ఇసు"కాసు"రులు

  • ఇసుకను కొల్లగొడుతున్న పచ్చ నేతలు
  • విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా
  • అధికార పార్టీ నేతలతో అధికారులు, పోలీసుల కుమ్మక్కు
  • అడుగంటిన భూగర్భజలాలు..సాగు,తాగునీటికి కటకట
  • ప్రజల ప్రాణాలతో పచ్చమాఫియా చెలగాటం
రాష్ట్రంలో ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలే ఇసుకాసురల అవతారం ఎత్తి సర్వం భక్షిస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా సరిహద్దులు దాటిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.  ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇసుక దోపిడీ కారణంగా  భూగర్భజలాలు ఎండిపోయి సాగు, తాగునీరు అందక అవస్థలు పడుతున్న ప్రజానీకానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వారి ప్రాణాలతో చెలగాటమాడడం బాధాకరం. ఇసుక మాఫియాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్ వాల్వ్ అయ్యి ఉన్నారని సాక్షాత్తు చంద్రబాబు గెజిట్ పత్రికలో వెలువడిన వార్త అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయినా ఇంతవరకు ఎవరిపై చర్యలు లేవు. ఆనాడే వారిపై చర్యలు తీసుకొని ఉంటే   ఏర్పేడులో ఇంతమంది బలయ్యేవారు కాదన్నది వాస్తవం. అధికారులు, పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై యథేశ్చగా ఇసుక దందా సాగిస్తుండడంతో బాధిత గ్రామాల ప్రజలు గోడు వినే నాథుడే కరువయ్యాడు.  ఇసుక మాఫియా అంతా చినబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని, తమ్ముళ్లు దగ్గర వాటాల లెక్కన ముడుపులు పుచ్చుకొని అవినీతికి ఉసిగొల్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాదంలో 17మంది  ప్రజల మరణానికి ముమ్మాటికి ప్రభుత్వమే కారణం. మూడేళ్లుగా స్వర్ణముఖినదిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ నేతలు ధనుంజయలనాయుడు, చిరంజీవినాయుడులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కేసులు నమోదు చేయకపోవడం, మునగలపాలెం రైతులు ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు తహశీల్దార్‌ లేకపోవడం, పోలీస్‌స్టేషన్‌ గేట్లు మూసి రైతులను రోడ్డు మీద నిలబెట్టడం, ఆ తరువాత లారీ వచ్చి గుద్దేసి పోవడం చూస్తే.. దీని వెనుక పెద్ద కుట్ర కోణమే ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యారు. ఇటీవల వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఏర్పాడు ప్రాంతానికి వెళ్లి స్వయంగా బాధిత కుటుంబాలను పరామర్శించి ఆకుటుంబాల గాథను చూసి చలించిపోయారు. బాధిత కుటుంబాలు, బంధువులు కన్నీటితో ఇవే సందేహాలను వ్యక్తం చేశారు. 

ఒకవైపు బోర్లలో నీరులేదు. స్వర్ణముఖి నదిలో 30 అడుగులు, 40 అడుగులు విచ్చలవిడిగా తవ్వేయడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. దిక్కుతోచని పరిస్థితిలో రైతులు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పరిస్థితుల్లో ఏర్పేడు దారుణం జరిగింది. కోట్లాది రూపాయలు గడించేందుకు మంత్రుల కింత, ఎమ్మెల్యేలకింత, ముఖ్యమంత్రి కొడుకుకింతని కమీషన్లు దండుకునేందుకు ప్రభుత్వం ఫ్రీ ఇసుక దోపిడీకి తెరలేపింది. అధికార పార్టీ నేతలు ఎంతలా బరితెగించారంటే.... తమ ఇసుక దందాకు అడ్డొచ్చిన వారిని అన్యాయంగా ఇసుకలో పడేసి కొట్టడం మొదలు వారిని హతమార్చే వరకు వెళ్ళారు. తన ఇసుక మాఫియాకు అడ్డొచ్చిందని ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన రోజే.....ఆయనపై చర్యలు తీసుకొని ఉంటే ఏర్పేడులో ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కావు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న టీడీపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. 
Back to Top