నిరుద్యోగ భృతి.. ఎక్స్ పైరీ బిస్కెట్‌


– షరతులు, నిబంధనల పేరుతో లబ్ధిదారుల కుదింపు
– విధివిధానాలు రూపొందిస్తామని కాలం వెళ్లదీత 
– పాత బకాయిలు వెంకన్న హుండీకేనా..
– వెయ్యి రూపాయలతోనే సరిపెట్టే యోచనలో ప్రభుత్వం 

ఎన్నికల వేళ నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం జనాలకు ‘ఎక్సపయిరీ బిస్కెట్‌’ వేయడానికి విధివిధానాల రూపకల్పనకు సిద్ధమైంది. షరా మామూలుగానే చంద్రబాబు ప్రజా సాధికార సర్వే పేరుతో నిబంధనాలు వేసి లబ్ధిదారులను తగ్గించడానికి కసరత్తు ప్రారంభించారు. రుణమాఫీ పేరుతో లబ్ధిదారుల సంఖ్యను 87 లక్షల నుంచి 20 లక్షలకు ఏవిధంగానైతే తగ్గించారో ఇప్పుడూ.. నిరుద్యోగుల సంఖ్యను కేవలం పది లక్షల మందిగా సర్కారు నిర్ణయించడం చేతులు దులిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని అర్థమవుతున్నది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రెండు వేల చొప్పున నిరుద్యోగ భృతి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంత మంది ఉన్నా అందరికీ ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం చేయూతనిస్తుందని ప్రగల్భాలు పలికారు. ఇప్పటికే నాలుగేళ్లు గడిచి పోయాయి. (జూన్‌ 8 నాటికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు) ఇప్పటికీ నిరుద్యోగ భృతి మీద సర్కారు నిర్ణయం తీసుకోలేదు. గడిచిన 48 నెలలకు గాను నెలకు రెండు వేల చొప్పున ఒక్కో నిరుద్యోగికి రూ. 96 వేల బకాయి పడింది ప్రభుత్వం. సగటున ఏడాదికి పది లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్, పీజీ పూర్తి చేసుకుంటున్నారని అనుకున్నా.. ఈ నాలుగేళ్లలోనే 40 లక్షలకు పైగానే నిరుద్యోగులు ఉన్నారు. 2014కు ముందున్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఆ సంఖ్య 50 లక్షలకు మించిపోతుంది.  గడిచిన మూడు బడ్జెట్‌లలో నిరుద్యోగ భృతికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు కూడా చేయలేదు. గత బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించినా అది ఎంతమాత్రం సరిపోదని ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రికి తెలియనిది కాదు. తాజాగా ప్రభుత్వ పెద్దలు ప్రెస్‌ మీట్‌ పెట్టి నిరుద్యోగ భృతి ఇస్తున్నామని ప్రజల్లో ఆశ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది ఎప్పుడిస్తారో మాత్రం ప్రకటించలేదు. దానికి తోడు ఎన్నికలకు ముందు రెండు వేలు ఇస్తామని ప్రకటించి దానిని ఇప్పుడు సగానికి తగ్గించి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని చావు కబురు సల్లగా చెప్పారు. మరో కీలక విషయం... నిరుద్యోగుల సంఖ్యను కేవలం పది లక్షల మందిగా నిర్ణయించి మమ అనిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ లెక్కన చూసుకుంటే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు నిరుద్యోగులుంటే మాత్రం వారికి మొండి చేయి తప్పదనిపిస్తుంది. అన్నింటికీ మించి ఈ స్కీమ్‌ను ఎప్పట్నుంచి ప్రవేశబెట్టబోతున్నదీ ఇప్పటికీ స్పష్టంగా ప్రకటించలేదు. విధివిధానాల రూపకల్పన పేరుతో ఎన్నికలకు ముందు చివరి ఐదారు నెలలు ఇచ్చేలా కసరత్తు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వయసు నిబంధన చాలా మంది నిరుద్యోగులను ఆ లబ్దిదారుల జాబితాలో చేరకుండా అడ్డుపడుతోంది. ప్రభుత్వం 22 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల వరకు మాత్రమే ఉన్న నిరుద్యోగులను అర్హులుగా ప్రకటించింది. వీటితోపాటు ఇంకా ఎలాంటి షరతులు విధించి వడపోత పడతారో వేచి చూడాలి. ఏదేమైనా అడ్డమైన నిబంధనలు, షరతులు విధించి వీలైనంత ఎక్కువ మందిని వడపోత పోసి జాబితాను పది లక్షలకు మించకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. అంటే 50 లక్షలు మంది నిరుద్యోగులు ఉన్నారనుకుంటే కేవలం పది లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిచింది. అంటే కేవలం 20 శాతం మందికే ఇస్తారన్నమాట. నిజానికి ఏపీలో మొత్తం 1.70 కోట్ల కుటుంబాలున్నాయి. అంటే ప్రభుత్వం విధించిన అన్ని షరతులకు లోబడి లెక్కలేసుకున్నా నిరుద్యోగుల సంఖ్య 50 లక్షలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గే అవకాశమే ఉండదు. ఏ లెక్కన తీసుకున్న ప్రభుత్వం 20 శాతానికి మించి నిరుద్యోగులను పరిగణలోకి తీసుకోదు. ఆ శాతం కూడా టీడీపీ నాయకుల కుటుంబాల వారికే సరిపోతుంది. మిగతా వారికి మొండి చేయి తప్పదు. 

పథకంపై సందేహాలు...
– నిరుద్యోగ భృతి పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు
– పాత బకాయిలు కూడా చెల్లిస్తారా.. అమల్లోకి వచ్చిన నాటి నుంచే చెల్లిస్తారా 
– కుటుంబంలో ఒక్కరికే ఇస్తారా.. ఎంతమంది లబ్ధిదారులున్నా అమలు చేస్తారా
– నిరుద్యోగుల తల్లిదండ్రులు ఏవైనా పింఛన్లు అందుకుంటున్నా భృతి ఉంటుందా..?

 
Back to Top