ఊళ్లు మునిగిపోతున్నాయ్‌ బాబూ.. నిద్రలేవండి

()భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం
()దెబ్బతిన్న పంటలు, కూలిన ఇళ్లు
()జలదిగ్బందంలో జనం అవస్థలు
()విషజ్వరాలతో దీనావస్థ
()చోద్యం చూస్తోన్న చంద్రబాబు 

 ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది.  ఇళ్లు కూలిపోయి, పంటలు దెబ్బతిని సర్వం కోల్పోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా అనేక మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే  రాష్ట్ర  ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. కనీస సహాయక చర్యలు చేపట్టడంలోనూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. గుంటూరు, ప్రకాశం సహా అనేక జిల్లాలో వాన విలయానికి వాగులు పొంగి పొర్లడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు జలదిగ్బందంలో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నిత్యవసర సరకులు అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వాగులు పొంగి ప్రవహించడంతో రోడ్డు మార్గాలు మూసుకుపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. చెరువులు కట్టలు తెంచుకుని ఊరిమీద పడిపోవడంతో ప్రజలు భయం భయంతో బతుకుతున్నారు. మురుగు నీరు ఇళ్లలోకి చొరబడడంతో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలి మంచాన పడుతున్నారు.  

గోల్ఫ్‌ కోర్సులు, ఎయిర్‌పోర్టులు ప్రజలడిగారా బాబూ..
వరద బాధిత ప్రాంతాల ప్రజల బాధలు ఈప్రభుత్వానికి పట్టడం లేదు. వరద ఉధృతిని, ప్రజల దుస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి...అవన్నీ వదిలేసి ఎయిర్‌పోర్టులు కడతాం, గోల్ఫ్‌ కోర్సులు తీసుకోస్తాం అంటూ ప్రచార ఆర్భాటంతో కాలక్షేపం చేస్తున్నారు. మంత్రులు మొద్దు నిద్రపోతున్నారు. కష్టాలొచ్చినప్పుడూ చోద్యం చూసి.. అంతా అయిపోయాక మొసలి కన్నీళ్లు కార్చడం తగదని  ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.  సామాన్యులకు కావాల్సింది గోల్ఫ్‌ కోర్సులు, ఎయిర్‌పోర్టులు కాదని..వారిని ఆదుకునేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

విషజ్వరాలు పీడిస్తుంటే ఆదుకునే నాథుడే కరువు
భారీ వర్షాలు కారణంగా కాలనీలకు కాలనీలు మురుగు నీటిలో మగ్గుతున్నాయి. రోజుల తరబడి నీరు ఇంటిలో నిలుస్తుండడంతో రోగాలు ముసురుతున్నాయి. విషజ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు. రోగులతో ప్రభుత్వాస్పత్రులు కిక్కురుస్తున్నాయి. వైద్యం సరిగా అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.  తాను మేధావినని చెప్పుకునే ముఖ్యమంత్రికి గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహించాలన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంపు గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయినా ప్రత్యామ్నాయం లేదు. విద్యుత్‌ సరఫరా లేక గ్రామాలు చిమ్మచీకట్లో ఉన్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హెల్త్‌క్యాంపులు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించి  వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాల్సింది పోయి... సొంత ప్రయోజనాల కోసం బాబు పాకులాడుతుండడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తోంది.

పదవి వ్యామోహం తప్ప.. ప్రజల బాధలే పట్టడం లేదు
బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఉన్న సమయాన్నంతా దోచుకోవడం దాచుకోవడంపైనే దృష్టిపెట్టారు. సంపాదన యావలో పడి అభివృద్ధిని గాలికొదిలేశారు. అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన ముఖ్యమంత్రి నిత్యం ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం.. కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకునేందుకు ముడుపులు సమర్పించుకోవడం..ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకు దిగడం లాంటి చర్యలతో అరాచక పాలన సాగిస్తున్నారు. కేసులు-కాసులే తప్ప బాబుకు ప్రజా ప్రయోజనాలే పట్టడం లేదని టీడీపీపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వరద ప్రాంత ప్రజలను ఆదుకునేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 


తాజా వీడియోలు

Back to Top