అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. ఇవి తక్కువ కాలమే జరుగుతున్నప్పటికీ, అధికార పక్షానికి నెత్తి నిండా కావసినన్న తప్పులు ఉన్నాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా అక్రమాలు, ప్రత్యేక హోదా మీద కప్పదాట్లు వంటి అనేక ఘోరాలు, నేరాలతో చంద్రబాబు ప్రభుత్వం వర్ధిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తి కరంగా మారింది. బాధ్యత గల అధికార పక్షంగా సమస్యల్ని ఎదుర్కొంటారా అన్నది సందేహాస్పదమే. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నఘోరాలు సామాన్యమైనవి కానేకావు. కాల్ మనీ సెక్స్ రాకెట్, ఇసుక మాఫియా వంటి కేసుల్లో నిందితులంతా చంద్రబాబు సొంత మనుషులే. అటువంటప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇందులోకి లాగేందుకు కూడా చంద్రబాబు అండ్ కో తెగబడ వచ్చు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా చంద్రబాబు, ఆయన వీర విధేయులు ఎప్పటిలాగే చీప్ ట్రిక్ కు తెర దీయటం. దివంగత మహానేత వైఎస్సార్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేయటం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద వ్యక్తిగత దాడికి దిగటం. ఇందుకోసం కొందరు మంత్రులు కాచుకొని ఉంటారు. వీరంతా పాయింట్ లేనప్పుడల్లా మైక్ పుచ్చుకొని దూషణలకు దిగుతుంటారు. అసలు వ్యక్తిగత దూషణలు చేయకుండా, దివంగత మహానేత వైఎస్సార్ ను తలవకుండా అసెంబ్లీ సమావేశాలు నడపగలరా అన్న అనుమానం కూడా కలుగుతుంది. మరి, ఇప్పుడు కూడా అదే పనికి తెగబడతారా లేక హుందాగా విమర్శలకు జవాబిచ్చేందుకు సిద్ద పడతారా అన్నది చూడాలి.