సంక్షేమ పథకాలు అభాసుపాలు

  • పథకాలన్నీ పచ్చచొక్కాలకే
  • పేదలకు అందని అభివృద్ధి ఫలాలు
  • బాబు పాలనపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు
ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రచార ఆర్భాటం తప్ప అమలలో అభాసుపాలవుతున్నాయనే చెప్పాలి. ప్రజలందరికి కాకుండా  క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలే లబ్ధి పొందేలా కార్యాచరణ చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.  ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం దుకాణాల బెల్టు షాపులను రద్దు జేస్తూ  జీఓ తీసుకువచ్చింది . జిఓను పక్కన పెట్టి  తెలుగు తమ్ముళ్ళు వీధివీధిన బెల్టు షాపులను ఏర్పాటు చేసి యథేఛ్చగా అమ్ముతున్నా  ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. దీంతో చంద్రన్న సంతకంపై తమ్ముళ్ళకు ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది.  

            ఎన్నికల వాగ్ధానంలో చంద్రబాబు ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు. లోటు బడ్జెట్‌ సాకుతో  రైతులు ఐదేళ్ళుగా తన చేతుల్లో ఉండే విధంగా  విడతల వారీ రైతు, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ చేపట్టారు. బాబు ఇచ్చే రుణాలు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. దీంతో మహిళలు, రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది.  రుణమాఫీ కాని అనేక మంది రైతులు  ప్రభుత్వ తీరుపై  దుమ్మెత్తి పోస్తున్నారు. 

        ఎన్టీఆర్‌ ఆరోగ్య శ్రీ  కార్డులు  ఎవరికీ సక్రమంగా అందలేదు. వీటి పంపిణీ భాద్యత  పార్టీ కార్యకర్తలైన డీలర్లుకు  అప్పగించారు. దీంతో అందరికి సరిగ్గా అందక , రేషన్‌ కార్డునే అనేక మంది ఉపయోగించుకుంటున్నారు. 

         ఎన్టీఆర్‌ గృహ పథకం అర్హులైన పేదలకు అందని ద్రాక్షాగానే మారింది. జన్మభూమి కమిటీ ఆమోదం మేరకే మంజూరు చేయడంతో రెండేళ్ళలో పార్టీ కార్యకర్తలకు  తప్ప ఇతరులకు ఎవరికి ఇళ్ళు మంజూరు కాని పరిస్థితి ఏర్పడింది. సొంతింటి కల పేద వానికి దూరమైందనే చెప్పాలి. గ్రామ జన్మభూమి కమిటీల తీర్మానం ఎమ్మేల్యే ఆమోదం తప్పని సరికావడంతో అయిన వారికే దక్కక ,సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి.  

              రేషన్‌ కార్డుల మంజూరులో డీలర్ల ప్రమేయం ఉండడంతో , నచ్చిన వారికి మంజూరు చేయించి  ఇతరులకు మొండి చేయి చూపారు. రేషన్‌ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు తీసుకు వచ్చిన ఈ–ఫాస్‌ యంత్రాలు ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాగా వీఆర్వోల వేలి ముద్రలతో సరుకులు దారి మళ్ళించేందుకు సులువు మార్గం ఏర్పడింది.  రెండు నెలలుగా నగదు రహితంగా రేషన్‌ ఇవ్వాలని చూస్తున్నా అమలకు మాత్రం నోచుకోవడం లేదు.  

                నీరు –చెట్టు, నీరు–మీరు పేరుతో చేపట్టిన కార్యక్రమాల ద్వారా చెరువుల్లోని  మట్టిని  అమ్ముకొని పార్టీ నాయకులు లక్షలు కొల్లగొడుతున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ఇష్టారాజ్యంగా తీర్మానాలు చేసుకొని అధికారులచే బిల్లులు చేయించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతునన్నాయి. ఒకే చెరువునకు రెండు మూడు సార్లు బిల్లుల చేసుకోవడం , మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం , పని చేసిన దానికంటే  అధికారులచే బలవంతంగా  ఎక్కువ పనికి బిల్లులు చేయించుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.  

                అట్టహాసంగా ప్రారంభించిన వనం –మనం నీరు లేక విలవిలలాడుతోంది. వెచ్చించిన కోట్ల రూపాయలకు కనీసం పదుల సంఖ్యలో కూడా మొక్కలు బతకలేదు. నీరుపోసే దిక్కులేక ఎక్కడ మొక్కలు అక్కడే ఎండిపోయాయి.  ట్రీ గార్డులు ఏర్పాటు చేయకపోవడంతో పశువులకు మేతగా మారాయి. దీంతో అనుకున్నది ఒకటి –జరిగింది ఒకటి అన్న సామెతగా తయారైంది. 

                    ఇక ఎన్టీఆర్‌ భరోసా చేప్పనక్కర్లేదు . జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో అర్హులకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. టీడీపీకి ఓట్లు వేసిన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తున్నారు. పింఛన్‌ దారులు కష్టాలు చెప్పనక్కరలేదు.  పింఛన్‌ డబ్బులు ఐదురెట్లు  పెంచామని చెపుతున్న నాయకులు , పింఛన్‌దారులకు అదే స్థాయిలో కష్టాలను కూడా పెంచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి పింఛన్‌ పంపిణీ విషయంలో అనేక మలుపులు తిప్పుతూ వృద్ధులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

        కరువు మండలాలను ప్రకటించి రెండో సంవత్సరం కావస్తున్నా , వర్షాభావంతో ఎండిన పంటలకు ఇన్‌ పుట్‌ సబ్సిడి ఇచ్చిన దాఖలాలు లేవు. కరువు మండలాలకు కేటాయించాల్సిన నిధులు కాని, ప్రజలకు అందాల్సిన వనరులు గాని చేరనేలేదు.
 
                    ఎన్టీఆర్‌ జలసిరి ద్వారా ఒక్క బోరుబావి తవ్విన జాడలేదు. రెండేళ్ళు అవుతున్నా ఇంకా జియాలజిస్టులు అందుబాటులో లేరన్న నెపంతో ఇంత వరకు ఒక్క యూనిట్‌ మంజూరు చేసిన పాపాన పోలేదు. అన్న క్యాంటిన్లు  ఆదిలోనే మూత బడ్డాయి. గ్రామాలకు సైతం  విస్తరిస్తాయన్న  అన్న క్యాంటిన్లు  పట్టణాలల్లో కూడా  కనబడకుండా పోయాయి. ఎన్‌టిఆర్‌ ఆరోగ్యశ్రీ, ఎన్‌టిఆర్‌  జలసిరి, ఎన్‌టిఆర్‌ గహ నిర్మాణం  ఇలా ఎన్‌టిఆర్‌  పేరుతో మొదలు పెట్టిన ఏ పథకం సజావుగా అమలుకు నోచుకోలేదు.

          స్వచ్చభారత్‌ పేరుతో బహిరంగ మల విసర్జన లేకుండా చేస్తామన్న ప్రభుత్వం మరుగు దొడ్లు నిర్మించుకొని రెండేళ్ళు అవుతున్నా ఇంత వరకు బిల్లులు మంజూరు కాలేదు. కార్యక్రమం రోజున తప్ప ఇతర రోజుల్లో  గ్రామాల్లో ఎక్కడచూసినా  ప్టాస్టిక్‌ కవరులతో చెత్తగా తయారువుతున్నాయి. 

 చంద్రన్న క్రిస్మస్‌ ,సంక్రాంతి కానుకలు, రంజాన్‌ తోపా,, చంద్రన్న బాట, చంద్రన్న సంచార వైద్యం ,చంద్రన్న బీమా, చంద్రన్న ఆరోగ్యరక్ష , చంద్రన్న క్షేత్ర ప్రదర్శన, చంద్రన్న పసుపు కుంకుమ , ఇలా చంద్రన్న పేరుతో పలు పథకాలతో ఆర్భాటం చేయడం తప్ప అవి పేదలకు అందిన దాఖలాలు లేవు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top