చెరువుల్లో పచ్చదొంగలు

*గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల ఇష్టారాజ్యం
*నీరు–చెట్టు పేరుతో చెరువుల్లో మట్టిని అమ్ముకుంటున్న పచ్చ తమ్ముళ్లు
*ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు

గుంటూరు(చెరుకుపల్లి): చెరువులు గ్రామాలకు కల్పతరువులు..ఇవి నిండుగా ఉంటేనే పంటలు పండేవి. పల్లెలు పచ్చగా ఉండేవి. అలాంటి చెరువులపై ఇప్పుడు పచ్చ నేతల కన్ను పడింది. నీరు– చెట్టు పథకం పేరుతో దోపిడీకి అధికార పార్టీ నేతలు తెర లేపారు. చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ మట్టిని అమ్ముకుంటూ చెరువులకు నష్టం కలిగిస్తున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అక్రమాలు మితిమీరిపోయాయి. వేసవి సమీపించడంతో అధికార పార్టీ నాయకుల కళ్లు ఎండిపోతున్న చెరువుల మీద పడుతున్నాయి. రెండు సంవత్సరాల నుంచి చెరుకుపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో ఎండిన చెరువుల్లోని మట్టిని నీరు–చెట్టు పేరుతో తవ్వుకొని టీడీపీ నాయకులు లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని కొలగొడుతున్నారు. ఇదే క్రమంలో మరికొంత మంది ద్వితీయశ్రేణి నాయకులు కూడా  చెరువులు పూడిక తీసే సమయంలో వారికి కూడా భాగస్వామ్యం కావాలని ముందుగానే ఎండితున్న చెరువుల్లో ఈ సంవత్సరం మట్టి తీసే అవకాశం మాకే వస్తుందని భావించి ఆయా గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని అమ్ముకునేందుకు ఇప్పటి నుంచే బేరసారాలు మొదలుపెట్టారు.  

భారీ వర్షంతో ఆగిపోయిన పూడికతీత: 
గతేడాది మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు మట్టిని అమ్ముకునేందుకు సర్వం సిద్ధం చేసి మిషన్‌ను అందుబాటులో పెట్టి చెరువుల్లో పూడికతీతను తీయడానికి పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. అయితే రాత్రికి ్రరాతి అతిభారీ కుంభవృష్టి పడటంతో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో పూడికతీత పనులు ఆగిపోయాయి.  

పచ్చ నేతల పైరవీలు:
ఈ ఏడాది ఎలాగైనా చెరువుల్లో పూడికతీత పనులు తమ వర్గానికే అప్పజెప్పాలని స్థానిక శాసన సభ్యుల వద్ద టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు సిఫార్సులు చేయిస్తున్నారు. పన్నులు దక్కించుకునేందుకు అధికారపార్టీ నాయకులు బాహాటంగానే ప్రయత్నించడం గమనార్హం. 
 
చేపల పెంపకాన్ని నిషేధించారు:
ఈ సంవత్సరం మట్టి తవ్వకానికి కనీసం చేపల పెంపకం కూడా చేపట్టలేదు. గ్రామ పంచాయతీలకు ఆదాయం తెచ్చే కొన్ని చెరువుల్లో ఈ సంవత్సరం చెరువులు పూడికతీత తీయడానికి చేపలు కూడా వేయకుండా చెరువులను పూర్తిగా నిషేదించారు. ఒక్క సంవత్సరంలో చేప పిల్లలు సక్రమంగా పెరుగుతాయో లేదో... చెరువు పాడుకునే వారు మట్టి తవ్వకాలకు ఒప్పుకుంటారో లేదో?అన్న దురాలోచనతో కనీసం పాటలు కూడా నిర్వహించలేదు. చేపలు పెంపకం నిలిచిపోవడంతో మత్స్యకారులకు ఉపాధి కరువైంది.  
Back to Top