రాప్తాడులో అడుగుపెట్టిన ప్రతిపక్షనేత ప్రజాసంకల్పం

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఎపి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గంలోకి అడుగుపెట్టింది. గుంతకల్, తాడిపత్రి, శింగనమల, ఉరవకొండ  నియోజకవర్గాలను దాటుకుని రాప్తాడులోకి ప్రవేశించింది. 2009లో జరిగిన పునర్ వ్యవస్థీకరణలో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటయ్యింది. గతంలో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలతో పాటు అనంతపురం అసెంబ్లీ నియోజక వర్గపరిధిలో ఉన్న రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలను కలుపుతూ 6 మండలాలతో  రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. 
రాప్తాడు చుట్టూ సమస్యల వలయం
ఇక్కడ అధికశాతం వ్యవసాయదారులే ఉన్నారు. నీటి వసతిలేక పంటలు సరిగ్గా పండటం లేదు. వర్షాధారంగా అక్కడి రైతులు వేరుశెనగ పంట వేసుకుంటున్నారు. పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదని, పంటను అమ్ముకునేందుకు కర్నూలుకో పక్క రాష్ట్రానికో పోవాల్సి వస్తోందని తన కష్టాన్ని ప్రతిపక్ష నేతకు వివరించారు ఆ ప్రాంత రైతులు. శెనగపంటను కొనడానికి అనంతపురంలోనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయమని కూడా కోరుతున్నారు. ఈ ప్రాంతానికి నీటివసతి ఏర్పాటు చేయాలని సంకల్పించారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. హంద్రీనీవా సుజల స్రవంతి కింద సాగునీటి కాలవల నిర్మాణాన్ని మొదలు పెట్టి 70శాతం పనులు పూర్తి చేసారు. ఆ తర్వాత ఆయన మరణించాక టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిడిపి నేతలెవరూ రాప్తాడు అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గం. 
మంత్రి పాలనా వైఫల్యం
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోదుపుర్తి ప్రకాశ్ రెడ్డి టిడిపి బరిలో ఉన్న పరిటాల సునీతకు గట్టి పోటీ ఇచ్చారు. అతి తక్కువ ఓట్ల మెజారిటీతోనే సునీత రాప్తాడులో గెలవగలిగారు. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. కానీ రాప్తాడు రైతులకోసం ఏ ఒక్కపనీ చేయాలేకపోయారు. పేరూరు డ్యాం కు నీరు తెస్తానని హామీ ఇచ్చిన పరిటాల సునీత ఇంత వరకూ హామీని నిలబెట్టుకోకపోవడం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంత రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ కూడా చేయించలేకపోయారు. ప్రభుత్వ విధాన వైఫల్యానికి రాప్తాడు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. వైసిసి నేతలు, కార్యకర్తలపై దాడులు, అధికార పార్టీ చేయిస్తున్న హత్యలే అంటూ వైఎస్ జగన్ ప్రజల ముందు బహిరంగంగానే ప్రకటించారు.  స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న పరిటాల సునీత కనీసం పిల్లలకు బాలమృతం పథకాన్ని అమలయ్యేలా కూడా చేయలేకపోయారు. నేతల వైఫల్యాలకు రాప్తాడు మూల్యం చెల్లించుకోకూడదని, ముందు ముందు ప్రజల ప్రభుత్వం వస్తుందని, రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల వారికీ అండగా నిలుస్తుందని అన్నారు వైఎస్ జగన్. 
రాప్తాడులో వడ్డుపల్లి, ముదిగుబ్బ మీదగా సాగుతున్న 32వ రోజు  ప్రజా సంకల్పయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు.  తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిపక్షనేతకు వివరిస్తున్నారు. ఈ దృతరాష్టపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయమని కోరుతున్నారు. ముదిగుబ్బలో ముస్లింలతో ముఖాముఖీ నిర్వహించారు వైఎస్ జగన్. మైనారటీల పట్ల ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవరిస్తోందో వారంతా ప్రతిపక్ష నేతకు తెలియజేసారు. సభలో వారి మాటలు వింటున్న ప్రతిపక్ష నేత కూడా ఉద్వేగంతో సమాధానం చెప్పలేకపోయారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఉండగా ప్రజలకు ఈ కష్టనష్టాలు తప్పవని, అడుగడుగునా మైనారటీలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నాడన్నారు వైఎస్ జగన్. మన ప్రభుత్వం వచ్చాక వైఎస్ ఆర్ కంటే రెండు  అడుగులు ముందుకేసి మరీ మైనారిటీల సంక్షేమాన్ని చూస్తామని మాటిచ్చారు. 

 
Back to Top