టిటిడి టిడిపి సొంత సొత్తా


వివాదాస్పద వ్యక్తులకు టిటిడి బోర్డు పదవులు కట్టబెట్టడం. నచ్చిన వారిని కొండ మీద అధికారం ఇచ్చి కూర్చోబెట్టడం. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం. తప్పులు ఎత్తి చూపిన ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు వేయడం. రాష్ట్రంలో ఆలయాలు కూల్చేయడం. ఇదీ చంద్రబాబు తీరు. స్వతంత్రవ్యవస్థలా పనిచేసే తిరుమల తిరుపతి దేవస్థాన కార్యకలాపాల్లో టిడిపి సర్కారు జోక్యం రోజు రోజుకూ అధికం అవుతోంది. సొంత వాళ్లను కొండపై అధికారం కట్టబెట్టడం నుంచి, టిడిపి పాలనా వ్యవహారాల్లోనూ, విధి విధానల్లోనూ జోక్యం చేసుకుని, పెత్తనాలు చేస్తుండటం భక్తుల విమర్శకలు కారణం అవుతోంది. 

శ్రీవారి సేవల్లో పెద్దల ఆంక్షలు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో ప్రజలు తమ బాధలను మరిచిపోతారు. ఆ పవిత్ర స్థలంలో అపవిత్ర కార్యాలు, అన్యాయాలు జరగవని నమ్ముతారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం టిటిడిలో ఆగమ శాస్త్రవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతోంది. శ్రీవారి మేలుకొలుపు అయిన సుప్రభాత సేవను శాస్త్ర విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. తోమాల వంటి సేవలను తక్కువ సమయంలో పూర్తి కావాలని అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారు. స్వామివారి ప్రసాదాల నివేదనలో ఆంక్షలు ఎక్కువౌతున్నాయి. సేవల్లో సాధారణ ప్రజల కంటే టిడిపి అధికార పక్ష నేతలు, వారి అనుయాయులు, వారి సిఫారుసు వ్యక్తులకు పెద్ద పీట వేయడం జరుగుతోంది. ఆ శ్రీనివాసుని ముందు అంతా సమానమే అన్న భావాన్ని మంటగలుపుతూ అధికార దర్పాన్ని, అహంకారన్నీ ప్రదర్శించే రీతిలో టిడిపి సర్కార్ ప్రవర్తించడాన్ని కూడా అటు భక్తులు, ఇటు టిటిడి అధికారులు నిరసిస్తున్నారు. అర్చకుల నియామకం, వారికి ఉద్యోగ విరమణ వయసు అంటూ కొత్త విధానాలకు బాబు తెరలేపుతున్నారు. కొండపై జరగుతున్న అవినీతి కార్యకలాపాలపై ప్రశ్నించినందుకు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేసింది చంద్రబాబు ప్రభుత్వం. అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తే, జరిగిన వాటిపై విచారణ జరపాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపైనే చర్యలు తీసుకోవడం చూస్తే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతోందో అర్థం అవుతుంది. సర్వస్వతంత్రమైన టిటిడి వ్యవహారాల్లో ఇలా ప్రభుత్వ ఆధిపత్యం కేవలం చంద్రబాబు హయాంలోని ఎక్కువగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

అన్నీ అపచారాలే

గతంలో వేయికాళ్ల మంటపాన్ని కూలదోయించాడు చంద్రబాబు. విజయవాడలో ఎన్నో ఆలయాలను కూలదోయించాడు. చివరకు ఆయన ఆడంబరంగా పెట్టిన గంగా హారతిలో కాళ్లకు చెప్పులు వేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. బెజవాడ కనకదుర్గ ఆలయంలో క్షుద్రపూజలు జరిగాయి. శ్రీకాళ హస్తిలోనూ తాంత్రిక పూజలు జరిగనట్టు ఆధారాలు లభించాయి. చంద్రబాబు హయాంలో అడుగడుగునా అపశృతులు, అపచారాలే జరిగాయి. 

అన్యమతస్థుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దమ్ముందా?

హిందూ దేవాలయాలను కూలదోసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు చేపడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, అన్యమతస్థుల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే సాహసం చేయదు. మసీదులు, చర్చిలు, వారి మత వ్యవహారాల్లో హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగున్న ప్రచారాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందిచిన దాఖలాలు లేవు. కానీ అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థ అయిన టిటిడిని మాత్రం తన గుప్పెట్లో పెట్టుకోవాలని మాత్రం చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. భక్తుల నమ్మకానికి నిలయమైన పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సొంత ఆస్తిలా ఉపయోగించాలనుకుంటున్నాడు. చంద్రబాబు చేసే ఈ అన్యాయం పై నేడు అర్చకస్వామి రమణదీక్షితులు తిరగబడ్డట్టే, రేపు భక్తులు, యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారనడంలో సందేహం లేదు. 
Back to Top