వెంకన్నకు బాబు నామం

కలియుగ దైవంగా
కొనియాడబడే వెంకటేశ్వరుడికే నామం పెట్టాడంటే సామాన్యుడు కాదు. ఎవరనుకుంటున్నారు. ఇంకెవరండీ
మన రాష్ర్ట ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుగారు. వడ్డీల మీద వడ్డీలు కడుతున్న వడ్డీకాసుల
వాడి సొమ్ముపై ఇపుడే కాదు గతంలోనూ చంద్రబాబు కన్నేశాడు. అపుడు కూడా 100 కోట్ల
రూపాయలకు టెండర్ పెట్టాడు. కానీ అప్పట్లో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గాడు. ఇపుడు
ఏకంగా జీవోనే జారీ చేసేశారు. తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రు.25
కోట్లను కైంకర్యం చేసేశారు. లోటుతో విలవిల్లాడుతున్న రాష్ర్టం కనుక తిరుమల తిరుపతి
దేవస్థానాలు(టీటీడీ) నుంచి రు. 100 కోట్లను రాష్ర్ట ఖజానాకు జమ
చేయాలని, వాటిని రాష్ర్టంలోని వివిధ దేవాలయాలలో పనిచేస్తున్న
ఉద్యోగులు, అర్చకుల జీత భత్యాలకు వినియోగిస్తామని ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఇటీవలే ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోను అనుసరించి టీటీడీ తొలి ఇన్‌స్టాల్‌మెంట్
25 కోట్ల రూపాయలను రాష్ర్ట ప్రభుత్వ ఖజానాకు జమచేసింది. ఈ విషయాన్ని
చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కూడా ధృవీకరించారు. 25 కోట్లు
అందాయని, మిగిలినవి కూడా త్వరలో అందుతాయని భావిస్తున్నామని ఆయన
చెప్పారు. అర్చకుల జీతాల కోసమే ఆ డబ్బు తాము తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అర్చకులు
ఇపుడు నెలకు వెయ్యిరూపాయలే వేతనంగా పొందుతున్నారని, టీటీడీ డబ్బు
అందిన తర్వాత వారి జీతాలను నెలకు రెండువేల రూపాయలు చేద్దామనుకుంటున్నామని కృష్ణారావు
చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై సామాజికవేత్తలు, హిందూ
ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని
అవి హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జీవో నెంబర్ 335 జారీ చేసింది. రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసే
కార్పస్ ఫండ్‌కు టీటీడీ రు.50 కోట్లు ఇన్‌స్టాల్‌మెంట్ కింద జమ
చేయాలని అందులో పేర్కొన్నారు. ఆ డబ్బును 2015-16 ఆర్థిక సంవత్సరంలో
అర్చకులకు, ఇతర దేవాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి ఉపయోగిస్తారని
పేర్కొన్నారు. దేవాలయాల ఉద్యోగులు, అర్చకుల వేతనాలు తక్కువగా
ఉన్నాయని వాటిని పెంచాలని పేర్కొంటూ రు.250 కోట్లతో కార్పస్ ఫండ్
ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆ జీవోలో ప్రస్తావించారు. అందులో 100 కోట్ల రూపాయలను టీటీడీ సమకూర్చుతుందని మిగిలిన మొత్తాన్ని ఆర్థిక శాఖ జమ చేస్తుందని
పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉంచాలని,
పూజారుల, ఆలయ ఉద్యోగుల జీతా పెంపు పథకాన్ని దశలవారీగా
అమలు చేయాలని జీవోలో ప్రస్తావించారు.

      చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను తిరుపతికి చెందిన సామాజిక వేత్త మంగతి
గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ జోవో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్
చట్టం 111 సెక్షన్‌ను అతిక్రమిస్తోందని ఆయన రిట్‌పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఖాతాలోకి టీటీడీ నిధులను ఎలా మళ్లిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై
రెండువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు రాష్ర్టప్రభుత్వానికి నోటీసులు
జారీ చేసింది.

      అర్చకులు, ఆలయ సిబ్బంది జీత భత్యాల కోసం టీటీడీ నిధులను
సమీకరించాలన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని విశాఖ శారదా పీఠం అధిపతి
స్వామి స్వరూపానంద వ్యాఖ్యానించారు. టీటీడీ నిధులు ధార్మిక ప్రచారాలు, సంబంధిత కార్యకలాపాలకు మాత్రమే వినియోగించేందుకు ఉద్దేశించనవని అన్నారు. జీతాలివ్వడమనేది
ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

Back to Top