జగన్‌ రాకతో దద్ధరిల్లిన మంత్రుల అడ్డా

– జమ్మలమడుగు, ఆళ్లగడ్డలో పాదయాత్ర సక్సెస్‌
– బెదిరింపులకు లొంగక పోటెత్తిన అభిమానులు
– బహిరంగ సభల్లో జనం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రకు మంత్రుల నియోజకవర్గాల్లో విశేష స్పందన లభించింది. కడప జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జననేత పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మహానేత తన యుడు తమ సమస్యలు వినేందుకు వస్తున్నాడని తెలిసి వృద్ధులు, మహిళలు, చిన్నారులు భారీగా తరలివచ్చి జనహారతి పలికారు. అధికారం అడ్డం పెట్టుకుని అడ్డంకులు సృష్టించి పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా ప్రజాభిమానం ముందు వారి పప్పులుడకలేదు. జమ్మలమడుగు, ఆళ్లగడ్డ నియోజకవర్గాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రెండు చోట్ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదినారాయణరెడ్డి, భూమా అఖిల ప్రియలిద్దరూ 2014 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ నుంచి ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. ఆ తర్వాత ఇద్దరూ మంత్రి పదవులు దక్కించుకున్నారు. 

బెదిరింపులకు తొణకని జనం
ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆయా నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీకి అభ్యర్థులు లేరు.. కార్యకర్తలు లేకుండా పోయారంటూ అనుకూల మీడియా ద్వారా టీడీపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంది. పార్టీ ఫిరాయించిన వారిద్దరికీ మంత్రి పదవులు కూడా ఇవ్వడంతో అధికారాన్ని అడ్డగోలుగా వినియోగించి ప్రజలను బెదిరించసాగారు. జగన్‌ పాదయాత్రకు వెళ్లినట్టు తెలిస్తే పింఛన్లు రాకుండా చేస్తాం.. సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా జనం లెక్కచేయలేదు సరికదా మిగతా ప్రాంతాలకన్నా ఈ రెండు నియోజకవర్గాల్లో నిర్వహించిన పాదయాత్రకు జనం నుంచి ఎక్కువ స్పందన లభించిందంటే అతిశయోక్తి కాదేమో. పాదయాత్ర సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో కరెంటు లేకుండా చేసిన ఘనత కూడా మంత్రికే దక్కుతుంది. పాదయాత్ర విశేషాలను ప్రజలకు తెలియకుండా ఉండటానికి వారు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. 

బహిరంగ సభలు సూపర్‌ సక్సెస్‌
ఈ రెండు నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎ్రరగుంట్లలో, ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో ముత్యాలపాడు మండలం, ఆళ్లగడ్డ టౌన్‌లలో నిర్వహించిన బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గాలేరు నగరి, గండి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. జగన్‌ పాదయాత్రలో అడుగడుగునా ఉద్యోగులు, కూలీలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదురొచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. 
Back to Top