మొక్కలకు దిక్కెవరూ?

–వనం–మనం అభాసుపాలు
– మొక్కలు నాటారు...సంరక్షణ మరిచారు 
– ఎండిపోతున్న మొక్కలు
– ప్రజాధనం వృధా 
విజయవాడ: ఏ కార్యక్రమాన్నైనా ఆర్భాటంగా ప్రారంభించడం...ఆ తరువాత  గాలికొదిలేయడం టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిపాటిగా మారింది. చంద్రబాబు సర్కార్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన వనం– మనం కార్యక్రమం అభాసుపాలవుతుంది. ఈ పథకం కింద నాటిన మొక్కలకు చుక్క నీరు పోసే వారు లేక ఎండిపోతున్నాయి. వనం–మనం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తరువాత వాటి సంరక్షణ ఎలా ఉంది, నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయి, సక్రమంగా సంరక్షిస్తున్నారా, లేదా అని పర్యవేక్షణ కరువైంది. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనంతో నర్సరీలలో పెంచిన మొక్కలు నాటిన తరువాత పశువులకు ఆహారమవుతున్నాయి. మరికొన్ని మొక్కలు ఎండి పోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ పరిధిలో ఒక్కో మండలానికి 50 వేల నుంచి లక్ష మొక్కల వరకు ప్రభుత్వం అటవీశాఖ నర్సరీల ద్వారా పంపిణీ చేసింది.  వీటిని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఆవరణలలోను, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోను, గ్రామాలల్లో రహదారుల వెంబడి ఇలా ఎక్కడ కాళీ ఉంటే అక్కడ నాటారు.  రోడ్ల వెంట నాటిన మొక్కలలో పదిశాతం మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి, మిగిలిన 90 శాతం మొక్కలను గాలికొదిలేశారు. అయితే ఈ కార్యక్రమం మూన్నాళ్ల ముచ్చటగా మారడం, నాటిన మొక్కలను సంరక్షించకపోవడం తదితర కారణాలతో నాటిన మొక్కలు బతకడం కష్టంగా మారి ఎండిపోయాయి. 
జియోట్యాగింగ్‌ ఏమైందో...!
నాటిన ప్రతిమొక్కను జియోట్యాగింగ్‌ చేస్తామని, ప్రతి ఆరునెలలకొకసారి ఆ మొక్క ఏస్థితిలో ఉందో పరిశీలిస్తామని వనం–మనం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అంతేగాకుండా మొక్కల పెంపకం చేపట్టిన  ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటన  చేశారు. ప్రతి నాలుగో శనివారం ప్రతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలు సంరక్షించకపోయిన నేప«థ్యంలో జీయో ట్యాగింగ్‌ చేస్తామన్న ప్రభుత్వ ఆర్భాటపు  ప్రకటనలు పత్రికలకే పరిమితమయ్యాయి.
––––––––––––––––– 
నీళ్లు పోసే దిక్కు లేక..: నండూరి పద్మాంజలి, నూజివీడు 
మొక్కలను నాటి మరిచిపోవడంతో వాటికి నీళ్లు పోసే దిక్కులేక ఎండిపోయాయి. ఈ మాత్రం దానికి మొక్కలు నాటడం ఎందుకో.. చిత్తశుద్ధి లేకుండా ప్రచారం కోసం నిర్వహించే కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి. 
ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలి: ఎన్‌ మురళీకృష్ణ, నూజివీడు. 
మొక్కలు నాటడం మంచిదే కాని వాటిని సంరక్షించడంలో చిత్తశుద్ధి ఉండాలి. ఆర్భాటంగా నిర్వహించి వదిలేయడం వల్ల ప్రజాధనం వృధా తప్ప ఉపయోగం ఉండదు. ఎన్ని మొక్కలు నాటామన్నది కాకుండా నాటిన ప్రతిమొక్క బతికిందా లేదా అన్నది ముఖ్యం.
Back to Top