శ్రీశైలం వివాదాన్ని పరిష్కరించండి: మోదీకి జగన్ లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 24: శ్రీశైలం జలాశయం నుంచి తక్షణం విద్యుత్ ఉత్పాదనను నిలిపి వేయాలని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రతి రోజూ 15 మిలియన్ యూనిట్ల విద్యుచ్ఛక్తిని కేంద్ర ఉత్పాదనా కేంద్రాల నుంచి సరఫరా చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక లేఖ రాశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగి నీటి మట్టం తగ్గితే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు తీరని హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అది తెలంగాణకు కూడా నష్టదాయకమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో స్వయంగా జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి విన్నవించారు. ‘ఆపత్సమయంలో చేస్తున్న ఆక్రందన’ గా పరిగణించాలని జగన్ తన లేఖలో కోరారు. జగన్ ప్రధానికి రాసిన లేఖ పూర్తి పాఠం...
 
 శ్రీయుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతంలోని అవసరాలకుగాను శ్రీశైలం జలాశయం నీటిని విద్యుత్ ఉత్పాదనకు వాడుకుంటున్నది. ఆపత్సమయంలో మేము చేస్తున్న ఆక్రందనగా భావించి మీరు తక్షణం ఈ అంశంపై జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన భారీ విద్యుత్ కొరతను భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తన ప్రాంతంపై ఉన్న జల విద్యుత్ కేంద్రం నుంచి 900 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటోంది. దీనివల్ల ప్రతిరోజూ 5 టీఎంసీల నీరు భారీ స్థాయిలో దిగువకు వెళ్లి పోతోంది. జలాశయంలో ఇప్పటికే నీటిమట్టం 857 అడుగులకు తగ్గిపోయింది. తెలంగాణ ప్రభుత్వం కనుక విద్యుత్ ఉత్పాదనను తక్షణం నిలిపివేయకపోతే నీటి మట్టం మరింత దిగజారే ప్రమాదం ఉంది. రిజర్వాయర్‌లో ఈ రకంగా నీటి మట్టం గణనీయంగా కనీస స్థాయి (మినిమమ్ డ్రా డౌన్ లెవెల్) 854 అడుగుల కన్నా తగ్గిపోతే రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు నుంచి లభించాల్సిన నీటి వాటా దక్కదు. నిరంతర కరువు ప్రాంతమైన రాయలసీమలో ఇప్పటికే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీ నాటికి పరిస్థితులను పరిశీలిస్తే వర్షపాతంలో 62 శాతం లోటుంది. పంటలకు సాగునీటి లభ్యత మాట అటుంచితే అక్కడి ప్రజలకు తాగడానికి కూడా కనీసం మంచినీరు లేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తక్షణం ఈ పరిస్థితులను అదుపు చేయకపోతే ఇది తీవ్రమైన మానవాళి సమస్యగా పరిణమిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున జలాలను విద్యుత్ ఉత్పాదన కోసం వినియోగిస్తూ దిగువకు వదులుతూపోతే రానున్న కొద్ది మాసాల్లో కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఇలాగే మరికొద్ది రోజుల పాటు జలాలను కిందకు వదలి వేయడం కొనసాగితే వాటిని బంగాళాఖాతంలోకి వదలివేయడం తప్ప ఏపీ ప్రభుత్వం వద్ద మరో ప్రత్యామ్నాయం లేదు. నీళ్లన్నీ సముద్రంలోకి వెళ్లిపోతే కోస్తాంధ్ర, ముఖ్యంగా కృష్ణా డెల్టా ప్రాంతాలు తీవ్రమైన మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొని ఉందనేది కాదనలేని సత్యం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తీవ్రమైన విద్యుత్ కొరత నెలకొని ఉందని మీ దృష్టికి తెస్తున్నాను. విద్యుత్ ఉత్పాదన కోసం ఇంత భారీగా జలాలను వినియోగించడంవల్ల తీవ్రమైన దుష్పరిణామాలు ఏర్పడతాయి. ఇది తెలంగాణకు కూడా నష్టదాయకమే. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి.ఈ నేపథ్యంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పాదనను నిలిపి వేయాల్సిన అవసరముంది. తెలంగాణలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సానుభూతి ఎంతైనా అవసరముంది. తెలంగాణలో ఏర్పడిన 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును భర్తీ చేయడానికి ఆ మేరకు కేంద్ర విద్యుత్ ఉత్పాదన సంస్థల నుంచి ప్రతి రోజూ సరఫరా చేయడానికి దయతో అంగీకరించాల్సిన అవసరం కూడా ఉంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన 2014 జూన్ 2వ తేదీ నాటి నుంచీ ఉభయ రాష్ట్రాల మధ్య తలెత్తున్న సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించుకోవడంలో రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోకపోవడం దురదృష్టకరమైన పరిణామంగా ఉంది. కీలకమైన, ప్రాధాన్యం గల అంశాలపై కూడా రెండు ప్రభుత్వాలు ముఖాముఖి కూర్చుని మాట్లాడుకోవడం గగనమైపోతోంది. అది ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల అంశం కావచ్చు, విద్యార్థుల ట్యూషన్ ఫీజు రీయింబర్సుమె౦ట్  సమస్య కావచ్చు, తాజాగా తలెత్తిన శ్రీశైలం జలాల వివాదం కూడా అంతే, ఈ సమస్యలు వేటిపైనా ఉభయ ప్రభుత్వాలు సుహృద్భావంతో చర్చించుకోలేదు. తొలి రెండు అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సి వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవడంలో విముఖతతో ఉండటం, పారదర్శకంగా వ్యవహరించక పోవడంవల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజల తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందులను ఎదుర్కోవడానికి కారణమవుతున్నాయి. రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవడం కన్నా వాటిని రాజకీయం చేయడానికే ఉభయ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఇరు ప్రాంతాల ప్రజలు సమిధలవుతున్నారు. ఈ అంశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఈ కింది చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
 
దయచేసి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయరులోని జలాలను విద్యుత్ ఉత్పాదనకోసం వాడుకోకుండా నిలిపి వేయాలి.
తెలంగాణ ప్రాంతంలో భారీగా పెరిగిపోతున్న విద్యుత్ కొరతను ఎదుర్కోవడానికి రోజుకు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేంద్ర  విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేటాయించాలి.
కృష్ణా-గోదావరి నదీ జలాల బోర్డులను ఏర్పాటు చేసినట్లుగానే ఉభయ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
                                     గౌరవాభివందనలతో,
                                         - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Back to Top