కార్పొరేట్ సంస్థల కోసమే రాజధానిబాబు పాలన అంతా మోసం.. మోసం.. ఈ నెల 29 నాటి బంద్ కు అంతా సహకరించాలి
విజయవాడ: కార్పొరేట్ సంస్థల కోసం రాజధానిని నిర్మించాలన్న దుర్భుద్దితో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. అందుకే ప్రజల రాజధానిని పక్కన పెట్టేసి, ప్రజల కన్నీటితో రాజధానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రైతులు ఒప్పుకొన్నా, ఒప్పుకోక పోయినా అధికారం ఉంది కదా అని, మదం ఎక్కిన మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని జగన్ వివరించారు. బలవంతపు భూ సేకరణ కు వ్యతిరేకంగా విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర జరిగిన ధర్నాలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు.
బలవంతంగా లాక్కొనే యత్నాలునేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా చంద్రబాబు కట్టుకథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పంటలు పండే భూములు రెండు వేల ఎకరాలు మాత్రమే, మిగిలినదంతా మామూలు భూములే అంటూ కౌంటర్ ఫైల్ చేశారు. సాక్షాత్తూ ప్రభుత్వమే అబద్దాలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. పంట భూముల్ని లాక్కోవటం అన్యాయం అంటూ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు బీజేపీ మీద పోరాటం చేస్తున్నాయి. బీజేపీ కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. ఇది అక్టోబర్ రెండో తేదీ లోపు వీగిపోయే ప్రమాదం ఉంది. ఈలోగానే తొందర తొందరగా భూములు లాక్కోవాలని ప్రభుత్వం బావిస్తోంది.
ఇది మోసాల ప్రభుత్వంచంద్రబాబు ప్రభుత్వం మొత్తంగా మోసాల మీద నడుస్తోంది. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, నిరుద్యోగ భృతి... ఇలా అన్నింటా మోసాలే. ప్రభుత్వమే మోసాలు చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలి. అధికారం ఎల్లకాలం చంద్రబాబు దగ్గరే ఉండదు. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ భూములను పూలల్లో పెట్టి వెనక్కి ఇచ్చేస్తాం.
బంద్ కు కలిసిరండిప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఇప్పుడు మభ్య పెడుతున్నారు. ఈ హోదాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా ఎందుకు, ప్యాకేజీ వస్తే సరిపోతుంది అని చెబుతున్నారు. ఓటుకి కోట్లు కేసునుంచి తప్పించుకొనేందుకే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. అందుకే ఈనెల 29 న బంద్ పాటిస్తున్నాం. ప్రజలంతా ముందుకు వచ్చి ఈ బంద్ ను విజయవంతం చేయాలి.