వినికిడి సమస్యపై వైయస్‌ఆర్‌సిపి ఉచిత వైద్యం

గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : వినికిడి సంబంధ సమస్యలపై తక్షణమే వైద్యులను సంప్రతించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు చేరెడ్డి రామ్మోహన్‌రెడ్డి సూచించారు. పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యల పట్ల మరింత అప్రమత్తత అవసరం అన్నారు. ముఖ్యంగా 12 ఏళ్ళ లోపు పిల్లలకు వచ్చే చెవి సంబంధ వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేసేలా దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.

సామాజిక బాధ్యతలో భాగంగా 2013 ఫిబ్రవరి 17న ప్రకాశం జిల్లా గిద్దలూరులో సాహి స్వచ్ఛంద సంస్థ, వైయస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 217 మందికి వైద్యులు చెవి సంబంధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సిపి ఎన్నారై విభాగం కన్వీనర్‌ వెంకట్‌ మేడపాటి, సాహి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి డాక్టర్‌ రాంబాబు, వైయస్‌ఆర్‌సిపి నాయకుడు సిహెచ్‌. రంగారెడ్డి, మానం వెంకటరెడ్డి, చెన్ను విజయ మాట్లాడారు.

ప్రవాసాంధ్రులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వెంకట్‌ మేడపాటి అభినందించారు. దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో మారుమూల ప్రాంతాలలో తాము ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వెంకట్‌ వివరించారు. సాహి స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో ఇప్పటి వరకూ వెయ్యి మంది బధిర విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందజేసినట్లు వెల్లడించారు.

ఈ శిబిరంలో 15 ఏళ్ళ లోపు వయస్సు ఉన్న 187 మంది బధిర బాల బాలికలకు, 30 మంది వృద్ధులకు వినికిడి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేశారు. మరో 20 మందికి సుమారు రూ. 15 లక్షల ఖర్చుతో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించేందుకు పార్టీ ప్రవాసాంధ్ర విభాగం ఏర్పాట్లు చేసింది.

ఈ ఉచిత వైద్య శిబిరంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డాక్టర్‌ చేరెడ్డి రంగారెడ్డి, వెంకట్‌ మేడపాటి, పారిశ్రామికవేత్త చేరెడ్డి రామ్మోహన్‌రెడ్డితో పాటు మానం వెంకటరెడ్డి, డాక్టర్‌ జె.వి. బ్రహ్మం, చెదుళ్ళ రమణారెడ్డి, దాసరి ప్రసాద్‌, షేక్‌ సుభాని, భాస్కర్‌రెడ్డి, సాహి సంస్థ కార్యదర్భి డాక్టర్‌ రాంబాబు, ఇ.సి. వినయ్‌ కమర్ పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన రోగులకు చేరెడ్డి రామ్మోహన్‌రెడ్డి ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.
Back to Top