ప్రజాక్షేత్రమే అతని అసెంబ్లీ

-పాదయాత్ర వేదికగా ప్రతిపక్షనేత సవాల్
-ఎప్పటిలాగే దుష్ప్రచారం మొదలుపెట్టిన సర్కారు
-ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు ఇరికించే కుట్ర
-వంతపాడిన తోక మీడియా
-ప్రజా క్షేత్రమే అసెంబ్లీగా తిప్పి కొట్టిన యువనేత

ఫిరాయింపుదారులతో ప్రభుత్వాన్ని నడపడాన్ని నిరసిస్తూ, వారి రాజీనామాలను ఆమోదించకుండా తాత్సారం చేస్తున్న స్పీకర్ తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది ప్రతిపక్షం. బాబు నయవంచక పాలనకు ప్రజలతో కలిసి చరమగీతం పాడాలని నిశ్చయించుకున్న ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేసిన ఎల్లో గ్యాంగ్ సర్కారు అది సాధ్యం కాకపోయేసరికి బురదజల్లడానికి దారులు వెతుక్కుంటోంది. మొదటిరెండు రోజల పాదయాత్రలో ప్రజావెల్లువను చూసి బెంబేలెత్తిపోయిన బాబు అండ్ కో… ఎప్పటిలాగే వైయస్ జగన్ పై ఆరోపణల దాడికి సిద్ధమైపోయారు. ఏ వంకా లేనివాడు డొంకట్టుకుని వేలాడినట్టు, ఈసారి జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడానికి ప్యారడైజ్ పత్రాల పాట ఎత్తుకున్నారు. ఏ సంబంధం లేకపోయినా నీచంగా దిగజారిపోయి కథలల్లి తమ తోక మీడియాతో పతాక శీర్షికన వార్తల వంటకాలు చేయించారు. జనం మధ్య, జనంకోసం, జనంచేత జేజేలు అందుకుంటున్న ఒక యువ నాయకుడి ప్రస్థానాన్ని చూసి తట్టుకోలేక, ప్రజల మధ్య ఆయన్ను ఎదుర్కోలేక ఎప్పటిలాగే అసత్యాల ప్రచారానికి, కుట్రల పర్వానికి తెరలేపారు. 

 అసెంబ్లీ సమావేశాలను కూడా బహిష్కరించి జనం మధ్య నడుస్తున్న జగన్, ఆ ప్రజావెల్లువే అసెంబ్లీగా బాబు కుయుక్తులపై సవాల్ విసిరారు. ఎల్లో గ్యాంగ్ ఆరోపిస్తున్నట్టుగా విదేశాల్లో తనకు ఒక్క రూపాయి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని… అలా చేయలేని పక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని జగన్ ఛాలెంజ్ చేశారు. దానికి 15 రోజుల గడువు కూడా నిర్థేశించారు ప్రతిపక్షనేత. టిడిపి అసత్య ప్రచారాలు, ఆరోపణలపైనే కాదు, ప్రజా సమస్యలపైనా, సర్కారు మోసాలపైన కూడా జగన్ తన పాదయాత్రలో ధ్వజమెత్తుతున్నారు. అన్నివర్గాల ప్రజలను కలుస్తూ, వారి బాధలు వింటూ, సమస్యలు తెలుసుకుంటూ, అవసరాలను గుర్తిస్తూ, వారికి జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని అప్పటికప్పుడే ప్రశ్నిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఇదంతా చూస్తున్న అభిమాన ప్రజానీకం తమ నాయకుడు అసెంబ్లీలో చేయాల్సిన పని ప్రజలమధ్యనుంచే చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజాక్షేత్రమే వైయస్ జగన్ అసెంబ్లీ అంటున్నారు.

Back to Top