అసెంబ్లీ అంటే వణుకెందుకో..?

– అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు 
    ముహూర్తం ప్రకటించని బాబు సర్కారు
– ఇప్పటికీ సిద్ధం కాని అసెంబ్లీ భవనం
– ఏపీలో నిర్వహించి తీరుతానన్న వాగ్ధానం హుళక్కేనా
– మళ్లీ మొక్కుబడి సమావేశాలతో సరిపెట్టాలని బాబు ఆలోచన
– వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేకే టీడీపీ వెనకడుగు 

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వణికిపోతున్నారు. అసలు ఆ మాటెత్తితేనే ఆయన గుండె జారిపోతుంది. ప్రజాక్షేత్రంలోనే ప్రతిపక్షాలు విసిరే సవాళ్లకు సమాధానం చెప్పలేక సతమతం అవుతుంటే ఇక అసెంబ్లీలో ఎదురెదురుగా కూర్చోబెట్టి నిలదీస్తే ఇంకేమైనా ఉందా.. వామ్మో చంద్రబాబుకు ఏసీలో కూడా చొక్కాలు తడిసి పోవాల్సిందే. ఏ వైపు నుంచి ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ విరుచుకుపడిపోతాడోనని ఆందోళన ఒకవైపు.. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతే జనాలు టీడీపీని, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును చవటల కింద లెక్క కట్టేస్తారని ఆందోళన మరోవైపు. వెరసి చంద్రబాబుకు అసెంబ్లీ పేరెత్తితేనే కళవర పడిపోతున్నారు.

అప్పుడలా.. ఇప్పుడిలా
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ప్రతిచిన్నదానికీ అఖిల పక్షం వేయాలని ఒకటే పోరు పెట్టడం అలవాటు. అసెంబ్లీని సంవత్సరానికి కనీసం 50 రోజులపాటైనా నిర్వహించాలని అప్పుడే ప్రజా సమస్యలు సభ దృష్టికి వచ్చి వారికి మేలు చేయడానికి వీలవుతుందని తోడేలు పాఠాలు చదివేవారు. ఉన్నదానికీ లేనిదానికీ ఆల్‌పార్టీ మీటింగ్‌ అంటూ తెగ హడావుడి చేసేవారు. తానే పెద్ద మేధావినని ఈ సమస్యలను తానైతే అలా చేసేవాడినని.. ఎన్నో అద్భుతాలు జరిగి ఉండేవని డబ్బాలు కొట్టేవారు. అయితే విభజన తర్వాత బాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతి సీజన్‌ లోనూ టెస్ట్ మ్యాచ్ లాగా ఐదురోజులకే పరిమితం చేశారు. ఆ ఐదురోజులు కూడా ప్రజాసమస్యలు చర్చకు రాకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతూ మమ అనిపించేశారు.  చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. 

ఏపీ అసెంబ్లీ ఈసారికీ అటకెక్కినట్లేనా 
గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీని ఏపీలో నిర్వహించుకుందామని ఆర్భాటంగా ప్రకటించారు. అప్పటికి అమరావతిలో కొత్తగా నిర్మిస్తున్న శాసనసభ, శాసనమండలి భవనాలు అందుబాటులోకి వస్తాయని సెలవిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సమావేశాలు మొదలయ్యాయి. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఏపీలో మాత్రం సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే ప్రకటన ఇంతవరకు రాలేదు. ఎక్కడ నిర్వహించాలనే దానిపై చంద్రబాబుకు స్పష్టత ఉన్నట్టు కనపడటం లేదు. ఎందుకంటే అమరావతిలో నూతనంగా నిర్మిస్తున్న అసెంబ్లీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. వారం రోజుల క్రితం జరిగిన సీఎం సమీక్షలో పనులు పూర్తి కావడానికి మరో నెలరోజులు సమయం పడుతుందని అధికారులు సెలవిచ్చారు. వారు పేరుకి నెలరోజులని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. అంతలోకి పుణ్యకాలం పూర్తవుతుంది. జనవరి కూడా గడిచిపోవచ్చు. గత సమావేశాల్లో స్పీకర్‌ కూడా రాబోయే సమావేశాలను ఆంధ్రాలో నిర్వహించేందుకు సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. కేఎల్‌ వర్సిటీలో వీలుంటుందేమోనని కూడా ప్రయత్నించారు. హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించేందకు అనువుగా ఉంటుందని రకరకాలుగా ఊదరగొట్టారు. ఇలా పూటకో మాట మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజాసంక్షేమమే ప్రభుత్వానికి పట్టడం లేదు.  పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో అన్ని వసతులు ఉండగా ఓటుకు నోటు కేసుకు భయపడి మూటా ముల్లె సర్దుకుని అమరావతికి పరుగుతీసిన బాబు... అక్కడేదో అద్భుతం చేయబోతున్నట్టు హడావుడి చేశాడు. చివరికి ఎటూ కాకుండా చేశాడు. 

వైయస్‌ జగన్‌ను నిలువరించడమెలా..?
అసెంబ్లీలో ప్రజాగళం వినిపిస్తున్న ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నా..నిబంధనలను కాలరాసి వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను అకారణంగా ఏడాది పాటు సస్పెండ్ చేసినా మొక్కవోని దీక్షతో ఎమ్మెల్యేలతో కలిసి ప్రజల పక్షాన వైయస్ జగన్ పోరాడుతున్నారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ప్రభుత్వ దుశ్చర్యను ఎక్కడిక్కడ ఎండగడుతూనే ఉన్నారు.  క్రమశిక్షణ చర్యల పేరిట 12 మంది ఎమ్మెల్యేలను హింసించినా వారు అధికారానికి దాసోహం కాలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా లొంగకపోగా వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మరింత సహనం కూడగట్టుకుని పోరాడుతున్నారు. జగన్‌ను నిలువరించేందుకు 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఆయన ఏ మాత్రం  తొణకలేదు. న్యాయ పోరాటం ఆపకపోగా మరింత వేగం పెంచేశారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడమే వైయస్ జగన్ నైజం.  

ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు.. ప్రతి చిన్నదానికీ కేసులు పెడుతున్నాం.. ఎమ్మెల్యే అనుచరుల ఆస్తులు ధ్వసం చేయిస్తున్నాం.. టీవీలు, పేపర్లన్నీ కూడబలుక్కుని 24 గంటలూ అవిశ్రాంతంగా ఆహా బాబూ, ఓహో బాబు అని మన కోసం ప్రచారం చేస్తూనే ఉన్నాయి.. ఇది చాలదన్నట్టు 25 మంది జర్నలిస్టులను సిద్ధం చేసుకుని నేషనల్‌ మీడియాలో కూడా పాపులర్‌ కావడానికి భజన కథనాలు రాయించుకుంటున్నాం. ఎంత ఖర్చు చేస్తున్నాం. ఎంత మందిని కొంటున్నాం.. ఫోకస్‌ మొత్తం వైయస్‌ జగన్‌ మీదనే పెట్టాం కదా. ఇంకా ఏం చేయాలి..? మనం సమావేశాలు పెడితే జనాలను గేట్లేసి కూర్చోబెట్టాల్సి వస్తుంది. వైయస్‌ జగన్‌ రోజు మార్చి రోజు మీటింగ్‌ పెట్టినా అలుపులేకుండా తోసుకుంటున్నారు.. అసలు ఆయన రోడ్డు మీద వెళ్తున్నా కారుకు అడ్డం పడిపోతున్నారెందుకబ్బా.. బాబులో నిత్యం ఇదే అంతర్మథనం. ఈ అసహనాన్ని  మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల మీద ప్రదర్శిస్తున్నారు. రోజుకో మాటతో పొంతన లేని ప్రకటనలతో ఆఖరుకి బ్యాంకు సిబ్బందిని తిట్టిపోసి వారి ఆగ్రహానికి గురయ్యాడు చంద్రబాబు. పబ్లిసిటీ కోసం అనాలోచిత నిర్ణయాలతో ప్రజాగ్రహానికి గురై జనంలో చంద్రబాబు అభాసుపాలయ్యారు.  

కొత్త నోట్లు తెప్పించడంలో చంద్రబాబు విఫలం
ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నట్లు బిల్డప్‌ ఇస్తున్న చంద్రబాబు పనితనం మరోసారి బయటపడింది. నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీకి ఆర్బీఐ నుంచి డబ్బులు తెప్పించడంలో పక్క రాష్ట్రంతో పోల్చిచూస్తే చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. తెలంగాణ జనాభాతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్న ఏపీకి తగినట్లుగా నిధులు రాలేదని స్పష్టమైంది. 3.8 కోట్లు జనాభా ఉన్న తెలంగాణకు ఇప్పటి వరకు 20.704 కోట్ల విలువైన కొత్త కరెన్సీ సరఫరా జరిగింది. 5.5 కోట్లు జనాభా ఉన్న ఏపికి మాత్రం కేవలం 14వేల 740 కోట్లు మాత్రమే కొత్త కరెన్సీ వచ్చింది. ఏపీతో పోలిస్తే తెలంగాణకు ఏకంగా 6700 కోట్ల సొమ్ము ఎక్కువగా వచ్చింది. చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేసీఆర్‌ మాత్రం సైలెంట్‌గా కేంద్రం, ఆర్‌బీఐతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ కొత్త కరెన్సీని రప్పిస్తున్నారు. కేవలం గడిచిన రెండు రోజుల్లోనే తెలంగాణకు 1600 కోట్ల నగదు వచ్చింది. చంద్రబాబు నిత్యం సమీక్షలతో హడావుడి చేస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం సైలెంట్‌గా పనిచేసుకుపోతున్నారన్న మాట. చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత ఏర్పాటైన సీఎంల కమిటీకి చైర్మన్‌గా కూడా ఉన్నారు. అయితే కొత్త నోట్లు రప్పించడంతో చంద్రబాబు వెనుకబడిపోయారు. పైగా నావల్లే పెద్ద నోట్లు రద్దు అయ్యాయంటూ పబ్లిసిటీ చేసుకోవడం, ప్రజలు కన్నెర్రచేయడంతో కష్టాలు పడుతున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఊసరవెళ్లి రాజకీయాలు చేస్తున్నారు. 

Back to Top