సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అభినందన ట్వీట్లుప్రత్యేకహోదా ఆకాంక్ష.. ఆకట్టుకున్న సెల్ఫీ వీడియోలు
హైదరాబాద్: ‘యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి... అది మనకు ఉంది. ప్రత్యేకహోదా విషయంలో జగన్ పోరాటానికి మద్దతు పలుకుదాం. స్పెషల్ స్టేటస్ ఈజ్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇట్స్ అవర్ రైట్...’ అంటూ ట్వీట్లతో, ఫేస్‌బుక్ పోస్టులతో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నెటిజన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా డిమాండ్‌తో గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ సబ్జెక్ట్ అయ్యింది.
ప్రత్యేకించి ఫేస్‌బుక్‌లో బుధవారం నుంచి #indefinitefast అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ సబ్జెక్ట్‌గా నడుస్తోంది. #ysjagan #hungerstrike #apspecialstatus అనే ట్యాగ్‌లతో కూడా పోస్టులు వెల్లువెత్తాయి. జగన్‌కు మద్దతుగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా డిమాండ్‌తో ఈ ట్యాగులతో పోస్టులు, ట్వీట్లు ప్రచురితం అయ్యాయి.
నిరాహారదీక్ష ప్రారంభానికి ముందు నుంచే యువతీయువకులు జగన్‌కు మద్దతుగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో పోస్టులు ప్రచురించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరిస్తూ దాని సాధన కోసం జగన్ సాగిస్తున్న అన్ని పోరాటాలకూ తమ సంపూర్ణమద్దతు ఉంటుందని వాటి ద్వారా ప్రకటించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఈ సమయంలో జగన్ పోరాట దృక్పథం అభినందనీయమని, అది తమకు కూడా స్ఫూర్తి పంచుతోందని వారు అభిప్రాయపడ్డారు.