పోరంబోకు భూముల్లో పచ్చనేతల పాగా

  • యథేచ్చగా పెన్నా పోరంబోకు భూముల ఆక్రమణ
  • వేలాది ఎకరాల్లో వేరుశెనగ పైరు సాగు
  • చోద్యం చూస్తున్న అధికారులు
 నెల్లూరు(ఆత్మకూరు): తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు ఆ పార్టీ నేతలు అక్రమాలకు తెరలేపారు. అసైన్డు, పోరంబోకు భూములపై పచ్చ నేతల కన్ను పడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం నాయకులు దర్జాగా పోరంబోకు భూములు ఆక్రమించుకొని సాగు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆక్రమిత భూములకు విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం విశేషం. వివరాల్లోకెళితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అనంతసాగరం, ఆత్మకూరు, సంగం మండలాల మీదుగా పెన్నానది తీరంలో వేలాది ఎకరాలను ఆక్రమించి సాగు చేస్తున్నారు. సంగం మండలం దువ్వూరు, జెండాదిబ్బ, వీర్లగుడిపాడు, కోలగట్ల గ్రామాల మొదలు ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం, కనుపూరుపల్లి, అనంతసాగరం మండలం దేవరాయపల్లి, పడమటికంభంపాడు, సోమశిల గ్రామాల పరిధిలో పెన్నా తీరం వెంబడి వేలాది ఎకరాలను ఆక్రమించి వేరుశెనగ సాగు దర్జాగా సాగిస్తున్నారు. ఆ గ్రామాల పరిధిలో పెన్నా తీరంలో పలువురు రైతులు పట్టాభూముల్లో మామిడి, వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. వారికి ఆశలు చూపి కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం రామతీర్థం గ్రామాలకు చెందిన పలువురు బడా భూస్వాములు ఈ ఆక్రమణలకు తెరతీశారు. మూడు సంవత్సరాల పాటు వేరుశెనగ, నువ్వు తదితర పంటలు సాగు చేసి అనంతరం భూములను తీరం వెంబడి పట్టా భూమి కలిగిన రైతులకు వదిలి వెళ్లేలా ఒప్పందం జరిగినట్లు స్థానికులు పలువురు తెలిపారు. దీంతో తీరం వెంబడి ఆక్రమణలకు అడ్డే లేని పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు, చేజర్ల మండలాలను అనుసంధానం చేసే పెన్నా బ్రిడ్జికి ఇరువైపులా తీరం వెంబడి ఆ ఆక్రమణలు జోరందుకున్నాయి. 

వినూత్నంగా నీటి సరఫరా :
కాగా ఆక్రమిత భూములలో సాగులో ఉన్న పైర్లకు పెన్నా నదిలో బోర్లు వేసి స్ప్రింక్లర్ల ద్వారా సాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ స్ప్రీంక్లర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అందచేసే సబ్సిడీ సైతం పొందడం గమనార్హం. వ్యవసాయ, ఉద్యానవనశాఖలు పైర్ల సాగు కోసం స్ప్రింక్లర్లు సబ్సిడీ ధరల్లో అందచేస్తుండడంతో వాటిని తమకు అనుకూలంగా మలుచుకుని ఆక్రమణదారులు దర్జాగా నీటి సరఫరాకు ఉపయోగించుకుంటున్నారు. 

గతంలో తొలగింపు : 
గత మూడు నెలల క్రితం పెన్నా పోరంబోకు భూములను ఆక్రమించి పైర్లు సాగు చేస్తున్న వారిని ఆత్మకూరు రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించారు. ఏర్పాటు చేసిన మోటార్లను తొలగించారు. అయితే తిరిగి ఆక్రమణదారులు నాయకుల అండదండలతో గత 20 రోజుల నుండి ఆక్రమణలకు పూనుకుని యధేచ్చగా పైర్లు సాగు చేస్తున్నారు. 

తెలుగు తమ్ముళ్ల అండతోనే... :
కాగా మూడు నెలల క్రితం అప్పారావుపాళెం పడమటికంభంపాడు గ్రామాల పరిధిలో ఆక్రమణలను అధికారులు తొలగించినా తిరిగి స్థానిక తెలుగు నేతల ప్రమేయంతో తీరం వెంబడి మళ్లీ ఆక్రమణలు జోరందుకున్నాయంటే అధికార పార్టీ నేతల ధిక్కారంగా అర్థం చేసుకోవచ్చు.

కోర్టు ఆదేశాలు బేఖాతర్‌:
నదితీరాలు, చెరువులు ఆక్రమణకు గురై ఉంటే  తొలగించాలని ఈ విషయంలో ఉపేక్షించరాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి ఉన్నా అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులకు పని సులువుగా ఉంది. సంబంధిత ఆక్రమితదారులను ఇక్కడ ఆక్రమణలు చేయడం సరికాదని ప్రశ్నిస్తే అందరికి ముడుపులు ఇచ్చామని, తమ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు తమకు మద్దతుగా ఉన్నారని సమాధానం చెబుతున్నారంటే పరిస్థితి ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
Back to Top