షర్మిలపై గిరిజనం అభిమాన వర్షం

శ్రీకాకుళం 02 ఆగస్టు 2013:

ఆత్మీయ అతిథికి గిరిజనం నీరాజనం పలికింది. రాజన్న ముద్దుబిడ్డ తమ గడ్డపై  అడుగు పెట్టగానే జగన్నినాదాలతో హోరెత్తించారు.  ఏజెన్సీ, మైదాన ప్రాంతాల కలబోత మధ్య దివంగత మహానేత డాక్టర్  వైయస్ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అప్రతిహతంగా సాగుతోంది.
 పలాస నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించినప్పుడు ఇదే ప్రాంతంలో మహానేత, శ్రీ జగన్మోహన రెడ్డితో కలిసి తీసుకున్న ఫొటో అల్బమ్‌ను పలాసకు చెందిన అనిల్ శర్మ శ్రీమతి షర్మిలకు చూపారు. కొల్లి తవిటమ్మ  తనకు వితంతు పింఛను అందని విషయాన్నిశ్రీమతి వైయస్ షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. పదనాపురంలో తాడేల మంగమ్మ తాగునీరు, రోడ్డు సదుపాయం లేదంటూ మొరపెట్టుకున్నారు.  పీకే ఆర్ పురంలో దొర అచ్చమ్మ  ‘రాజన్న పోయాక పేదోళ్ల బతుకులు బుగ్గిపాలు’ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హీరాపురం వద్ద సర్పంచ్  సవర లింగరాజు, ఆయన సతీమణి, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు వజ్రమ్మ ఆమెను కలిసి రాజన్న దయవల్లే సర్పంచ్ పీఠం దక్కించుకోగలిగామని చెప్పారు.
 
 పెద్దమడి వద్ద పెద్దింది సుజాతమ్మ, కెంబూరి చిన్నమ్మ పుష్పగుచ్చాలను అందించి ఆత్మీయంగా పలకరించారు.  ఎస్టీ బాలికల వసతి గృహం  విద్యార్థినీ విద్యార్థులు వందల సంఖ్యలో బారులు తీరి ఆమెతో కరచాలనం చేశారు.  దాసుపురం వద్ద గిరిజన చిన్నారి సవర జయమ్మకు పార్టీ కండువా వేసి అభినందించారు. దాసుపురం శివారున ఆఫ్‌షోర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో ముచ్చటించారు. అనంతరం పలాస నియోజకవర్గంలోకి ప్రవేశించారు.  రేగులపాడు, టెక్కలిపట్నం, మొదుగుల పుట్టి, భంజీరాపేట, ఒండ్రుకుడియ మీదుగా వీరభద్రాపురానికి షర్మిల చేరుకున్నారు.
 
 రేగులపాడు వద్ద నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు, పలువురు నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. టెక్కలి పట్నం వద్ద క్రైస్తవ సోదరులు శ్రీమతి షర్మిలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొదుగులపుట్టిలో అక్కడ ప్రత్యేకమైన మొగలిపువ్వులతో స్వాగతంలో పలికారు. వేల కిలోమీటర్లపైగా నడిచి వచ్చిన షర్మిలమ్మకు వీరభద్రాపురంలో మహిళలు, స్థానికులు  కొవ్వొత్తులతో సాదర స్వాగతం పలికారు.

Back to Top