వెంటనడిచిన జన సందోహం

విజయవాడ, 29 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరరెడ్డి  తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల నిర్వహిస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో జనం వెల్లువెత్తారు. ప్రజాహితమే ఈ యాత్ర అభిమతమని చాటారు. సర్వమత సామరస్యత, జన సంక్షేమమే తన గమ్యం, గమనం అని నిరూపించారు.  ఆమెకు స్వాగతం పలికేందుకు, తమ సమస్యలు చెప్పేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో కదలివచ్చారు. వికలాంగులు, వృద్ధులు కూడా యాత్ర వెంట నడవగా సెంట్రల్, తూర్పు శాసనసభ నియోజకవర్గాల్లో శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగింది. మండుటెండను లెక్కచేయకుండా జనం బాధలు, ఇబ్బందులు తెలుసుకుంటూ.. వారిని ఓదార్చుతూ.. భవిష్యత్తు మనదేనని ధైర్యం చెబుతూ షర్మిల ముందుకు సాగారు.
సర్వమత సమ్మేళనం: గురువారం యాత్ర ప్రారంభానికి ముందుగా జింఖానా మైదానంలో హిందూ మత సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకలశంతో ఆమెకు దీవెనలు అందించారు. ఆ తర్వాత లెనిన్ సెంటర్‌లో క్రైస్తవ మతాచారం ప్రకారం ఫాదర్‌లు ప్రార్థనలు చేశారు. యాత్ర కొద్దిదూరం వెళ్లేసరికి ముస్లిం మత పెద్దలు షర్మిలకు ఎదురొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
లాయర్ల సంఘీభావం: వైయస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ నగర విభాగం లాయర్ల బృందం పాదయాత్రకు సంఘీభావం తెలిపింది. బీసెంట్‌రోడ్‌లోని మహానేత డాక్టర్ వైయస్ విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాల వేసి  అంజలి ఘటించారు. అనంతరం సీతారామపురంలోని అన్నదాన సమాజం రోడ్డులో ఉన్న వంగవీటి మోహన్‌రంగా విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఎంబీబీఎస్‌లో డాక్టర్ వైయస్‌కు జూనియర్, పట్టణానికి చెందిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి పాదయాత్రలో శ్రీమతి షర్మిలను కలసి అభినందనలు తెలిపారు. ‘నాన్నలా పట్టుదలగా ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నావు’ అంటూ ప్రశంసించారు. జింఖానా మైదానం నుంచి మొదలైన పాదయాత్ర రామాటాకీస్, అలంకార్ థియేటర్, వినోదా టాకీస్, అరండల్‌పేట, సీతారామపురం, చుట్టుగుంట, మెట్రోసెంటర్, శిఖామణి సెంటర్, బందరురోడ్డు, రాణిగారితోట, బాలాజీనగర్, పూర్ణచంద్ర నగర్, రామలింగేశ్వరనగర్, పడమటలంక వరకు సాగింది. బాలాజీ నగర్‌కు చెందిన బిల్డర్ నరకుటి మురళీకృష్ణ, కాంగ్రెస్‌కు చెందిన జి. వెంకటేశ్వర రాజు, మల్లాది శివసాయి, తోట శ్యాంసుందర్, డిఎం ప్రశాంతి, కేబుల్ వలి, అమ్ముల రవికుమార్, ఎ.సోమేంద్రనాథ్ తదితరులు పార్టీలో చేరారు.
వెంట నడిచిన నేతలు: ఈ యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నగర కనీన్వర్ జలీల్‌ఖాన్, పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త  తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, నేతలు ముదునూరి ప్రసాదరాజు, ముసునూరి రత్నబోసు, దూలం నాగేశ్వరరావు, ఉప్పాల రామ ప్రసాద్, ఉప్పాల రాము, జ్యేష్ఠ రమేష్‌బాబు, మేకా ప్రతాప్ అప్పారావు, వాసిరెడ్డి పద్మ, తాడి శకుంతల, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, చందన సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top