బతకడానికి ఏది భరోసా..?

  • జన్మభూమి కమిటీల పెత్తనం
  • పింఛన్లకు టీడీపీ మంగళం
  • కొత్త పింఛన్లు దేవుడెరుగు
  • ఉన్న పింఛన్లను పీకేస్తున్న వైనం
  • ఎన్నికల కోసం మళ్లీ బాబు మభ్యపెట్టే వ్యాఖ్యలు
  • టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు
వితంతువులు, వృద్ధుల ఆర్తనాదాలు, ఆకలి కేకలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినిపించడం లేదు. రూ.1,000 పింఛన్‌ ఆశ చూపించి ఈ వర్గాల ఓట్లను దండుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రి మండలి సమావేశాలలో, జన్మభూమి బహిరంగ సభలలో లక్షలలో పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. కొత్త పింఛన్లు ఈ నెల నుంచే అంటారు. కానీ ఎన్ని నెలలు గడిచిపోయినా ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో అసలు ఈ ఊసే లేదు. నిబంధనల పేరుతో పాత పింఛన్లు రద్దుచేయడం, మళ్లీ వారి పేర్లనే చేర్చడం రెండున్నరేళ్లుగా ఈ తంతుతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. అధికారుల చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం ఉండడం లేదు. 

ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కాటికి కాలు చాపిన పండుటాకులు.. ఊతం లేని వికలాంగులు.. దిక్కులేని వితంతువుల నోళ్లను ప్రభుత్వం కొట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఇస్తోన్న పింఛన్లలో కోత విధించింది. అనర్హుల ఏరివేత కోసం చేపట్టిన సర్వేలో నిబంధనలను యథేచ్ఛగా తుంగలోతొక్కింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కగానే కోతలకు తెరతీశారు. ఇదే క్రమంలో పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడానికి ఎత్తుగడ వేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు, సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో కమిటీ వేసి.. తస్మదీయులు అర్హులైనా అనర్హులుగా చిత్రీకరించి పెన్షన్ల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని కనుసైగలు చేశారు. నిబంధనలను వక్రీకరించి అర్హులను అనర్హులుగా చిత్రీకరించారు.

జన్మభూమి కమిటీదే పెత్తనం:
కొత్తగా పింఛన్‌ మంజూరు కావాలన్నా.. ఉన్న పింఛన్‌ తొలగించాలన్న రాజ్యాంగ విరుద్ధంగా ఎంపికైన జన్మభూమి కమిటీలకు ప్రభుత్వం పెత్తనం కట్టబెట్టింది. ఈ కమిటీల్లో టీడీపీ కార్యకర్తలు ఉండడం.. ఆ పార్టీ అగ్రనేతలు ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం చేపట్టిన సర్వే మొత్తం వారి కనుసన్నల్లోనే సాగింది. తమకు ఓట్లు వేయని వారికి భూమి లేకున్నా ఉన్నట్లు.. ఇల్లు లేకున్నా ఉన్నట్లు తిమ్మిని బిమ్మిని చేసి అనర్హులుగా చిత్రీకరించారు. నెలనెలా వృద్ధాప్య, వితంతు, గీత, నేత కార్మికులు రూ.వెయ్యి.. వికలాంగులు రూ.1500 పింఛను వస్తుందని ఆశించారు. కానీ.. ఉన్న పింఛనే పీకేయడంతో కన్నీరుపెడుతున్నారు. పింఛన్‌ ఇప్పించమని అడిగితే నీవు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు. నీకెలా పింఛన్‌ మంజూరు చేస్తామంటూ బాహటంగానే జన్మభూమి కమిటీ సభ్యులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. 

పింఛన్ల మంజూరుకు మంగళం:
పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం మంగళం పలికింది. పింఛన్లను రూ. వెయ్యిగా పెంచిన తర్వాత నూతనంగా పింఛన్‌ మంజూరు చేయడానికి అధికారులు అనేక ఆంక్షలను విధిస్తున్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పింఛన్లు, ఇంటి రుణాలు మంజూరు చేస్తే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి దానికి పార్టీతో ముడిపెడుతూ ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తోంది. వృద్ధాప్య పింఛన్‌ తీసుకొనే భర్త చనిపోతే గతంలో అతని భార్యకి వితంతు పింఛన్‌గా మార్చి అందజేసేవారు. ఇప్పుడు ఆ నిబంధనలను రద్దు కావడంతో ఆ కుటుంబ సభ్యులు పడే బాధలు అన్నీఇన్నీ కాదు. ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది పింఛన్‌ తీసుకుంటూ ఆ ఉద్యోగి చనిపోతే అతని భార్యకి అటోమెటిక్‌గా ఆ పింఛన్‌ వర్తిస్తుంది. అలాంటిది ప్రభుత్వం అందజేసే సామాజిక పింఛన్ల విషయంలో మానవతా దృక్పధంతో గత ప్రభుత్వం అమలుచేసిన భర్త చనిపోతే భార్యకి వితంతు పింఛన్‌ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 
 
పంపిణీలో తీవ్ర జాప్యం 
ప్రభుత్వ నూతన విధానాలు సామాజిక పింఛన్ల అర్హుదారులకు శాపంగా మారుతున్నాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులకు అందించే పింఛన్లను ఈ–పాస్‌ చేయడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. కొందరికి వేలిముద్రలు పడకపోవడంతో వారి ఐరిస్‌ పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలున్నాయి. కానీ, వీటిని గాలికొదిలేసి ఇకపై వేలిముద్రల ద్వారానే పింఛన్లు పంపిణీ చేయాలని సూచించడంతో వృద్ధులు, వికలాంగులకు తిప్పలు తప్పడం లేదు.  

మహానేత హయాంలో ఠంచన్‌గా పింఛన్‌
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పింఛన్‌దారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీనే పింఛన్‌ సొమ్ము అందేది. మహానేత పాలనకు ముందు తొమ్మిదేళ్ల పాటు కొత్త పింఛన్‌ రావాలంటే లబ్ధిదారుల్లో ఒకరు చనిపోవాలనే నిబంధన ఉండేది. అలాంటి పరిస్థితులను వైయస్సార్ పూర్తిగా మార్చేశారు. అడిగిన ప్రతి ఒక్కరికి పింఛన్‌ మంజూరు చేసి ఆసరాగా నిలబడ్డారు. ప్రస్తుతం కుటుంబ పెద్ద దిక్కు(భర్త) కోల్పోయి నిరాశ్రయులైన వితంతువుల పింఛన్ల మంజూరుకూ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది. వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. టీడీపీ నేతలు పింఛన్‌దారులను ఓటు బ్యాంకు కోసం ఉపయోగపడేలా మలచుకుంటున్నారు. ఆచరణాత్మక వైఖరితో రూ.700 పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటానని చెప్పిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఎన్ను కోకుండా ప్రజలు తప్పటడుగు వేశారు. అయితే మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సర్కార్‌ సిద్ధమవుతోంది. త్వరలో జరుగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో గెలిచేందుకు గాను టీడీపీ సర్కార్‌ కొత్త పాట పాడుతోంది. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని అధికార పార్టీ నేతలు హామీలు గుప్పిస్తున్నారు. ఇక వారి మాటలు నమ్మే రీతిలో జనం లేరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో స్పష్టమవుతోంది. ఈ సారి మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.


 

తాజా వీడియోలు

Back to Top