విద్యుత్ కోత, వాతలపై వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ కన్నెర్ర

హైదరాబాద్, 9 ఏప్రిల్‌ 2013:‌ నిరుపేదలు, సామాన్యుల మీద విపరీతమైన ఆర్థిక భారం మోపుతూ పెంచిన విద్యుత్ చార్జీలు‌, విద్యుత్‌ కోతలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా కాంగ్రెసేతర పార్టీలు మంగళవారం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ విజయవంతం అయింది. బంద్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. దుకాణాలు మూతపడ్డాయి. పెంచిన విద్యుత్ ‌చార్జీలు, కోతలకు నిరసనగా కాంగ్రెసేతర పక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు‌నకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. హైదరాబాద్ - ఎం‌జిబిఎస్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బస్సులను అడ్డుకోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, తిరుపతి, వరంగల్, కరీంనగ‌ర్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో బం‌ద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యాపారులు దుకాణాలు తెరవలేదు. పెంచిన విద్యుత్ ‌చార్జీలను వెంటనే తగ్గించాలని, సర్‌చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, విద్యుత్ కోత‌లు ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పలు చోట్ల ఆందోళనకు దిగిన ‌వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

కిరణ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల కారణంగా ప్రజల జీవనం దుర్భరంగా మారిపోయిందని బంద్‌లో పాల్గొన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. ప్రధానంగా విద్యుత్ రంగాన్ని‌ భ్రష్టు పట్టించిన ఘనత కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఇంధన సర్దుబాటు చార్జీలు, సర్‌చార్జీల పేరిట ఇప్పటికే రాష్ట్ర ప్రజలపై రూ.35 వేల కోట్ల మేర భారం మోపిందని, ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో రూ. 6,500 కోట్లు పెంచారని విమర్శించారు.

విద్యుత్ చార్జీల పెంపు‌నకు నిరసనగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ‌'కరెంట్ సత్యాగ్రహం' దీక్ష చేపడితే.. గృహావసరాలకు 200 యూనిట్లు లోపు పాత చార్జీలే ఉంటాయని చెప్పి కిరణ్‌ తప్పించుకునే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. చంద్రబాబు సలహాలతో పరిపాలన కొనసాగిస్తున్న కిరణ్‌ కుమార్ ‌ప్రభుత్వం కళ్లు తెరిచే వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని తెలిపారు.

పెంచిన విద్యుత్‌ చార్జీలు, కరెంటు కోతలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ శ్రేణులు హైదరాబాద్‌లోని ముంబాయి హైవేపై ఆందోళన చేశారు. కూకట్‌పల్లి ఆర్టీసీ డిపో ముందు వారు బైఠాయించారు. డిపో నుంచి బస్సులను బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అంతకు ముందు వారంతా కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు బస్సులను అడ్డుకున్నారు. దీనితో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అబిడ్సులో ఆందోళన చేస్తున్న వైయస్‌ఆర్‌‌ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు హెచ్‌ఎ రెహ్మాన్‌ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పంజాగుట్టలోని మహానేత వైయస్‌ విగ్రహానికి పార్టీ నాయకురాలు పి. విజయారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

తిరుపతిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అంధకారంగా మార్చిన ఘనత కిరణ్‌ కుమార్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యేలు భూమన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలపై కేవలం బంద్‌తో పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. పథకం ప్రకారమే మహానేత పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెదక్‌జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం, పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి, దుబ్బాక, మెదక్‌, సిద్దిపేట ఆర్టీసీ డిపోల వద్ద ఆందోళనలు జరిగాయి. సంగారెడ్డి కొత్త బస్‌స్టాండ్‌ వద్ద బైఠాయించిన పార్టీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, చంద్రబాబు, కిరణ్‌రెడ్డిలది ప్రజా వ్యతిరేక పాలన అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మండిపడ్డారు. మహానేత వైయస్‌ ఆనాడు తన పాదయాత్రతో ప్రభుత్వం మెడలు వంచారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో కరెంట్‌ చార్జీలపై రాష్ట్ర బంద్‌ నిర్వహించినట్లు చెప్పారు. అనంతపురం విద్యుత్‌ బంద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలోని గుంతకల్‌లో కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన బంద్‌ విజయవంతం అయింది. పార్టీ నాయకుడు వై. వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో మహానతే వైయస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో బంద్‌లో పాల్గొన్న పార్టీ మహిళలపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. బంద్‌లో పాల్గొన్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు.

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. సర్‌ చార్జీలతో పేద, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పార్టీ నాయకుల ఈ సందర్భంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, పిడుగురాళ్ళ, బాపట్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, రేపల్లె, గురజాల ఆర్టీసి బస్సు డిపోల వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. బస్సులను డిపోల నుంచి బయటికి రానివ్వలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విద్యుత్‌ సందర్భంగా నగరం బోసిపోయింది. బస్సులేవీ రోడ్డు మీదకు రాలేదు. విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా వైయస్‌ఆర్‌ జిల్లాలో బంద్‌ కారణంగా మొత్తం 8 డిపోలలోని 920 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్యకర్తలు డిపోల వద్దే బస్సులను అడ్డుకున్నారు. రాస్తారోకో నిర్వహించారు.

విద్యుత్‌ బంద్‌ సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, టిడిపి నాయకుడు కరణం వెంకటేశ్‌ వర్గాలు ఘర్షణకు దిగాయి. భవాని కూడలి వద్ద ఇరువర్గాలు ఎదురుపడినప్పుడు ద్విచక్ర వాహనాలను తోసుకోవడమే కాక ఒకరిపై ఒకరు స్వల్పంగా దాడులు చేసుకున్నారు. పాత బస్‌ స్టాండ్‌లో కూడా ఇదే మాదిరి ఘర్షణ జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ బంద్‌ ప్రశాంతంగా విజయవంతం అయింది.
Back to Top