వైయస్ పాదయాత్ర చరిత్రలో మరపురాని ఘట్టం

– నిప్పులు కురిసే ఎండలో 68 రోజుల పాటు నడక
– 11 జిల్లాల్లో.. 56 నియోజకవర్గాల్లో ప్రయాణం
– రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించి...
_ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగింపు

రైతు బాంధవుడు, అపర భగీరథుడు, పేదల పెన్నిధి ఇలా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి వారి కోసం నిరంతరం పోరాడి, ప్రయోజనం చేకూర్చిన మహానుభావుడు. అందుకే ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారు. తెలుగు ప్రజలు బతికున్నంత కాలం వైయస్సార్ బతికే ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఓ సంచలనం.  ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ మండుటెండను సైతం లెక్కచేయకుండా వేల కి.మీ. నడిచారు. వైయస్ఆర్ పాదయాత్ర పద్నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కథనం....

ప్రజల మదిలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అనగానే గుర్తుకొచ్చేవి.. తెలుగు ఠీవి ఉట్టిపడేలా పంచెకట్టు.. చిరునవ్వుతో ఆప్యాయ పలకరింపు. నమ్మిన వాళ్ల కోసం ఏమైనా చేసే తెగింపు. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా మడమతిప్పని నైజం. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించింది ఐదేళ్లే అయినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఇదంతా ఆయనకు ఒక్కరోజులో వచ్చి పడిన అదృష్టం కాదు. దాదాపు పాతికేళ్లకు పైగా పార్టీ కోసం నిజాయతీగా చేసిన కృషికి జరిగిన పట్టాభిషేకం. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేయడమే ఆయన్ను జనం గుండెల్లో చిరకాలం నిలిచిపోయేలా చేసింది. అధికారం కోసమో.. ముఖ్యమంత్రి కావాలన్న ఆశయంతోకాక పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న కోరికే మహానేతను ప్రజలకు చేరువ చేసింది. ప్రతిఒక్కరూ ఆయన్ను తమ సొంత మనిషిగా అక్కున చేర్చుకోవడం.. ప్రజలతో ఆయన వ్యవహరించే తీరే కారణం. సామాన్య ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడంలో ఆయన పడిన కష్టం.. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం వైయస్‌ఆర్‌ చేసిన శ్రమ మరెవరూ చేసుండరని చెప్పడం అతిశయోక్తి కాదు. 

నవ్విస్తూ బతికిన మహానుభావుడు
2004 ఎన్నికలకు ముందు దాదాపు ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి తన పాదయాత్ర ద్వారా ఊపిరిలూది అధికార పీటంపై కూర్చోబెట్టిన ఘనత ముమ్మాటికీ వైయస్‌ఆర్‌దేనని ఒప్పుకోక తప్పని వాస్తవం. మనకోసం పోరాడే ఒక వ్యక్తిని జనం ఎంతలా ఆరాధిస్తారో చెప్పాలంటే ఆ రాజశేఖరుడికి ఉన్న అభిమాన గణాన్ని చూస్తేనే తెలుస్తుంది. ప్రత్యర్థులు కూడా ఈర్ష్యపడేలా.. నిత్యం నిండైన చిరునవ్వుతో.. అందమైన పంచెకట్టులో నవ్వుతూ.. నవ్విస్తూ బతికిన మహామనిషి. అధికారంలో ఉంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వైయస్‌ఆర్‌ ఐదేళ్ల పాలన చూస్తే తెలిసిపోతుంది. ఆశయం గొప్పదైతే సముద్రం కూడా దారిస్తుందని చెప్పడానికి ఆయన పాలనే ఉదాహరణ. ఆయన అధికారంలోకి రాకముందు తొమ్మిదేళ్లు తీవ్ర కరువుతో అల్లాడిన ఆంధ్రా ప్రజలకు ఒక్కసారిగా నిండైన వర్షాలతో ప్రకృతి నుంచి కూడా అద్వితీయ స్వాగతం లభించింది. మా ప్రభుత్వంలో వరుణ దేవుడున్నాడని పలుమార్లు ఆయన గర్వంగా చెప్పుకున్నాడంటే మామూలు విషయం కాదు. ఇదంతా ఆయన పడిన కష్టానికి.. ప్రజల కోసం చేస్తున్న శ్రమకు.. వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నానికి కరువు కూడా తలొంచి సలాం చేసింది. వైయస్‌ఆర్‌ ఉన్న చోట నేనుండలేనని పలాయనం చిత్తగించింది. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి 2004లో సీఎం అయ్యేవరకు ఇరవై ఆరేళ్ల ప్రస్థానంలో ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు సామాన్యమైనవి కావు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పది కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడంటే ఆయనకు ప్రజా సమస్యల పట్ల ఉన్న అవగాహన.. ఆ సమస్యల నుంచి వారిని దూరం చేయాలన్న అంకితభావంతో చేసిన కృషే కారణం. 2003 ఏప్రిల్‌ 9న సరిగ్గా పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆంద్రప్రదేశ్‌ చరిత్రలో అదో మైలురాయిగా చెప్పకోవచ్చు. 11 జిల్లాల పరిధిలో 1470 కిమీల మేర నాలుక పిడస కట్టుకుపోయే ఎండలో ఆయన చేసిన పాదయాత్ర నిజంగా నిరుపమానం. నిప్పుల కురిసే ఎండలో చిరునవ్వుతో ప్రజల్ని పలకరిస్తూ సాగిన ఆయన పాదయాత్ర ప్రజలకు ఏదో చేయాలన్న ఉక్కు సంకల్పానికి పరాకాష్ట. 

తెలంగాణలోనే అత్యధిక భాగం పాదయాత్ర 
 2003 ఏప్రిల్‌ 9వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయనకు నీరాజనం పలికారు. మొదటి రోజు నుంచి మొదలుపెడితే చివరి అడుగు వరకు లక్ష్యాన్ని చేరుకోవడంలో చెక్కుచెదరని విశ్వాసమే ఆయన్ను నడిపించింది. తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయన పాదయాత్ర అత్యధిక భాగం పీపుల్స్‌వార్‌తోపాటు వివిధ నక్సలైట్‌ గ్రూపులకు కంచుకోటల వంటి మార్గంలో సాగింది. ప్రజాప్రతినిధులు కొన్ని దశాబ్దాలుగా అడుగుపెట్టని గ్రామాలకు వెళ్లడమే కాదు.. రాత్రుళ్లు అక్కడే గుడారాలు వేసుకుని బస చేశారు. తెలంగాణ ప్రజల అభిమానం తనను పులకరింప జేసిందని పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టబోయేముందు వైయస్‌ఆర్‌ చెప్పడం ఆయనకు రెండు ప్రాంతాలు ఒక్కటేనని చెప్పకనే చెప్పాయి. 

ప్రాణాలు తీసే వడగాలుల్లో గోదావరి జిల్లాలోకి ప్రవేశం
తెలంగాణ కంటే భిన్నమైన వాతావరణంలో ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. ప్రాణాలు తీసే వడగాలులను కూడా లెక్కచేయకుండా ఆ మహానేత తన పాదయాత్ర జరిపారు. సుమారు 30 వేల మంది ప్రజలతో చారిత్రాత్మకమైన గోదావరి రోడ్‌ కం రైలు వంతెనపై వైయస్‌ఆర్‌ చేసిన యాత్ర అపూర్వమైనది. తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైనా కేవలం ఐదే రోజుల విశ్రాంతి అనంతరం తన పాదయాత్ర ప్రస్థానాన్ని కొనసాగించారు. చికిత్స కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరాల్సిందేనని వైద్యులు పట్టుబట్టినా వినకుండా గుడారంలోనే విశ్రాంతి తీసుకుని ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్రకు ఆయన ప్రస్థానం కొనసాగింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా శ్రీకాకుళం, జిల్లాలోని ఒరిస్సా సరిహద్దులలో ఉన్న ఇచ్ఛాపురం వద్ద పాదయాత్ర ముగిసింది. ప్రజా సమస్యలపై ఇంత కష్టసాధ్యమైన కార్యక్రమం చేపట్టిన నాయకులు గతంలో ఎవరూ లేరు. 

మొత్తం 68 రోజులు.. 11 జిల్లాలు.. 1470 కిమీలు.. 56 నియోజకవర్గాలు

తొలివారం: 2003 ఏప్రిల్‌ 9 నుంచి 15 వరకు.. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో 159 కి.మీ.
రెండోవారం: ఏప్రిల్‌ 16 నుంచి 22 వరకు.. మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో 159 కి.మీ.
మూడోవారం: ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు.. నిజామాబాద్‌ జిల్లాలో 181 కి.మీ.
నాలుగోవారం: ఏప్రిల్‌ 30 నుంచి మే 6 వరకు కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో 170 కి.మీ. 
ఐదోవారం: మే 7 నుంచి 13 వరకు ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 166 
ఆరోపవారం: మే 14 నుంచి మే 20 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో 103 
ఏడో వారం: మే 21 నుంచి 27 వరకు తూర్పుగోదావరి జిల్లాలో 95 కి.మీ.
ఎనిమిదో వారం: మే 28 నుంచి జూన్‌ 3 వరకు తూగో, విశాఖ జిల్లాల్లో 156.6
తొమ్మిదో వారం: జూన్‌ 4 నుంచి 10 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో.. 166 
పదో వారం: జూన్‌ 11 నుంచి 15 వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగింపు 

తాజా వీడియోలు

Back to Top