వంశధార రైతు కంట కన్నీటి ధార

– నిర్వాసితులకు దక్కని ప్రభుత్వ సాయం
– అపరిష్కృతంగా పునరావాసం, పరిహారం 
– అమలుకాని భూ సేకరణం చట్టం–2013
– యూత్‌ ప్యాకేజీతో చేతులు దులిపేసుకుంటున్న ప్రభుత్వం

      వ్యవసాయ ప్రాజెక్టులను పూర్తి చేయడంలోనే అలసత్వం ప్రదర్శిస్తున్న చంద్రబాబు సర్కారు నిర్వాసితులకు పరిహారం అందించడంలోనూ చిత్తశుద్ధి చూపడం లేదు. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది.  నిర్వాసిత గ్రామాలకు భూ సేకరణ చట్టం–2013 వర్తింపజేయడం లేదు. పునరావాసం, పరిహారంలోనూ వారి పట్ల వివక్షే కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులకు ఒక చట్టం, వీరికి మరో చట్టం అధికారులు అమలు చేస్తూ.. ప్రభుత్వం వృత్తి ప్యాకేజీల మాటే ఎత్తడం లేదు. 

పన్నెండేళ్లుగా ఎదురుచూపులు
శ్రీకాకుళం జిల్లాలో 45 వేల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీరందించడం, 2,10,510 ఎకరాల స్థిరీకరణ లక్ష్యంతో వంశధార ప్రాజెక్టు ఫేజ్‌–2, స్టేజ్‌–2 పనులు 2005లో ప్రారంభమయ్యాయి. హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల పరిధిలోని 20 గ్రామాలను ప్రాజెక్టు తరలింపు గ్రామాలు (ప్రాజెక్టు డిస్‌ప్లేస్‌డ్‌ విలేజెస్‌–పిడిఎఫ్‌) గా ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో హిర మండలం మండలంలో 13 గ్రామాలు, కొత్తూరు మండలంలో ఆరు, ఎల్‌ఎన్‌పేటలో ఒక గ్రామం ఉన్నాయి. వీటి పరిధిలో 7,104 కుటుంబాలను నిర్వాసిత కుటుంబాలుగా ప్రకటించింది. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు తీసుకున్న ప్రభుత్వం ఎకరాకి రూ.1.30 లక్షల చొప్పున మాత్రమే పరిహారం చెల్లించింది. భూ సేకరణ చట్టం–2013 ప్రకారం ప్రస్తుత ధరల కనుగుణంగా పునరావాసం, పరిహారం చెల్లించాలని వారు చేస్తున్న డిమాండ్‌ అరణ్య రోదనగానే మిగిలింది.

నివాసయోగ్యంగాలేని పునరావాస కాలనీలు
కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల పరిధిలో ప్రభుత్వం 20 చోట్ల పునరావాస కాలనీలను నిర్మించి, నిర్వాసిత కుటుంబాలను అక్కడికి తరలించాలని నిర్ణయించింది. రాళ్లు రప్పలతో కూడిన నివాసయోగ్యంగా లేని ప్రాంతాలను పునరావాస కాలనీలకు ఎంపిక చేసింది. నిర్వాసిత కుటుంబాల్లో నేటికీ వేలాది మందికి ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వలేదు. పునరావాస కాలనీలు నిర్మించిన చోట మౌలిక వసతులు కల్పించలేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభం నాటికి నిర్వాసిత కాలనీలు ఎలా ఉన్నాయో పన్నెండేళ్ల తరువాత కూడా ఈ పరిస్థితులు అలానే ఉన్నాయి. ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస, సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస కాలనీలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

వంశధార నిర్వాసితులపై సవతి తల్లి ప్రేమ 
వంశధార నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తుంది. భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసిత కుటుంబానికి ఐదు సెంట్ల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి డబ్బులు చెల్లించాలి. అప్పట్లో ఇళ్ల స్థలాలను తిరస్కరించిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం ఇంటి స్థలానికి రూ.4.47 లక్షలు, ఇంటి నిర్మాణానికి రూ.53 వేలు చొప్పున మొత్తం రూ.ఐదు లక్షలు చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. పోలవరం, ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులకు ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.3.25 లక్షలను కూడా ఇస్తోంది. వంశధార నిర్వాసిత కుటుంబాలపై మాత్రం వివక్ష చూపుతోంది. నివాసయోగ్యంగా లేని ప్రాంతాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలను తిరస్కరించి గ్రామాల్లోనే ఉంటున్న నిర్వాసితులను ఇప్పుడు అక్కడి నుంచి బలవంతంగా వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

దళితుల పరిస్థితి అత్యంత దుర్భరం 
నిర్వాసిత గ్రామాల్లోని దళితుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. మొత్తం 20 నిర్వాసిత గ్రామాల్లో సుమారు 1600 మంది దళితులున్నారు. వీరంతా కూలీనాలీ చేసుకుంటూ బతుకుతున్నారు. వీరిలో 98 శాతం మంది భూమి లేని నిరుపేదలే. వారి ఇళ్లకు వచ్చిన పరిహారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పూరిల్లు, పాకల్లో నివసిస్తుండటంతో వారికి రూ 16 వేలు, 20 వేలుకు మించి ఇవ్వలేదు. ఒకరిద్దరికి ఇంటి స్థలాలకు పట్టాలిచ్చినా ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Back to Top