అధికార గర్వం

()ఏపీలో పడకేసిన పాలన
()రాజ్యమేలుతోన్న అవినీతి, అక్రమాలు
()అంధకారంలో ప్రజల భవిష్యత్తు

ఏపీలో రాజ్యాంగ విలువలు మంటగలిశాయి. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు సాగిస్తున్నఅరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇతర పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలు, బెదిరింపులతో టీడీపీ కండువాలు కప్పడం, అడ్డదారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బలం లేని చోట పోలీసు జులుంతో ప్రతిపక్ష నేతలపై దౌర్జన్యాలకు పాల్పడడాన్ని చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది.  చంద్రబాబు సర్కార్ బరితెగింపు రాజకీయాలపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు.   

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి, అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన సాగిస్తూ చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. ఎక్కడ కూడ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన దాఖలాలు లేవు. అంతా టీడీపీ మాఫియానే రాజ్యమేలుతోంది. బడుగు, బలహీన, అణగారిన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ప్రజాసమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ముఖ్యమంత్రి మొదలు కార్యకర్త దాక దొరికిందల్లా దోచేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా నీకింత బెల్లం నాకింత బెల్లం అంటూ సర్వం భక్షిస్తున్నారు. 

ప్రభుత్వ అవినీతి, అన్యాయాలను ప్రశ్నించిన వారిపై పోలీసులను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై వివక్ష చూపుతూ, ఓడిపోయిన టీడీపీ నేతల పేరున జీవోలు విడుదల చేస్తూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తున్నారు.టీడీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయని,  అభివృద్ధి అన్నది మచ్చుకు కూడ కానరావడం లేదని ప్రజాసంఘాలు, మేధావులు ఆరోపిస్తున్నారు. మాయమాటలతో నమ్మించి ప్రజలను వంచించిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. 
Back to Top