విద్యుత్‌ కోతలపై వైయస్‌ఆర్‌సిపి కన్నెర్ర

హైదరాబాద్‌, 5 మార్చి 2013: రాష్ట్రంలో విధిస్తున్న అసాధారణ విద్యుత్‌ కోతలు, పెంచిన కరెంటు చార్జీలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారంనాడు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన ర్యాలీలు, లాంతర్లతో ప్రదర్శనలు నిర్వహించింది. విద్యుత్‌ కోతలతో అన్నదాతలనే కాకుండా అన్ని రంగాల ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పెంచిన విద్యుత్‌ చార్జీలు ఉపసంహరించాలని, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విద్యుత్‌ కోతలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లతో కలెక్టర్లకు మెమోరాండంలు వైయస్‌ఆర్‌సిపి నాయకులు సమర్పించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా కార్యాలయం వద్ద నిర్వహించిన మహా ధర్నాలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి శ్రీమతి షర్మిల పాల్గొని ప్రసంగించారు.

ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి:
ఆదిలాబాద్‌ :‌ అసాధారణ విద్యుత్ కోతలతో రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రజలను తీవ్రంగా అవస్థలు పెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు బి.జనక్‌ ప్రసాద్‌, ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌ బోడ జనార్దన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కరెంటు కోతలు, విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ సోమవారం ‌ఆదిలాబాద్ కలెక్టరే‌ట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని ఆర్అం‌డ్ ‌బి భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ‌ నిర్వహించారు.

ప్రభుత్వ పతనం తప్పదు:
అనంతపురం: రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనంతపురం వైయస్‌ఆర్‌సిపి నాయకులు హెచ్చరించారు. మహానేత వైయస్‌ఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ చార్జీ పెంచలేదని వారు గుర్తుచేశారు. ఆయన మరణానంతరం గద్దెనెక్కిన పాలకులు విద్యుద్‌ చార్జీలు పెంచేసినా డిమాండ్‌కు తగినట్లు కరెంటును సరఫరా చేయడంలేదని ధ్వజమెత్తారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద పార్టీ నిర్వహించిన ధర్నాకు జిల్లా కమిటీ కన్వీనర్‌ శంకరనారాయణ అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి: కోతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవార్డు ఇవ్వాలని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చిత్తూరు జిల్లా నాయకులు దుయ్యబట్టారు. కరెంటు కోతలకు నిరసనగా వైయస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు.

‘కోత’లపై కదం తొక్కిన వైయస్‌ఆర్‌సిపి:
కాకినాడ : విపరీతంగా పెరిగిన విద్యుత్ కోతలను నిరసిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట కదం తొక్కాయి. మండుటెండను లెక్కచేయకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. కోతలు ఎత్తివేయాలని, పెంచిన చార్జీలు ఉపసంహరించాలని కోరుతూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు తరలిరావడంతో కలెక్టరే‌ట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.‌

కాగడాల ప్రదర్శన : విద్యుత్ కోతల‌కు నిరసనగా వైయస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కాగడాల ప్రదర్శన చేశారు. కాగడాలు, కొవ్వొత్తులు, లాంతర్లతో మెయిన్ రోడ్డులో ర్యాలీ చేశారు. టూటౌ‌న్ పోలీ‌స్ స్టేష‌న్ నుంచి టౌ‌న్‌హాలు, సూపర్‌బజార్ మీదుగా బాలాజీ చెరువు సెంట‌ర్‌లోని మహానేత వైయస్‌ఆర్ కాంస్య విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది.

సత్తెనపల్లి ధర్నాకు పోటెత్తిన జనం:
సత్తెనపల్లి : పార్టీ నిర్వహించిన విద్యుత్‌ మహా ధర్నాకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు సత్తెనపల్లికి పోటెత్తారు. మహాధర్నాలో కదంతొక్కారు. మునుపెన్నడూ లేని విధంగా సత్తెనపల్లి రహదారులన్నీ జనంతో కిక్కిరిశాయి. ‌సత్తెనపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం మహాధర్నా నిర్వహించారు. వై‌యస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ,‌ శ్రీమతి షర్మిల ఈ ధర్నాలో పాల్గొన్నారు.

‘కోత’లపై మిన్నంటిన వైయస్‌ఆర్‌సిపి నిరసన :
ఖమ్మం : రాష్ట్రంలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్‌కోతలపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కన్నెర్ర చేసింది. ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తూ ఆందోళన బాటపట్టింది. కరెంట్ సమస్యల ‌వల్ల జనజీవనం అతలాకుతలం అవుతోందని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం వైయస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో కొవ్వొత్తులు, లాంతర్లతో ప్రదర్శనలు చేపట్టారు.

నినాదాలతో దద్దరిల్లిన ‌కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ : 
మచిలీపట్నం : విద్యుత్ కోతలపై జనం కన్నెర్ర చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై నిరసన గళం విప్పారు. మార్చి నెల ‌మొదట్లోనే విద్యుత్ కోతలు పెంచడంపై మండిపడ్డారు. విద్యు‌త్ కోత‌లు ఎత్తివేయాలని, సర్‌చార్జీలు పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మచిలీపట్నంలోని ‌కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద ‌నిర్వహించిన ధర్నా విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైయస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో కలెక్టరేట్ మార్మోగింది. మండే ఎండను సైతం లెక్కచేయకుండా మూడు గంటల‌ పాటు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.

‌సంగారెడ్డి : విద్యుత్ కోతలను నిరసిస్తూ సోమవారం మెదక్‌జిల్లా కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా, నెల్లూరులో విద్యుత్ కోతలకు నిరసనగా సోమవారం 11వ డివిజ‌న్‌లో వైయస్‌ఆర్‌సిపి కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించింది.
కరెంటు కోతలను నిరసిస్తూ వై‌యస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ కలెక్టరే‌ట్ వద్ద ధర్నా జరిగింది. రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, పరీక్షల సమయంలో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నందున కోతలను ఎత్తివేయాలని కలెక్టర్ క్రిస్టీనాకు పార్టీ ‌నాయకులు మెమోరాండం సమర్పించారు. అంతకు ముందు ధర్నా చౌక్ నుంచి ర్యాలీ నిర్వహించారు.

ఒంగోలు జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌సిపి నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్‌ పార్టీ వల్లే రాష్ట్రంలో చీకటి రోజులు దాపురించాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ కార్యాలయం వరకూ పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. అక్కడి నుంచి వారంతా కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్ళారు.

ఉద్యమాలతోనే పాలకులకు కనువిప్పు :
శ్రీకాకుళం : ఉద్యమాల ద్వారానే పాలకులకు కనువిప్పు కలిగించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌సిపి నిర్వహించిన విద్యుత్‌ మహా ధర్నాలో నాయకులు పిలుపునిచ్చారు. రైతులకు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. విద్యుత్‌ కోతల వల్ల పంటలు దెబ్బతిని రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం : విద్యుత్ కోతలు, పెంచిన విద్యు‌త్ చార్జీలు, స‌ర్ చార్జీలు వడ్డింపులపై వై‌యస్‌ఆర్‌సిపి ధ్వజమెత్తింది. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసనగా ర్యాలీ నిర్వహించింది.‌ సోమవారం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కిరోసి‌న్ లాంతర్లు, కొవ్వొత్తు‌లతో నిరసన తెలిపారు. బీచ్‌రోడ్డు కాళికామాత ఆలయం నుంచి కిర్లంపూడి లే అవుట్‌లో ఉన్న మహానేత వైయస్‌ఆర్ విగ్రహం వరకు ర్యాలీ ‌నిర్వహించారు. పాండురంగాపురం సమీపంలో రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు.

విద్యుత్ కోతలు ఆపాలని, పెంచిన విద్యు‌త్ చార్జీ‌లు ఉపసంహరించాలని కోరుతూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరె‌న్సు హాల్‌లో జిల్లా రెవెన్యూ అధికారి పి.శేషాద్రికి పార్టీ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు.

గతంలో ఇంత దారుణంగా విద్యుత్ కోతలు లేవు: 
ఏలూరు : ‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇంత దారుణంగా విద్యుత్ కోతలు ఎప్పుడూ విధించ లేదు. పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతున్నారు. చదువులు సాగక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రులలో ఆపరేషన్లు కూడా చేయలేని దుస్థితి దాపురించింది. చిన్నపాటి వ్యాపారాలే కాదు.. పరిశ్రమలు కూడా‌ మూత పడుతున్నాయి. పనుల్లేక కూలీలు పస్తులుంటున్నారు. కరెంటు కోతల వల్ల ఇలాంటి దారుణ పరిస్థితులు అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంద’ని వైయస్‌ఆర్‌సిపి పశ్చిమగోదావరి జిల్లా నాయకులు ధ్వజమెత్తారు. కరెంటు కోతలను నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ సిపి నాయకులు ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. విద్యుత్‌ కోతలు నిలిపివేయాలని, పెంచిన చార్జీలు ఉపసంహరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Back to Top