నిరుద్యోగ యువతకేది భరోసా..?

– ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్న చంద్రబాబు
– రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం
– నిరుద్యోగ భృతిపై మూడేళ్లుగా నాన్చుడే
– ఫీజుల దోపిడీతో వేధిస్తున్న విద్యాసంస్థలు 

చదువుకొందామంటే డబ్బులుండవు.. చదువుకొన్నాక ఉద్యోగాలుండవు. సీఎం మాటల్లో నిజాయతీ ఉండదు.. చెప్పింది చేస్తాడని నమ్మకముండదు. ఇదీ ఏపీలో నిరుద్యోగ యువత పడుతున్న బాధ. ఏరు దాటేటప్పుడు ఏటి మల్లన్న, దాటిన తరువాత బోడి మల్లన్న అనే తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో తాము అధికారంలోకి వస్తే యువజన విధానాన్ని తీసుకువస్తామని ప్రకటించిన చంద్రబాబు బాబొస్తే..జాబొస్తుంది అంటూ అప్పట్లో ఊదరగొట్టారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు  నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బాబు ప్రకటించారు. తెలుగుదేశం అధికారంలోకి రావడానికి అనేక కారణాల్లో నిరుద్యోగ భృతి కూడా ఒకటి.  అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ ఊసే మరిచారు. యువజన విధానానికి ఇంతవరకు అతీగతీ లేదు. మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఒక వ్యూహం ప్రకారం నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఎప్పటికి తుది రూపం ఇస్తారో తెలియదు. ఇది కూడా మరో ఎన్నికల పథకంగానే మారనుందనే వార్తలు వస్తున్నాయి. 

ఏ దేశాభివృద్ధికైనా యువతే కీలకం..! శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం కూడా తోడైతే అద్భుతాలు సాధించడంలో యువజనులు ఎప్పుడూ ముందుంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన ఆవిష్కరణలతో వేగుచుక్కలవుతారు. సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. భావి తరాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఏ ప్రభుత్వాలైనా యువత అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాయి. మన రాష్ట్రంలో మాత్రం దానికి భిన్నంగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

ఏపీలో నిరుద్యోగ యువత జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మీకోసమే అహర్నిశలు కష్టపడుతున్నానని నిరంతరం ఢంకా బజాయిస్తున్న చంద్రబాబు ఈ మూడేళ్లలో వారి కోసం ఏం చేశారో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే. ఏటికేడాది నిరుద్యోగుల సంఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పొంతన లేకుండాపోతోంది. ఫలితంగా యువతలో అసంతృప్తి, అసహనం పెరుగుతోంది. 

నిరుద్యోగులకు ఊరడింపునిచ్చి, వారి మానసిక స్థైర్యం పెంపుదలకు ఉపయోగపడాల్సిన పథకాన్ని కూడా ఓట్ల దృష్టిలోనే ప్రభుత్వ పెద్దలు చూస్తుండటం విచారకరం. రాష్ట్ర సర్కారు సేకరించిన లెక్కల ప్రకారం ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజ్ లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 8.88 లక్షలు! ప్రాధికార సర్వే వివరాల ప్రకారం 15 నుండి 35 సంవత్సరాలున్న నిరుద్యోగులు 33.70 లక్షలు! నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానూ ఉండవచ్చు! 

యువతకు నైపుణ్య శిక్షణ అని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతున్నాయి. కానీ, ఉన్నత స్థాయి నైపుణ్య పెంపు కోసం అందుతున్న శిక్షణ మాత్రం శూన్యం. ఒక అంచనా ప్రకారం దాదాపు 10 లక్షల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్‌ పట్ల, యువజనుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ తరహా నాన్చుడు విధానాలకు స్వస్తి పలకాలి. తక్షణమే యువజన విధానాన్ని ప్రకటించి, ఉద్యోగాలు భర్తీ చేయాలి. యువత భవిత బాగుపరచడానికి బదులుగా ప్రభుత్వ పెద్దలు మద్యంను ఏరులై పారించే ’మందు’ చూపుతో వ్యవహరించడం దేనికి సంకేతం? నిర్వీర్యమైన యువతను మత్తులో ముంచి, అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని భావించడమే పరిపాలనా దక్షతా? పాలనానుభవమా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు. 

తాజా ఫోటోలు

Back to Top