విద్యుత్ లెక్కలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

హైదరాబాద్: రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలపై ఆయన స్పందిస్తూ.. తాను చెప్పినట్టుగానే చరిత్ర పునరావృతమవుతోందని, చంద్రబాబు మార్కు పాలన మళ్లీ మొదలైందని దుయ్యబట్టారు. ఇప్పటికే తీవ్ర కరువు, పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారం మోపడం అన్యాయమని అన్నారు.

ఈ చార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాటి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎలాంటి చేదు అనుభవాలు చవిచూశామో.. పదేళ్ల తర్వాత ఇప్పుడూ అలాంటివే పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే పెట్రోలుపై 31 శాతంగా ఉన్న వ్యాట్‌కు అదనంగా లీటరుపై రూ.4,  డీజిల్‌పై 22.25 శాతంగా ఉన్న వ్యాట్‌కు అదనంగా లీటరుపై రూ.4 వడ్డించారు. ఈ బడ్జెట్ తర్వాత విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచుతారేమోనని అందరూ భయపడుతున్నారు.. అని శుక్రవారం మీడియా సమావేశంలో అన్నాను.

నేను ఈ  మాటలు అన్న మూడు రోజులకే చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచేసింది’ అని జగన్ విమర్శించారు. ఇక నష్టాలను సాకుగా చూపి.. ఆర్టీసీ చార్జీలు కూడా వడ్డించి ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందన్నారు. ‘ఇప్పటికే చార్జీలు పెంచేవారని అయితే, ఆర్టీసీ విభజన పూర్తికానందునే బాబు విధిలేక ఆగి ఉన్నారని ఉద్యోగులు అంటున్నారు’ అని జగన్ గుర్తు చేశారు.

ఇప్పటికే ఇసుక ధరలు ఆకాశాన్నంటి ప్రజలు గూడు కట్టుకోవడం కష్టంగా ఉందని, ప్రభుత్వం పూర్తిగా పేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని పక్కన పెట్టిందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు అన్ని విధాలా అందరినీ ఆదుకుంటామని, పన్నులు వేయబోమని, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నెన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తర్వాత అన్ని వర్గాల వారినీ మోసగించారని జగన్ విమర్శించారు.
Back to Top