బడ్జెట్‌లో ఏపీకి భవిష్యత్తేది...?

* ప్రత్యేక హోదా ఊసే లేదు
* బాబు కోరిన ప్యాకేజీకి చట్టబద్దత లేదు
* పోలవరానికి, విద్యాసంస్థలకు నిధుల్లేవ్‌
* రైల్వే మంత్రికి ఏపీ నుంచి ప్రాతినిథ్యమున్నా
* విశాఖకు రైల్వే జోన్‌ ప్రస్తావన లేదు 

హైద‌రాబాద్‌: దేశంలోకెల్లా తానే సీనియర్‌ మోస్‌ పొలిటీషియన్‌నని చెప్పుకుని జొబ్బలు చరుచుకోవడానికే తప్ప ఆయన ఏపీకి ఒరగబెడుతుందేమీ లేదు. తాజాగా నిన్న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో మరొక్కసారి రుజువైంది. కేంద్రం దగ్గర బాబు పప్పులు ఉడకడం లేదని తేలిపోయింది. అది చేస్తా ఇది చేస్తా.. నాకు వాళ్లు తెలుసు.. వీళ్లు తెలుసు.. నేను తలుచుకుంటే... ఇలా మూడేళ్లుగా బ్యాండు వాయించడమే తప్ప వీసమెత్తు పని జరిగిన దాఖలాలు లేవు. పైగా విభజన చట్టం ద్వారా కేంద్రం నుంచి మనకు హక్కుగా దక్కాల్సిన వాటిపై కూడా చంద్రబాబు నోరు మెదపలేని దుస్థితి. అప్పట్లో కేంద్రాన్ని గ్రిప్పులో పెట్టుకున్నా.. అబ్దుల్‌ కలాంని రాష్ట్రపతిని చేశా.. వాజ్‌పేయికి బ్రాడ్‌బ్యాండ్‌ ఐడియా ఇచ్చా.. హైదరాబాద్‌కు ఐటీ ఇండస్ట్రీని పరిచయం చేశా.. ఇలా చెప్పుకోవడమే సరిపోయింది. 
షరతులతో క్యాపిటల్‌ గెయిన్స్‌ రద్దు
నిన్నటి కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి దొరికిన ఒకే ఒక ఊరట క్యాపిటల్‌ గెయిన్స్‌ రద్దు. అది కూడా షరతులతో కూడిన రద్దు వర్తింపజేస్తూ బడ్జెట్‌ ప్రసంగంలో అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు పరిహారం కింద సీఆర్‌డీఏ ఇచ్చే స్థలాలను (ప్లాట్లను) విక్రయించగా వచ్చే సొమ్ముకు క్యాపిటల్‌ గెయిన్స్‌  (మూలధన) పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా 2014 జూన్‌  2 నాటికి భూములు కలిగి ఉన్నవారికే ఈ ప్రయోజనం వర్తిస్తుందని స్పష్టం చేసింది. నిజానికి సాగు భూముల అమ్మకపు మొత్తానికి క్యాపిటల్‌ గెయిన్స్‌  పన్నుండదు. వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించడం వల్ల ఇప్పుడు పన్ను పడుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం భూమి ఇచ్చినందున కేంద్రం మినహాయింపు ఇచ్చినా, దీనివల్ల రైతులకు లాభముండదు. ఎందుకంటే వారు ఎకరా భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇస్తే సీఆర్‌డీఏ 800–1,450 గజాల చొప్పున ప్లాట్లిచ్చింది. ఇప్పుడు ఎకరా భూమిని అమ్మితే వచ్చే ఆదాయం కంటే సీఆర్‌డీఏ ఇచ్చిన ప్లాట్లు విక్రయిస్తే ఎక్కువేమీ రాదు. అయితే ఇదేదో పెద్ద బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి సహా టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. 
విభజన చట్టంలోని హామీలకు మోక్షం లేదు
అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించలేదు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల ప్రస్తావన అసలే లేదు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం, రెవెన్యూ లోటు భర్తీ వంటి ముఖ్యమైన హామీలను సైతం ఈ బడ్జెట్‌లో విస్మరించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ఏర్పాటుకు నిర్దిష్ట కేటాయింపులు జరపలేదు. మిగిలిన మెట్రోల్లో కలిపి కేటాయింపులు చూపారు.
రెవెన్యూ లోటు భర్తీ ప్రస్తావనే లేదు
కనీసం అప్పులు చేసేందుకు కూడా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం– ఫిజికల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) నిబంధనలను సడలించలేదు. అలాగే 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రూ.16,000 కోట్ల రెవెన్యూ లోటులో ఇప్పటివరకు కేవలం రూ.4,000 కోట్ల మాత్రమే కేంద్రం భర్తీ చేసింది. మిగతా రూ.12 వేల కోట్ల లోటు భర్తీపై కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావిస్తారని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కొత్తగా సంస్థలను, ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల పరిధిని పెంచాలన్న డిమాండ్‌పై బడ్జెట్‌లో పరిష్కారం చూపలేదు. జాతీయస్థాయి విద్యాసంస్థల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు కావాల్సి ఉన్నప్పటికీ అరకొరగా నిధులు విదిల్చారు.

ప్రత్యేక హోదాకు మంగళం!
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించారు. పదేళ్లు కావాల్సిందేనని బీజేపీ నేతలు, పదిహేనేళ్లు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. చివరకు ప్రత్యేక హోదా అనే మాటే అరుణ్‌జైట్లీ ప్రసంగంలో వినిపించలేదు. 
‘ప్రత్యేక ప్యాకేజీ’కి చట్టబద్దత ఎండమావే..?
 బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే కనిపించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నిధుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు పూర్తిగా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిధులు మాత్రం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. అయితే బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు రోజు టీడీపీ పార్లమెంటరీ పార్టీతో చంద్రబాబు సమావేశమై ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని చెప్పి పంపారు. చంద్రబాబు కనీసం ప్యాకేజీకి చట్టబద్దత సాధించే సూచనలు కనిపించలేదు.
నోబెల్‌ బహుమతికి కొద్ది దూరంలో 
ఇటీవల తిరుపతిలో జరిగిన నేషనల్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో నోబెల్‌ బహుమతి సాధించిన తెలుగు వారికి వంద కోట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించాడు. తాజా బడ్జెట్‌ కేటాయింపులను చూస్తే మనసు ఆనందంతో పరవశించిపోతోంది. మనకు కాదు. చంద్రబాబుకు. ఇలా నీచాతి నీచంగ నిధులు కేటాయిస్తే చదువు సాగడమే కష్టం. అలాంటిది నోబెల్‌ బహుమతులా. పగటి కలే.  బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలలోని ఉన్నత విద్యాసంస్థలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు లభించాయి. ఇంకా ఏర్పాటు కావల్సిన వాటికి కూడా ఎంగిలి మెతుకులు మాత్రమే విదిల్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేటు కళాశాల వారు ఉచితంగా ఇచ్చిన భవనంలో కొనసాగుతున్న ఎన్‌ఐటీకి ఇంకా శాశ్వత భవనం ఏర్పాటుచేయాల్సి ఉండగా.. దానికి వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి ఈ పది కోట్లు ప్రహరీ నిర్మాణానికి కూడా సరిపోవు. ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా శాశ్వత భవన నిర్మాణం ఎప్పుడు చేస్తారో, అప్పటివరకు ఎన్ని సంవత్సరాలలో ఈ నిధులు ఇస్తారో తెలియాల్సి ఉంది. 
నగదు రహితంతో దేశం మారిపోతుందా బాబూ..
కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, ఆయన కోరుకున్నట్టు ప్యాకేజీకి చట్టబద్దత లేదు.. రెవెన్యూ లోటు భర్తీ ఊసే లేదు. విశాఖ రైల్వే జోన్‌ ప్రస్తావన లేదు.. విద్యాసంస్థల ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఏవీ లేవు. అయినా చంద్రబాబుకు మాత్రం బడ్జెట్‌ బ్రహ్మాండంగా కనిపించింది. దేశాన్ని నవ్య పథంలో నడిపిస్తుందని మోడీ, జైట్లీలపై ప్రశంసలు. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ విధానంలో 35 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు రెండేళ్లపాటు కేపిటల్‌ గెయిన్స్‌ నుంచి మినహాయింపును ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇది ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో మాత్రం చెప్పలేదు. ఎకరా పొలాన్ని సొంతంగా అమ్ముకుంటే వచ్చే దానికన్నా దీనివలన కలిగే ప్రయోజనాలేంటే మాత్రం వివరించలేదు. గొప్పలు చెప్పుకోవడానికి సందర్భం కోసం చూసే బాబు రాజకీయ పార్టీలకు విరాళాలపై ఆంక్షల నేపథ్యంలో విరుచుకుపడిపోయారు. దేశంలో టీడీపీ పార్టీ ఒక్కటే సభ్యత్వం ద్వారా వచ్చే నిధులు సేకరింస్తుందని బాకా ఊదేశాడు. నిజానికి రూ. 100ల సభ్యత్వంతో వచ్చే డబ్బుతోనే చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుని పార్టీని నడిపాడంటే ఎవరూ నమ్మరు. అలా నడిపిందే నిజమైతే మంత్రి పదవులు సుజనా, నారాయణ, గంటా లాంటి వారికి కాంట్రాక్టులు రాయపాటి, నామా, గల్లా లాంటి వారికి దక్కేవి కావన్నది నిజం.
Back to Top