ఫుల్‌ క్లారిటీ... ఫుల్‌ జోష్‌

()ప్రవాసాంధ్రులతో వైయస్ జగన్
()బాబు మోసాలను ఎండగట్టిన జననేత
()పలు ఆసక్తికర విషయాలు వెల్లడి

              ఏపీ ప్రతిపక్ష నాయకుడు ఆదివారం రాత్రి ప్రవాసాంధ్రులతో నిర్వహించిన ‘ముఖామఖి’ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్నికి చేస్తున్న అన్యాయం, మోసాలను ఎండగట్టారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తండ్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి వలనే మొదటిసారి మంత్రి అయ్యాడని వెల్లడించారు. ఏపీకి హోదా రాకపోవడానికి గల కారణాలు, రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, ఇన్‌సైడర్‌ ట్రెడింగ్, స్విస్‌ చాలెంజ్ మోసం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్ట్‌ వంటి అంశాలపై వైయస్‌ జగన్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రవాసాంధ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన లైవ్‌ ఇంటరాక్షన్‌ కార్యక్రమంతో తాను చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలపై పూర్తి అవగాహనతో ఉన్నట్లు కనిపించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం అవసరమైతే తమ పార్టీ పార్లమెంట్‌ సభ్యులతో రాజీనామా చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కుండబద్దలు కొట్టారు. 

తెలంగాణ వచ్చిందిగా... ప్రత్యేక హోదా రాదా?
అసాధ్యమనుకున్న తెలంగాణ వచ్చినపుడు.. పార్లమెంట్‌లో ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించుకోవడం కష్టమేమీ కాదన్నారు. అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులను నిలదీసే పరిస్థితి రావాలనీ, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణ పరిస్థితిలో ఉందని జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజీపడిపోయారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వారికే కేంద్రంలో మా మద్ధతు ఉంటుందన్నారు. వైయస్సార్‌సీపీపై ఆధారపడే ప్రభుత్వమే కేంద్రంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు.. దీన్నీ ప్యాకేజీ అంటారా?
విభజన చట్టం ద్వారా హక్కుగా సంక్రమించిన వాటి కన్నా ఎక్కువగా చేస్తే దాన్ని ప్యాకేజీ అంటారని ప్రతిపక్ష నేత వివరించారు. కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే కోతలు వేసి ఇప్పటికే అమలతున్న వాటినే తిరిగి ప్రకటిస్తే అది ఎలా ప్రత్యేక ప్యాకేజీ అవుతుందని ప్రశ్నించారు. అరుణ్‌ జైట్లీ సెప్టెంబరు 7న ప్రకటన చేసే సమయంలోనే ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చిచెప్పారన్నారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకిగా మారాయని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవని సవివరంగా చెప్పారు. జైట్లీ ప్రకటనలో రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసినా.. సీఎం చంద్రబాబు స్వాగతించారు కాబట్టే బాబుకు ఇంగ్లీషు రాదని తాను ఎద్దేవా చేశానని కొమ్మినేని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

ఆ రోజే మా ఎంపీలతో రాజీనామా చేయించేవాడిని..!
అరుణ్‌జెట్లీ ప్రకటన చేసిన రోజే మా పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిద్దామనిపించింది. అలా చేస్తే సభలోకి వెళ్లి మాట్లాడే వారే లేకుండా పోయే పరిస్థితి. వాస్తవానికి కొట్లాడుతున్నది ఎవరన్నా ఉంటే వైఎస్సార్‌సీపీ ఎంపీలే. అలాంటి వాళ్లు రాజీనామా చేస్తే కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఏదేమైనా  దశలవారీగా పోరాడుతూనే ఉంటాం. సరైన సమయంలో రాజీనామా బ్రహ్మాస్రాన్ని ఉపయోగిస్తాం. ఉద్యమాన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే దానిపై మేధావులతో చర్చించాలని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.  

ఆ ఇద్దరూ మాట మార్చారు
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని చెప్పిన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరూ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని దుయ్యబట్టారు. పైగా సెప్టెంబర్‌ 7న అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు 5 కోట్ల ఆంధ్రులను నిలువునా మోసం చేశారనన్నారు. ప్రత్యేక హోదా సంబంధించి పలు సందర్భాల్లో వెంకయ్య, బాబు మాట్లాడిన మాటలను గతవారం ఏలూరులో జరిగిన ‘యువభేరి’లో వీడియోలను యువత సమక్షంలో కూడా ప్రదర్శించిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మాకు కనీసం మద్దతు ప్రకటించకపోగా అభివృద్ధి నిరోధకులమని దుష్ప్రచారం చూస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు ప్రత్యేక హోదా సంజీవని అయినప్పుడు ఇప్పుడు ప్యాకేజీనే ఎలా గొప్పదవుతుందో ఆ నాయుళ్లిద్దరూ ప్రజలకు వివరించాలన్నారు. ఓవైపు ప్రత్యేక హోదా రాలేదని ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉంటే సన్మానాలు చేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాదు తన వ్యక్తిగత స్వార్థ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రాని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పిన ప్రజలు ఇప్పుడు మోసం చేస్తున్న టీడీపీ, బీజేపీలకు కూడా బుద్ధిచెప్పే రోజు తొందర్లోనే రాబోతుందని పేర్కొన్నారు. 

పవన్‌ కల్యాణ్ను లైన్‌లో పెట్టుకున్నా లాభంలేదు
ప్రత్యేక హోదా పేరుతో ఒకసారి మోసం చేసిన ప్రజలను మేనేజ్‌ చేయాలంటే కుదరదని వైయస్‌ జగన్‌ అన్నారు. ప్యాకేజీని స్వాగతిస్తున్నామని ఒప్పుకుని ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో టీడీపీ వారిని మేనేజ్‌ చేయాలని చూస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఒకసారి అన్యాయం జరిగితే ఎప్పటికీ విశ్వసించరని అన్నారు. వారి ఆవేశాలు చల్లార్చడానికి పవన్‌ కల్యాణ్ ను లైన్‌లో పెట్టుకున్నా, మరెవరినైనా లైన్‌లో పెట్టుకున్నా ఐదు కోట్లమంది తెలుగు ప్రజలను మాత్రం లైనులో పెట్టడం సాధ్యం కాదని తెలిపారు. 

ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులమా..?
అవినీతిని ప్రశ్నిస్తే అడ్డుతగులుతున్నామంటారు. రాజధాని భూదందా, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, ఓటుకు కోట్లు, స్విస్‌ చాలెంజ్‌ ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. రాజధాని నిర్మాణం సందర్భంగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తన బినామీలకు, దొంగ కంపెనీలకు కేటాయించి ప్రజాధనాన్ని దోచుకునేందుకు చంద్రబాబు పథక రచన చేశాడని అన్నారు. వాటిని అడ్డుకుంటున్నామన్న అక్కసుతోనే మాపై అభివృద్ధి నిరోధకులమనే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధవలేశ్వరం నుంచి రోజుకు 3లక్షల నుంచి నాలుగు లక్షల  క్యూసెక్కుల నీరు, ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల నీరు సముంద్రంలో కలుస్తుందన్నారు. మేము ఆరోజు చెప్పింది కూడా అదే కదా..! పట్టిసీమ అంటూ గోదావరి, ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు తెచ్చి సముద్రంలోకి కలుపుతున్నారు. గోదావరి, కృష్ణా నదులకు ఇంచుమించుగా ఒకేసారి వరదలు వస్తాయి. అలాంటప్పుడు ఆ నీటిని ఒక స్టోరేజీ నిర్మించి భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చని సూచించారు. పోలవరం అన్నది ఆ స్టోరేజీయే. కానీ పోలవరం కట్టడు. పట్టిసీమ అంటాడు. కాలువను నది అంటాడు.. చంద్రబాబుకు మెగలేమేనియో వ్యాధి సోకిందేమోనని అనుమానంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఉప ఎన్నికలకు సిద్ధమా బాబూ..?
అనేక ప్రలోభాలు పెట్టి వైయస్సార్‌ సీపీ టిక్కెట్‌ మీద గెలిచి టీడీపీలో చేరిన 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమా అని జగన్‌ సవాల్‌ విసిరారు. ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. బాబు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండం నేర్చుకోవాలి. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం.., మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయాలు చేయాలనుకోవడం మూర్ఖత్వమవుతుందని గట్టిగానే మందలించారు. తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తారు. వాటిని స్వాగతించాలి. తప్పులను దిద్దుకోవాలి. అంతేకాని అసహనంతో ఊగిపోవడం సరికాదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. 

స్వార్థం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోను
తమ విలువైన సమయాన్ని వెచ్చించి తాను నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ప్రవాసాంధ్రులందరికీ ముందుగా వైయస్‌ జగన్‌ కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్‌ చాలా ఉత్సాహంగా, ధీమాగా కనిపించారు. హోదా కోసం పోరాడుతున్నా.. మీ అందరి మద్దతు కావాలి అని వారిని అడిగారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...‘ ఒకటి మాత్రం చెప్పగలను. మనస్ఫూర్తిగా పోరాడుతా. స్వార్థం, స్వప్రయోజనాల కోసం నా క్యారెక్టర్‌ను ఎప్పుడూ అమ్ముకోలేదు.. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా నా స్వార్థం కోసం చూసుకోను. నా క్యారెక్టర్‌ను అమ్ముకోను. దేనికోసమో రాజీ పడే ప్రసక్తే లేదు. పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని చెప్పగలను. మీ అందరి సహకారం నాకు కావాలి. ఇప్పటికే రెండున్నరేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం.. మరో రెండున్నరేళ్లు కష్టపడుదాం..’ అని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ముఖాముఖి ద్వారా జగన్‌ పిలుపునిచ్చారు

చంద్రబాబుకు మెగలోమేనియా వ్యాధి ఉందేమో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకోమాట... సందర్భానికోరకంగా మట్లాడటం చూస్తుంటే ఆయనకు అల్జీమర్సో, మెగలోమేనియా వ్యాధి ఉన్నట్టుగా అనుమానం వస్తోందన్నారు. ప్రపంచంలో సెల్ ఫోన్ తానే కనిపెట్టానని ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. పీహెచ్‌డీ చేశానని, షికాగో యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్‌ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెబుతున్నారని, సత్య  నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా తానే చేశానని అంటాడు. చివరకు రోజుకు 24 గంటలుంటే విద్యుత్తును రోజుకు 27 గంటలు ఇచ్చానంటాడు. నమ్మేవాళ్లుంటే చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెబుతాడని జగన్‌ దుయ్యబట్టారు. ఏదీ ఏమైనా  హోదా సాధనలో భాగంగా వైయస్‌ జగన్‌ ప్రవాసాంధ్రుల మద్దతు కూడగట్టడం ఉద్యమానికి మరింత తోడ్పాటునందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియాలో ఎన్‌ఆర్‌ఐలతో వైయస్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వైరల్‌గా మారింది. జగన్‌ వ్యాఖ్యలపైనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 


 
Back to Top