చంద్ర‌బాబుది అరాచ‌కాల పుట్ట‌


హైటెక్ ప్ర‌భుత్వం అని గొప్ప‌లు చెప్పుకోవ‌టానికి చంద్ర‌బాబు రైతుల జీవితాల్ని ప‌ణంగా పెడుతున్నారు. వెబ్ ల్యాండ్ పేరిట రూపొందిస్తున్న కంప్యూట‌ర్ రికార్డుల ప‌ర్వం.. అరాచ‌కాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తోంది. 

రైతుల గగ్గోలు 
  రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లలోని భూములు ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. ఆన్‌లైన్‌లో నమోదైన చాలా ఆస్తులను తహసీల్దార్లు ధ్రువీకరించ లేదు. రైతులకు వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణానికి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాలకు పొంతన కనిపించడం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే వారి భూములు వెబ్‌ల్యాండ్‌లో లేవంటూ బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారు. తమ భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరుతున్న రైతులను రెవెన్యూ సిబ్బంది, దళారులు పీడిస్తున్నారు. డబ్బు ముట్టచెబితేనే వారి భూములను నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం నిత్యం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి.
 
ద‌గాకోరు లావాదేవీలు
భూముల అమ్మ‌కాల్లో కంప్యూట‌ర్ రికార్డుల పేరిట ముంచేస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు, రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్‌లైన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, పకడ్బందీగా పూర్తి చేసి, అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ ఆధారిత లావాదేవీలకు ఆమోదం తెలిపితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు.  

అవినీతికి ఊతం
రైతుల్లో చాలా మంది నిర‌క్ష‌రాస్యులు, పెద్ద‌గా చ‌దువుకోని వారు కావ‌టం సిబ్బందికి క‌లిసి వ‌స్తోంది. దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుండడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంగా సంక్రమించిన పొలాలూ సర్కారు భూముల ఖాతాలో కనిపిస్తున్నాయి. భూ పంపిణీ కింద ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వేరే వారి పేర్లతో ఉండటంతో వాస్తవ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  దీన్ని త‌మ పేరిట మార్పించుకొనేందుకు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకోవాల్సి వ‌స్తోంది. ఆన్ లైన్ లో భూముల నమోదుకు వాటి విలువ, యజమానుల ఆర్థిక పరిస్థితి, వారి అవసరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు, దళారులు రేట్లు ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదుకు భూమి విలువ, ఇతర అంశాల ఆధారంగా రూ.10 వేల నుంచి 60 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు.  
 
అరాచ‌కాల‌కు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు
() కర్నూలు జిల్లా వెల్దుర్తిలో సర్వే నంబరు 831లో చింతకాయల రామాంజనమ్మకు 2.60 ఎకరాల భూమి వారసత్వంగా వ‌చ్చింది. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. రెండు నెలల క్రితం వెబ్‌ల్యాండ్‌లో ఈ భూమి యజమానిగా రామాంజ‌న‌మ్మ పేరుకు బదులు మరో వ్యక్తి పేరు వ‌చ్చిది. 
() శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన గుంటబోయిన వెంకటరమణకు ఐదెకరాలకు పైగా సాగు భూమి ఉంది. వెబ్ అడంగల్‌లో మాత్రం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదైంది. దీంతో ఈయన మ్యుటేషన్  కోసం మార్చి నెల లో మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా గోళ్లవలస గ్రామంలో 400 మంది రైతులకు చెందిన 2 వేల ఎకరాల భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. దీంతో పంట రుణాలకు నోచుకోకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు.  
Back to Top