వైఎస్ జగన్ ఫైటర్..చంద్రబాబు

చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయింది..!
పవన్ కళ్యాణ్ నీవు పవర్ స్టారా లేక కవర్ స్టార్ వా...!

గుంటూరుః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ పోరాటాలు చూసి చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందని రోజా ఫైరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కవాగ్ధానం నెరవేర్చని చంద్రబాబు  ఏపీ మంత్రా లేక గజినీ మంత్రా అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా సంజీవని కాదు, స్వర్గం కాదు అసలు హోదానే వేస్ట్ అనే దౌర్భాగ్యపరిస్థితికి తెచ్చాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.జగన్ ఫైటర్ అయితే చంద్రబాబు చీటరని రోజా స్పష్టం చేశారు . ఆరేళ్ల నుంచి 60 ఏళ్లవరకు ప్రతిగుండె ఒకే మాట, ఒకే బాటలో వెళుతుందన్నారు. ఆమాట ప్రత్యేకహోదా..ఆబాట జగన్ అన్న బాటని చెప్పారు. ప్రత్యేకహోదాపై వైఎస్ జగన్ చర్చకు సిద్ధం మీరు సిద్ధమా చంద్రబాబు అని రోజా సవాల్ విసిరారు. చంద్రబాబు ప్యాకేజీతో మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పవర్ స్టార్ వా లేక కవర్ స్టార్ వా..!
ప్రశ్నించడానికే తమ పార్టీ పుట్టిందన్న పవన్ కళ్యాణ్ పవర్ స్టారా లేక కవర్ స్టారా అని రోజా విమర్శించారు. కరెన్సీ కవర్లు మీకళ్లను కప్పేశాయా..? మీనోటిని కుట్టేశాయా..? అని నిలదీశారు. చంద్రబాబు  ఓటుకు కోట్లు కేసు కోసం ప్రత్యేకహోదాను తాకట్టుపెడితే, పవన్ కళ్యాణ్  ప్యాకేజీకోసం జనసేనను తాకట్టుపెట్టాడని దుయ్యబట్టారు. సింహం సింహం కడుపునే పుడుతుందని జగన్ గురించి చెప్పారు. రాయలసీమ వేడిని,ఉత్తరాంధ్ర ఉద్యమస్ఫూర్తిని , కోనసీమ సంకల్ప సిద్ధిని ఢిల్లీకి వినిపిస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలంతా అండగా నిలవాలని రోజా పిలుపునిచ్చారు. తెలుగుదేశం కళ్లబొల్లి మాటలు వింటే తీవ్ర అన్యాయానికి గురవుతామన్నారు. 

5కోట్ల గుండెల్లో స్ఫూర్తి..!
వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష 5కోట్ల ప్రజల గుండెల్లో స్ఫూర్తినింపిందని రోజా అన్నారు. శ్రీకాకుళం జిల్లా శివంగిలా ప్రత్యేహోదా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లా విప్లవ జ్యోతిలా భగభగమండుతోంది. విశాఖ జిల్లా అల్లూరి స్ఫూర్తితో విల్లు ఎక్కుపెట్టి హోదాకోసం ఉద్యమిస్తోంది. ప్రత్యేకహోదా కోసం గోదావరి జిల్లా ప్రజల  గుండెలు ఎలా ఘోషిస్తున్నాయో చూశాం. కృష్ణమ్మ సాక్షిగా కష్టాన్ని కళ్లారా చూస్తున్న జిల్లా ప్రజలు హోదా కోసం కంకణం కట్టుకొని పోరాడుతున్నారు. నిలువెత్తు గుండెధైర్యానికి చిహ్నమైన జగన్ ను గుంటూరు ప్రజలు గుండెలో పెట్టుకొని చంద్రబాబుపై మండిపోతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్తలు హోదా కోసం కాలు దువ్వుతున్నారని రోజా అన్నారు. 

నాటి అమరజీవి సాక్షిగా..!
ఇక నెల్లూరు జిల్లా వాసులు ఆనాడు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎలా అండగా నిలిచారో ..నేడు హోదా కోసం వైఎస్ జగన్ దీక్షకు ప్రజలంతా తోడుగా నిలుస్తున్నారని రోజా తెలిపారు. ఆకలికేకలతో అలమటిస్తున్న అనంతవాసులు హోదాకోసం పోరాడుతున్నారు. చంద్రబాబు పాలనలో చిన్నాభిన్నమైన చిత్తూరు వాసులు చింతనిప్పులు వెదజల్లుతున్నారు. కడుపు మండిన కడపవాసులు హోదా కోసం జగన్ కు బాసటగా నిలుస్తున్నారు. మల్లన్న సాక్షిగా కర్నూలు వాసులు మడమ తిప్పకుండా హోదా కోసం ఉద్యమిస్తున్నారని రోజా వైఎస్ జగన్ కు మద్దతుగా నిలుస్తున్నఅన్ని జిల్లాల ప్రజల పోరాటపటిమను తెలియజేశారు. 
Back to Top