‌న్ ఉత్త‌రాంధ్ర ముఖ‌ద్వార‌మైన విశాఖ జిల్లాలోకి ఈ నెల 14వ తేదీ ప్ర‌వేశించ‌నున్నారు.  గోదావరి బ్రిడ్జిపై, కృష్ణానదిపై జగన్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఎంట్రీపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి.  గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడి పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుంది.  విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో 210 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని, 7 బహిరంగ సభల్లో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారని.. 25 రోజుల పాటు జిల్లాలో పర్యటన ఉంటుందని పార్టీ నాయ‌కులు వెల్లడించారు.   
Back to Top