బడ్జెట్‌లో వ్యవ‘సాయ’మేది..?

– ప్రతిపాదనలు అమోఘం... అమలు శూన్యం
– ఆంధ్రాలో అన్నదాతకు దక్కని ఆదరణ
– గిట్టుబాటు లేక కాడి వదిలేస్తున్న రైతులు
– కరువుతో అల్లాడుతున్న రాయలసీమ
– కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర

  రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కరువుతో రైతులు కూలీలుగా మారి పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు.  గిట్టుబాటు ధరలు లేక కాడె పక్కనపడేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రుణమాఫీ చేస్తానని ఓటేయించుకుని గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోకపోగా ఆత్మహత్య చేసుకుని మరిణించినా బాధితుడి కుటుంబాలను విచారణ పేరుతో వేధిస్తున్నాయి. పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు బాధిత కుటుంబాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. బడ్జెట్‌లో చెప్పే మాటలకు, చేసే కేటాయింపులకు అనంతరం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు చాలా వ్యత్యాసం కనబడుతోంది. గత రెండేళ్లుగా ప్రతిపాదించిన వ్యవసాయ బడ్జెట్‌ను పరిశీలిస్తే అసలు విషయం స్పష్టమవుతోంది. 

ఈ బడ్జెట్‌లోనైనా ఆదుకుంటారా
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయని స్పీకర్‌ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ రైతాంగాన్ని నిరాశపర్చింది. రైతాంగం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవ సాయ బడ్జెట్‌ను వేరుగా ప్రతిపాదిస్తున్నది. గడిచిన ఏడాదిని పరిశీలిస్తే రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. సంస్థాగత రుణాలు లేని 6.83 లక్షల మంది కొత్త రైతులు, 20 లక్షల మంది కౌలు రైతులు ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడి ఉన్నారు. మార్కెట్‌లో దళారీల పెత్తనం పెరిగింది. కొనుగోలు చేసిన పంటకు వెంటనే చెల్లించాలంటే 2 నుంచి 3 శాతం తగ్గించి ఇస్తున్నారు. కరువు బారిన పడిన జిల్లాల్లో పేద రైతాంగం వలసలు పోతున్నారు. పాడి గేదెలను, దుక్కిటెడ్లను తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఇవేవీ పెద్ద సమస్యలు కానట్లుగా అధికోత్పత్తి గురించి, కార్పొరేట్‌ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నది. గత నెలలో తిరుపతిలో సైన్స్‌ సదస్సులో పాల్గొన్న డాక్టర్‌ స్వామినాథన్‌ మాట్లాడుతూ దిగుబడులు పెరిగినంత మాత్రాన రైతులు సంక్షోభం నుంచి బయట పడలేరనీ, రైతులకు తగినంత ఆదాయం లభించే విధంగా మద్దతు ధరలు ఇచ్చినప్పుడే పరిష్కారం అవుతుందని చెప్పారు.

మద్దతు ధర లేకుండా వృద్ధితో ఉపయోగం లేదు
రైతులు పండించే పంటకు మద్ధతు ధర కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధర తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా బోనస్‌ రూపంలో గానీ, సబ్సిడీ రూపంలో గానీ అదనంగా ఇవ్వాలి. ధాన్యానికి, గోధుమలకు, అపరాలకు, చెరకు, పత్తి, మిర్చి, తదితర పంటలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత అదనంగా ఇస్తున్నాయి. గత నెలలో కందులకు కేంద్రం నిర్ణయించిన ధర రూ.5,050కు అదనంగా కర్ణాటక ప్రభుత్వం రూ.450 బోనస్‌ ప్రకటించి రూ.5,500లకు కొనుగోలు చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏ పంటకూ అదనంగా ఇవ్వలేదు. దేశం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి ఖర్చులు ఎక్కుగా ఉన్నాయని, మద్దతు ధరలు ఇంకా పెంచాలని కేంద్రాన్ని కోరి సరిపెట్టింది. తెలుగుదేశం తన ఎన్నికల ప్రణాళికలో రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. గత మూడు బడ్జెట్‌లలో ఏర్పాటు చేయలేదు. వచ్చే బడ్జెట్లో అయినా పంటల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తుందని ఆశిద్దాం.

ఆత్మహత్యల పరిహారంపై ఆంక్షలు 
రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. గత మూడు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో 2,284 మంది రైతులు ఆత్మహత్యల పాలై మృతి చెందారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర సర్కారు నష్టపరిహారం రూ.5 లక్షలకు పెంచింది. ఇచ్చింది మాత్రం 2,284 మందికి గాను 169 మందికి మాత్రమే. రూ.1.50 లక్షల చొప్పున 66 మందికి, రూ.5 లక్షల చొప్పున 103 మందికి ఇచ్చారు. మృతి చెందిన కుటుంబాలు 13 రకాల సర్టిఫికెట్లు ఇవ్వాల్సి వుంది. కౌలు రైతు అయితే మరో సర్టిఫికెట్‌ అదనంగా ఇవ్వాల్సి ఉంది. యజమాని చనిపోయిన స్థితిలో ఇన్ని సర్టిఫికెట్లు ఎలా సాధ్యం.. పంచనామా ఆధారంగా ఇవ్వడం సరైన పద్ధతి. రాష్ట్రంలో 268 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కరువు జిల్లాలైన రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పనుల కోసం వలసలు వెళ్తున్నారు. కరువువాతబడిన రైతులు బెంగళూరులో బిచ్చమెత్తుకుంటున్న బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలకు గత ఏడాది రావాల్సిన పంటల బీమా మొత్తం రూ.430 కోట్లు ఇవ్వడానికి ప్రయివేట్‌ బీమా కంపెనీ పేచీలు పెడుతున్నది. దాన్ని వెంటనే ఇప్పించాలి.

రుణమాఫీ లేదు.. రుణాలు అందవు
రైతుల రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చింది. రూ.84 వేల కోట్లు రద్దు చేస్తామన్న వాగ్ధా్దనం కాస్తా రూ.24 వేల కోట్లకు కుదించింది. ఇప్పటికి రెండు విడతలుగా ఇచ్చింది రూ.10,665 కోట్లు మాత్రమే. ఇంకా రూ.13,315 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 14.80 లక్షల మందికి ఉపశమన హామీ పత్రాలిచ్చారు. ఇంకా 70 వేల మందికి హామీ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. కొన్ని సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, ఆర్‌ఎమ్‌జి, జెఎల్‌జి గ్రూపుల జాబితాలు పంపనే లేదు. వారంతా రైతు సాధికార సంస్థ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులుండగా 9.90 లక్షల మందికి ఎల్‌ఇసీ కార్డులిచ్చి పంట రుణాలు ఇస్తామని రుణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఆచరణలో 1 లక్ష మందికి మాత్రమే అరకొరగా ఇచ్చారు. 40 శాతం మంది పేద రైతులకు సంస్థాగత రుణాలు లేవు. వీరంతా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల రైతులే. వీరందరినీ జెఎల్‌జీ గ్రూపుల్లో చేర్చి ప్రతి బ్రాంచి నుంచి 150 మంది కొత్త వారికి పంట రుణాలు ఇస్తామని రుణ ప్రణాళికలో ప్రకటించారు. ఎక్కడా ఇచ్చిన అనవాళ్లు లేవు. 

తాజా వీడియోలు

Back to Top