కారు కూతలు – కాకి రాతలు

-వైయస్సార్ సిపి గెలిస్తే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయంటూ ప్రచారం 
-నంద్యాల గొడవకు కారణం శిల్పా వర్గీయులే అని అసత్య ఆరోపణలు
-కళ్లముందే టిడిపి వర్గీయుడైన రౌడీ షీటర్ గూండాయిజాన్ని కూడా ఆత్మరక్షణ అంటూ గుడ్డి కబుర్లు
- అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నిస్తే అరాచకవాదులంటున్న టిడిపి నేతలు

కాకినాడ ఎన్నికల ప్రచారానికి గుంపుగా వచ్చి చేరిన టిడిపి నేతలంతా ముక్తకంఠంతో ఒకే పాట పాడుతున్నారు. తమ అభివృధి గురించి చెప్పుకోడానికేం లేదు కనుక, ప్రశ్నించే ప్రతిపక్షాన్ని తప్పుపడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. కాకినాడ వివిధ వార్డుల్లో పర్యటిస్తున్న టిడిపి నేతలందరి నాలుకపై జగన్ నామస్మరణ తప్ప మరోటి వినిపించడంలేదు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో జగన్ అన్న మాటలను తలుచుకుని తలుచుకుని మరీ వాపోతున్నారీ తెలుగు తమ్ముళ్లు. 

జగన్ నంద్యాలలో చేసిన చొక్కా నిక్కర్ కామెంట్ పై టిడిపి నేతలు కౌంటర్ ఇవ్వలేక కల్లబొల్లి ఏడుపులతో కాకినాడలో ఇంటింటికీ తిరుగుతున్నారు. జగన్ అలా అన్నాడు, ఇలా అన్నాడు అంటూ అనుక్షణం ప్రతిపక్ష నేత పేరునే కాకినాడలో మారుమోగిస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి  జగన్ రాకకు ముందే తెలుగు తమ్ముళ్లు ప్రతిపక్ష నేత పేరును ప్రోమోగా ప్రచారం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. 

వైయస్సార్ సిపి గెలిస్తే అసాంఘిక కార్యకలాపాలంటూ పచ్చపార్టీకి భజన చేసే పచ్చ పత్రికలు తెగ ఊదర గొడుతున్నాయి. అయితే ఆ పార్టీ ఛోటా నేత అభిరుచి మధు నంద్యాల్లో కత్తి పట్టుకుని వీరంగం వేయడాన్ని అసాంఘిక కార్యకలాపంగా అనకూడదేమో అనుకుంటున్నారు కొందరు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆయుధాలను ఉంచుకోవడంతోపాటు, పోలీసుల ముందే కాల్పులు జరపడం కూడా సాంఘీక కార్యక్రమంలో భాగమేమో అని కూడా విమర్శిస్తున్నారు. దాడి చేసిన సొంత పార్టీ రౌడీమూకను వదిలేసి, దాడులు జరిగిన వారిమీద కేసులు రాయించిన అధికార ప్రభుత్వానిది అచ్చమైన అసాంఘిక కార్యక్రమమే అని కూడా ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. వీడియోల్లో ఎంతో స్పష్టంగా కనిపిస్తున్న రౌడీషీటర్ అభిరుచి మధు దాడిని ఆత్మరక్షణ చర్య అంటూ ఈనాడు రాసిన కథనం చూసి తెలుగు ప్రజలందరూ ముక్కున వేలేసుకున్నారు. బరితెగింపు తెలుసుకాని మరీ ఇంత పచ్చిగా, పచ్చగా, ప్రజలందరూ చూస్తున్న నిజాన్నే అబద్ధంగా మార్చి రాయగలగడం ఒక్క ఎల్లోయిజానికే సాధ్యమని పాఠకులు చర్చించుకున్నారు. 

ఇక అక్కడ పోలీసుల గులాంగిరీ చూసిన ప్రజలు అధికార పార్టీకి కొమ్ముకాసే ఆ శాఖ పనితీరుపై మండిపడ్డారు. ఆయుధాలతో నడి రోడ్డుమీద అరాచకం చేస్తున్న రౌడీషీటర్ ను బతిమాలి బుజ్జగించి, కారులో కూర్చోబెట్టి పంపించిన వైనం చూస్తే, టిడిపి ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగం అంతా సలాం కొడుతోందని అర్థం అవుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పినట్టే పోలీసులు నడుచుకుంటున్నారని వైయస్సార్ సిపి ఎన్నోసార్లు ఆరోపించింది. కాని అలాంటిదేం లేదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ అధికారులు కల్లబొల్లి మాటలు చెప్పారు. పోలీసుల నిర్లక్ష్యం, రౌడీషీటర్ల పట్ల వారి ఉదాసీన వైఖరీ వీడియోలో చూసి కూడా ఉన్నతాధికారులు, ఆ పోలీసుల విషయంలో ఎలాంటి చర్యా తీసుకోకలేదు.  ఇదంతా చూస్తే చంద్రబాబు ఈ శాఖను ఎలా తన గుప్పెట్లో ఉంచుకుని అధికార దుర్వినయోగం చేస్తున్నారో ప్రత్యక్షంగా అర్థం అవుతుంది. తెలుగు తమ్ముళ్లకు నంద్యాల సీను పూర్తిగా అర్థం అయిపోయింది. గెలుపు వైయస్సార్సిపిదే అని ఖచ్చితంగా తెల్సిపోయింది. దాంతో రూటు మార్చి, నంద్యాల ఎన్నికల ఫలితాలపై పందాలు బెట్టింగులంటూ కొత్త కథలు చెప్పడం మొదలు పెట్టారు. కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కాస్తా నంద్యాల ఉప ఎన్నికల హరికథతోనే నడుస్తోందని పరిహాసం చేస్తున్నారు కాకినాడ వార్డు ప్రజానీకం. 




Back to Top