చీప్ లిక్కర్ కోసం చీప్ అయిడియా

() డబ్బులు గుంజేందుకు చీప్ లిక్కర్ అమ్మకాలు

() అధికారికంగా చీప్ లిక్కర్ అమ్మాలని నిర్ణయం

() ఆరోగ్యం నిల్లు.. జేబులకు చిల్లు

హైదరాబాద్) ఇక రాష్ట్రంలో వీధివీధిలోనూ మందుబాబుల జేబుల్లో టెట్రా ప్యాకెట్లే
ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి. చీప్ లిక్క‌ర్ ఏరులై పార‌నుంది. అధికారంలోకి వ‌స్తే
బెల్టుషాపుల్ని ఎత్తివేస్తామ‌ని, మ‌ద్య‌నిషేదం ద‌శ‌ల‌వారిగా అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు హామీ
ఇచ్చారు. మ‌ద్యాన్ని ప్ర‌ధాని ఆదాయ వ‌న‌రుగా చూడ‌బోమ‌న్నారు. కానీ అధికారంలోకి వ‌చ్చాక
చేస్తున్న‌ది ఇందుకు పూర్తిగా భిన్నం. బెల్టుషాపుల్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు
సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌గానే చంద్ర‌బాబు సంత‌కం చేశారు. కానీ రాష్ట్రంలో ఎక్క‌డా
బెల్టుషాపులు ర‌ద్ద‌యిన దాఖ‌లాల్లేవు.

తాగండి..ఊగండి..అన్నదే ప్రభుత్వ విధానం..!

మ‌ద్యం ద్వారా భారీ ఎత్తున ఆదాయం పెంచుకునే మార్గాల‌ను స‌ర్కార్
అన్వేషిస్తోంది. టెట్రా ప్యాక్‌ల‌లో స‌ర‌ఫ‌రాకు నిర్ణ‌యం సరిహ‌ద్దుల్లో అక్ర‌మ మ‌ద్యం
అరిక‌ట్ట‌డానికేనంట‌... 180 ఎం.ఎల్‌. ప్యాక్ రూ. 45. టెట్రా అమ్మ‌కాల‌ను ప్రోత్సహించాలంటూ ఎక్పైజ్
అధికారుల‌కు టార్గెట్లు 20 శాతం చీప్ లిక్క‌ర్ ఉత్ప‌త్తి
చేయాల్సిందేనంటూ డిస్టిల‌రీల‌కు ఆదేశాలు మ‌ద్య నిషేదం ఊసే మ‌ర‌చింది.రాష్ట్ర‌వ్యాప్తంగా
40 వేల‌కు పైగా బెల్టుషాపులు అన‌ధికారికంగానే న‌డుస్తూనే
ఉన్నాయి. ఇక మ‌ద్య‌నిషేదం దిశ‌గా చర్య‌లు తీసుకోవ‌డం మాట అటుంచి మ‌ద్యం ద్వారా
భారీఎత్తున ఆదాయం పెంచుకోవ‌డంపై దృష్టి పెట్టారు. మ‌ద్యం అమ్మ‌కాల్ని భారీ ఎత్తున
పెంచారు. ఫ‌లితంగా మంచినీరు దొర‌క‌ని గ్రామాలున్నాయేమోగానీ మ‌ద్యం దొర‌క‌ని
గ్రామాలు లేవ‌నే ప‌రిస్థితి నెల‌కొంది.

ఆదాయం పెంచుకోవటమే లక్ష్యం..!

రాష్ట్రం విడిపోయే నాటికి 13 జిల్లాల్లో మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా రూ. 10,250 కోట్ల ఆదాయం ల‌భించ‌గా... ప్ర‌స్తుతమిది రూ.
12,647 కోట్ల‌కు చేరింది. ఇప్పుడిదీ చాల‌న్న‌ట్టుగా
రాష్ట్రంలోని ప్ర‌తి ప‌ల్లెలోనూ చీప్ లిక్క‌ర్‌ను ప‌ర‌వ‌ళ్లు తొక్కించేందుకు, త‌ద్వారా అద‌న‌పు ఆదాయం రూపేణా
రూ.వెయ్యికోట్ల‌ను జ‌నం జేబుల నుంచి లాగేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఐడియా
వేసింది. ఇందులో భాగంగా అందమైన టెట్రా ప్యాకెట్ల‌లో చీప్ లిక్కర్‌ను అందించేందుకు
రంగం సిద్ధం చేసింది. ఇందు కోసం చ‌ర్య‌లు చేప‌ట్టాలంటూ ఎక్సైజ్ శాఖ‌కు తాజాగా
ఆదేశాలు సైతం జారీ చేసింది.  

కుంటి సాకులు

ఖ‌జానాకు అద‌నంగా రూ. వెయ్యికోట్ల ఆదాయాన్ని ఎలాగైనా ఆర్జించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం
భావించింది. ఇందుకోసం చీప్ లిక్క‌ర్ స‌రైన మార్గంగా క‌నిపించింది. అంతే... అంద‌మైన
టెట్రా ప్యాక్‌ల‌లో చీప్ లిక్క‌ర్‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశాలిచ్చింది. కానీ ఎక్క‌డ
విమ‌ర్శ‌లు వ‌స్తాయోన‌నే భావ‌న‌తో రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ఇత‌ర రాష్ట్రాల నుంచి
దిగుమ‌తి చేసుకున్న ఎన్‌డీపీ(నాన్ డ్యూటీ పెయిడ్‌) మ‌ద్యం విక్ర‌యాలు జోరుగా
సాగుతున్నాయ‌ని,
వీటిని ఆరిక‌ట్టేందుకుగానూ
చీప్ లిక్క‌ర్ పొట్లాల‌ను తీసుకొస్తున్న‌ట్లు చెబుతోంది.  

 

మ‌ద్య‌నిషేదంపై చ‌ర్య‌లేవీ?

రాష్ట్రంలో మ‌ద్య‌నిషేదంపై ద‌శ‌ల‌వారిగా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం
పేర్కొంది. ఇందులో భాగంగా జిల్లాకో డీ అడిక్ష‌న్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని
చెప్పింది. అయితే రెండేళ్ల‌వుతున్నా... ఏ జిల్లాలోనూ డీ అడిక్ష‌న్ సెంట‌ర్ ఏర్పాటు
చేయ‌డం కానీ... మ‌ద్య‌పాన నియంత్ర‌ణ క‌మిటీనిగానీ ఏర్పాటు చేయ‌లేదు. మ‌ద్య‌నిషేదంపై
టీడీపీ ప్ర‌భుత్వానికున్న చిత్త‌శుద్ధికి ఇది నిద‌ర్శ‌నం. రాష్ట్రంలోని వివిధ
ప్రాంతాల్లో న‌కిలీ మ‌ద్యం తాగిన ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయినా ప్ర‌భుత్వానికి
ప‌ట్ట‌లేదు. విజ‌య‌వాడ‌లో న‌కిలీ మ‌ద్యం ఘ‌ట‌న వెలుగుచూడ‌డం తెలిసిందే. ఒక‌వైపు
బిహార్ వంటి రాష్ట్రాలు మ‌ద్య నిషేదం విధిస్తుంటే... రాష్ట్రంలో మాత్రం ప‌ల్లెల్లో
విచ్చ‌ల‌విడిగా మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వ‌మే ప్రోత్స‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
ఏపీలో మ‌ద్య నిషేదం అమ‌లు చేస్తే ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని సాక్షాత్తూ మంత్రి
కొల్లు ర‌వీంద్ర ఇటీవ‌లే విజ‌య‌వాడ‌లో మీడియాతో వ్యాఖ్యానించ‌డం ప‌రిశీల‌నాంశం.

Back to Top